హరీష్ రావుపై కవిత కామెంట్స్.. భగ్గుమన్న బిఆర్ఎస్ శ్రేణులు
మునుపెన్నడూలేని గ్రూపు రాజకీయాలు;
హరీశ్ రావుపై కవిత వ్యాఖ్యలను బిఆర్ ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, బిఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. దుబ్బాకఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హరీష్ రావుపై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర: కొత్త ప్రభాకర్ రెడ్డి
‘‘చెరిపేస్తే చెరిగిపోయేది కాదు చరిత్ర,దాచేస్తే దాగేది కాదు హరీశ్ అన్న ఉద్యమ ప్రస్థానం’’ అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
పార్టీ పెట్టిన నాడు హరీశ్ రావు కేసీఆర్ వెంట లేనేలేరనడం హాస్యాస్పదం అని ఆయన అన్నారు.
‘‘2001 ఏప్రిల్ 27న కొండా లక్ష్మణ్ బాపూజీ నివాసం జలదృశ్యంలో టీఆర్ఎస్ పార్టీ పురుడు పోసుకుంది. సుదర్శన్ రావు, నాయిని నర్సింహారెడ్డి, హన్మంతరావు, గాదె ఇన్నయ్య, వి. ప్రకాశ్, నిమ్మ నర్సిం హారెడ్డి, నారాయణరెడ్డి, గొట్టె భూపతి, మందాడి సత్యనారాయణరెడ్డి, హరీశ్ రావు తదితరులు ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ కాళ్లమీద పడి హరీశ్ రావు సరెండర్ అయ్యారని ఆరోపించడం వెర్రి తనమే అవుతుంది’’ అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
హరీశ్ రావు లాంటి వ్యక్తి ఏం జరిగినా.. క్యారెక్టర్ ను మాత్రం చంపుకునే వ్యక్తి కాదు. పైగా రేవంత్ లాంటి వ్యక్తి దగ్గరకు పోయి సరెండర్ అవడం అసలు జరగని పని ఆయన అన్నారు. కేసీఆర్ కు హరీశ్ నీడ లాంటి వాడు అని ఆయన పేర్కొన్నారు.
ఎప్పుడో గజ్వేల్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒంటేరు ప్రతాపరెడ్డి తన ప్రత్యర్థిపై చేసిన రాజకీయ ఆరోపణల వీడియో క్లిప్ ను కాంగ్రెస్ వాళ్లు తెరమీదకు తీసుకొని వస్తే.. దాన్ని పట్టుకొని.. కేసీఆర్ ను ఓడించడానికి హరీశ్ రావు కుట్ర చేశారని ఆరోపించడం ఎనిమిదో వింత అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
అంతే కాదు. గతంలో సిద్దిపేట , గజ్వేల్ లో కేసీఆర్ నామినేషన్ వేసిన నాటి నుంచి గెలుపు ధృవీకరణ పత్రం తీసుకొనేంత వరకూ సమస్త బాధ్యతలు నిర్వహించేది, నిర్వహిస్తున్నది హరీశ్ రావేనని ఆయన అన్నారు.
1999లో, 2004 లో సిద్దిపేట లో కేసీఆర్ గెలిచిన తరువాత ఆయన గెలుపు ధృవీకరణ పత్రాలను దాదాపుగా స్వీకరించింది హరీశ్ రావే అని ఆయన గుర్తు చేశారు.
