కేసీఆర్‌కు కవిత సంచలన లేఖ..!

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశించి కూడా లేఖలో రాసుకొచ్చారు.;

Update: 2025-05-22 13:57 GMT

తెలంగాణ రాజకీయాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. మాజీ సీఎం కేసీఆర్‌కు పార్టీ ఎమ్మెల్సీ, ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత రాసిన లేఖ అంటూ ఆరు పేజీల లేఖ ప్రస్తుతం రాష్ట్రమంతటా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ఇందులో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. పార్టీ మీటింగ్ సక్సెస్ అయ్యిందంటూనే లోపాలను బయటపెట్టారు. పాజిటివ్ ఫీడ్‌బ్యాక్‌, నెగిటివ్ ఫీడ్ బ్యాక్ అంటూ రెండు పార్టులుగా లేఖను రాశారు. తెలంగాణ అంటే బీఆర్ఎస్, తెలంగాణ అంటే బీఆర్ఎస్ అని మీరు బలంగా చెబుతారని చాలా మంది భావన అని కూడా పేర్కొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పు, తెలంగాణ గీతం మార్పుపై మీరు ప్రశ్నిస్తారని చాలా మంది ఎదురుచూశారని వెల్లడించారు.

బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ సమయంలో కేసీఆర్ ఇచ్చిన ప్రసంగాన్ని ఉద్దేశించి కూడా కవిత లేఖలో రాసుకొచ్చారు. ఆయన స్పీచ్ బాగుందని అంటూనే అందులో మరింత పంచ్ ఉంటుందని కేడర్ భావించిందని, కానీ అది తగ్గిందని చెప్పకనే చెప్పారు. అదే విధంగా మైనారిటీలకు అన్యాయం చేసేలా వక్ఫ్ సవరణ బిల్లు వచ్చిన సమయంలో కూడా మీరు మౌనంగా ఉండటాన్నిచాలా మంది తీసుకోలేకపోయారని పేర్కొన్నారు.

‘‘వరంగల్ సభలో కేసీఆర్ స్టేజ్ పైకి వచ్చే ముందు సీనియర్ నేతలు మాట్లాడి ఉండాల్సింది. 2001 నుంచి మన పార్టీలో ఉన్న వారు ప్రసంగిస్తే బాగుండేది. ధూంధాం కార్యకర్తలను ఆకట్టుకోవడంలో మనం విఫలం అయ్యాం. బీజేపీపై ఇంకా బలంగా మాట్లాడితే బాగుండేది. భవిష్యత్తులో బీజేపీతో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటారని చాలా మంది ప్రచారం చేస్తున్నారు. నేను కూడా బీజేపీ వల్ల చాలా ఇబ్బంది పడ్డాను డాడీ. బీజేపీని ఇంకొంచెం టార్గెట్ చేయాల్సిందేమో డాడీ. మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం పోటీ చేయకుండా బీజేపీకి మద్దతు ఇచ్చామన్న మెసేజ్ కాంగ్రెస్ బలంగా తీసుకెళ్లింది. ఈ పొలిటికల్ సినారియోను అడ్రెస్ చేయడానికి స్పెసిఫిక్ ప్రోగ్రామ్స్ గైడ్ లైన్స్ ఇస్తారని అంతా భావించారు. ఇప్పటికైనా 1-2 ప్లీనరీ పెట్టాలి’’ అని ఆమె కోరారు.

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశాన్ని మర్చిపోవడం, ఎస్సీ వర్గీకరణ విషయాన్ని టచ్ చేయకపోవడం నెగిటివ్ ఇంప్రెషన్ ఇచ్చాయని కవిత తన లేఖలో వివరించారు. అంత పెద్ద మీటింగ్‌కు పాత ఇంచార్జులను ఇవ్వడంపై కొన్ని నియోజకవర్గాల్లో పార్టీపై నెగిటివిటీ పెరిగిందని అన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో ఇన్‌ఛార్జ్‌లే బీఫార్మ్‌లు ఇస్తారని ప్రచారం చేసుకుంటున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ZPTC, ZP చైర్మన్‌, ఎమ్మెల్యే స్థాయి నేతలు.. మిమ్మల్ని కలిసే అవకాశం దొరకడం లేదని బాధపడుతున్నారని.. అందరికీ అందుబాటులో ఉండాలని కేసీఆర్‌ను కోరారు కవిత.


కవిత రాయలేదా..!


కవిత పేరిట ఆరు పేజీల లేఖ సంచలనంగా మారిన క్రమంలో ఇదంగా తప్పుడు వార్తలంటూ కొందరు విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు. కవిత కావాలంటే కేసీఆర్‌కు నేరుగా లేఖ అందించగలరని, అలాంటిది ఇలా ఎందుకు పంపుతారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా కవిత.. చేతిరాతలో లేఖ ఎందుకు రాశారన్న వాదనను వినిపిస్తున్నారు. దీంతో అసలు ఈ లేఖ కవితే రాశారా? లేదా? అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

Tags:    

Similar News