అలాంటి హరీశ్ రావుపై కేసీఆర్ ను, కేటీఆర్ ను ఓడగొట్టడానికి కుట్రచేశారని ఆరోపిస్తే.. సూర్యుడిపై ఉమ్మివేసినట్టు కాదా?కవిత తీహార్ జైల్లో ఉన్నప్పుడు పలుమార్లు ములాఖత్ కు వెళ్లి ధైర్యం చెప్పిన వ్యక్తి.. కేటీఆర్ తో కలిసి న్యాయపోరాటం విషయంలో అండగా నిలిచిన వ్యక్తి, ఆమె జైలు నుంచి బయటకు వస్తున్నప్పుడు జైలు బయట వేచిచూసి.. బయటకు రాగానే ఆమె మూటలు పట్టుకున్న వ్యక్తి హరీశ్ రావు అని ఆయన అన్నారు.హరీశ్ రావు నిజాయితీని శంకించడం అంటే సూర్యుడిలో మచ్చను వెతకడం వంటిదే అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
తాను ఎన్నిసార్లు వివరణలు ఇచ్చుకున్నా.. ప్రత్యర్థులతో పాటు, విలేఖరులు కూడా పదే పదే ఆయన నిజాయితీని ప్రశ్నిస్తుండటం వికృత రాజకీయాలకు పరాకాష్ట అని ప్రభాకర్ రెడ్డి అన్నారు.
ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం ద్వారా నిజం చేయాలనే ప్రయత్నం చేయడం హరీశ్ రావు విషయంలో గత ఏడెనిమిదేళ్లుగా జరుగుతూనే ఉన్నది అని ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు.
కవిత వ్యాఖ్యలు తగదు: పద్మా దేవేందర్ రెడ్డి
గత రెండు, మూడు రోజులుగా కవిత మాట్లాడుతున్న మాటలు చూస్తున్నాం. పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. కవిత తన తీరుతో పార్టీ కి ఎంతో నష్టం చేశారు. బీఆర్ఎస్‌కు సంపద లాంటి వ్యక్తి హరీష్ రావు.. ఆయనను బలహీనపరిచేలా వ్యాఖ్యలు చేస్తే తెలంగాణకు నష్టం కాదా..? అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ప్రశ్నించారు.
కార్యకర్తగా, నేతగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా అందరికీ అందుబాటులో ఉండి పనులు చేసిన వ్యక్తి హరీష్ రావు. నాడు హరీష్ రావు పనితీరును పొగిడిన వారే నేడు ఆరోపణలు చేస్తున్నారు అని ఆమె విమర్శించారు. వారికి ఎలా మనసు ఒప్పుతుందో అర్ధం కావడం లేదు. ఈటెల రాజేందర్ పార్టీ నుండి వెళ్లిపోవడంలో హరీష్ రావు పాత్ర లేదు అని ఆమె స్పష్టం చేశారు. కాళేశ్వరం ఎత్తిపోతల మీద శాసనసభలో హరీష్ రావు కాంగ్రెస్ డొల్లతనాన్ని ఎండగట్టారు. కవిత హరీష్ రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు.
హరీష్ రావు నిజాయితీ పరుడు: దేవీ ప్రసాద్
‘‘హరీష్ రావు నిజాయితీని, చిత్తశుద్ధిని అంగుళం కూడా పక్కకు జరుపలేకపోయారు. సోషల్ మీడియాలో ఎంత ట్రోల్ జరిగినా, ఎన్ని గాసిప్ లు సృష్టించినా ఆయన బెదరలేదు. చెదరలేదు అని దేవీ ప్రసాద్ అన్నారు. ‘‘ హరీష్ రావుకు తన వ్యక్తిత్వం ప్రధానం. దాని హననం చేయడాన్ని ఎంతమాత్రం సహించని వ్యక్తి అని ఆయన అన్నారు. మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు. పల్లె రవి కుమార్‌తో కలిసి దేవీ ప్రసాద్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
‘‘పార్టీ గీత దాటుతుందని కవితను కేసీఆర్ సస్పెండ్ చేశారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు తెలంగాణ వికాసాన్ని విధ్వంసంగా చిత్రీకరిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు అన్ని ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు పెట్టాలనుకుంటున్నాయి. అందులో భాగంగానే బీఆర్ఎస్‌లో కూడా చిచ్చు పెడుతున్నాయి అని ఆయన అన్నారు. కాళేశ్వరంలో అవినీతిని ఏజెన్సీలే తేల్చలేకపోయాయి. కవిత లాంటి వ్యక్తి తేలుస్తారా.. అని దేవీ ప్రసాద్ ప్రశ్నించారు. హరీష్ రావు కేసీఆర్ సైనికుడు, శ్రామికుడు అని దేవీ ప్రసాద్ కొనియాడారు. హరీష్ రావు ఎలాంటి వారో అందరికీ తెలుసు. కొందరు బురద జల్లినంత మాత్రాన హరీష్ రావు ప్రతిష్ట చెరిగిపోదు’’ అని దేవీ ప్రసాద్ పేర్కొన్నారు.
సిద్దయ్య లాంటి వ్యక్తి: నిరంజన్ రెడ్డి
వీరబ్రహ్మం చరిత్రలో సిద్ధయ్యలాగ కేసీఆర్ ఏది చెపితే అది హరీశ్‌రావు చేశారు అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీకి హరీశ్‌రావు గొప్ప సంపద అని ప్రస్తుతించారు.‘‘అసెంబ్లీలో కాళేశ్వరం కమిషన్ రిపోర్టును కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత సభలో హరీశ్‌రావు అధికార పక్షాన్ని అద్భుతంగా చెడుగుడు ఆడుకున్నాడు. 30 సార్లు ఆటంకం కలిగించినా అన్ని విషయాలను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని ఎండగట్టిన వ్యక్తి హరీష్ రావు అని నిరంజన్ రెడ్డి అన్నారు. ‘‘ఎవరి ప్రయోజనం నెరవేర్చడానికో, ఎవరికి బలం చేకూర్చడానికో కొంత మంది హరీశ్‌రావును టార్గెట్ చేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది’’ అని నిరంజన్ రెడ్డి అన్నాడు. ఆశ్చర్యకరంగా ఉంది. బీఆర్ఎస్‌పై చేస్తున్న కుట్రపూరిత ఆరోపణలరకు తావ్వికుండా చీల్చి చెండాల్సింది పోయి, ఖండించాల్సింది పోయి వారికి ఊతమిచ్చే విధంగా మాట్లాడడం బాధాకరం అని నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
‘‘కేసీఆర్ 2000లో పార్టీ ప్రారంభించినప్పటి నుంచి హరీశ్‌రావు ఉన్నారు. ఎదురు చెప్పకుండా, ప్రశ్నించకుండా.. వీరబ్రహ్మం చరిత్రలో కేసీఆర్ ఏది చెపితే అది సిద్ధయ్యలాగ హరీశ్‌రావు చేశారు’’ అని నిరంజన్ రెడ్డి అన్నారు. ‘‘పార్టీ కలర్ కోసం బేగం బజార్ పోయి రంగులు తీసుకొచ్చింది ఆయనే. జలదృశ్యంలో దిమ్మె కట్టించింది’’ హరీశ్‌రావే అని ఆయన అన్నారు. అ ఇవాళ శాసనసభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా క్రమశిక్షణ కలిగిన పార్టీ వర్కర్‌గా పని చేస్తున్నారు. ఇవాళ రివర్స్ గేర్ చేసి ఆయనను తులనాడి మాట్లాడడం మనసు ఎలా ఒప్పుకుంటుంది అని నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
‘‘ఇలాంటి నాయకులను బలహీన పరుచుకుంటే తెలంగాణ సమాజానికి నష్టం కలుగుతుంది. కాళేశ్వరం అనుమతుల కోసం 27 సార్లు మహారాష్ట్ర పోయిన వ్యక్తి హరీష్ రావు అని నిరంజన్ రెడ్డి అన్నారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనాన్ని కేటీఆర్, హరీశ్‌రావు ఎండగడుతున్నారు. ఎవరికి లాభం జరగాలని హరీశ్‌రావును టార్గెట్ చేస్తున్నారు..? కేసీఆర్‌కు వ్యక్తిగత సహాయకుడు సంతోష్ రావు. ఆయన గురించి మాట్లాడడం కూడా సరికాదు. భవిష్యత్ పట్ల ఏదేదో ఊహించుకుని మాట్లాడితే అది అపరిపక్వత అవుతుంది’’ అని నిరంజన్ రెడ్డి అన్నారు.