సీబీఐ దర్యాప్తు ఆపండి.. మళ్ళీ కోర్టుకెళ్లిన కేసీఆర్, హరీష్
కాళేశ్వరం కమిషన్‌పై సీబీఐ దర్యాప్తు జరగకుండా ఆపాలని కోరుతూ పిటిషన్ల దాఖలు.;
కేసీఆర్, హరీష్ రావుకు కాళేశ్వరం భయం పట్టుకుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై తెలంగాణ అసెంబ్లీ కీలక నీర్ణయం తీసుకుంది. దీనిని సీబీఐకి అప్పగించాలని డిసైడ్ అవుతూ ఆదివారం జరిగిన చర్చ సెషన్‌లో నిర్ణయం తీసుకుంది. అయితే ఇది కేసీఆర్, హరీష్‌లకు కంటిపైన కునుకులేకుండా చేస్తున్నట్లు ఉంది. ఏమీ అవినీతి లేదంటున్న వీరికి ఇంత ఉలికిపాటు ఎందుకో కూడా అర్థం కావడం లేదు. అర్థరాత్రి 1:30 గంటల సమయంలో అసెంబ్లీ నిర్ణయం చేయగా.. పొద్దునే కేసీఆర్, హరీష్ రావు.. కోర్టు మెట్లెక్కేశారు. సీబీఐ దర్యాప్తును ఆపాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేశారు. అంతేకాకుండా ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా కూడా ఆదేశాలు ఇవ్వాలని వారు పిటిషన్‌లో కోరారు.
విచారణ వాయిదా..
వారి పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ మంగళవారం ఉదయం 10:30 గంటలకు జరుపుతామని, దీనిని స్పెషల్ కేస్‌గా తీసుకోలేమని స్పష్టం చేసింది. అంతేకాకుండా కాళేశ్వరం నివేదికపై సీబీఐ విచారణను ఆపాలంటూ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వలేమని కూడా స్పష్టం చేసింది. మంగళవారం జరిగే విచారణలో పిటిషన్ దారులు తమ వాదనలు వినిపించుకోవాలని తెలిపింది. దీంతో కేసీఆర్, హరీష్‌కు హైకోర్టులో మరోసారి చుక్కెదురైంది.
10 గంటల పాటు సుదీర్ఘ చర్చలు..
అయితే ఆదివారం సాయంత్రం కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీ వేదికగా చర్చ ప్రారంభమైంది. అత్యంత వాడివేడిగా సాగిన ఈ చర్చ 10 గంటల పాటు సుదీర్ఘంగా సాగింది. మంత్రులు, ప్రతిపక్ష నేతల మాధ్య విమర్శలు ప్రతివిమర్శలు వినిపించాయి. మాటల తూటాలు సైగం భారీగా పేలాయి. చివరకు 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఆ తర్వాత కూడా గంటకుపైగా సభ సాగింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు లోపాలపై దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగించాలని తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ నిర్ణయాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
హరీష్‌కు మూడోసారి ఎదురుదెబ్బేనా..
అయితే కాళేశ్వరం కమిషన్ నివేదికపై హరీష్ రావు ఇప్పటికి రెండు సార్లు హైకోర్టును ఆశ్రయించారు. ఇది మూడోసారి. కేసీఆర్ దీంతో కలుపుకుని రెండు సార్లు హైకోర్టుకు వెళ్లారు. కానీ హరీష్‌కు ఇప్పటికే రెండు సార్లు న్యాయస్థానం చుక్కెదురైంది. తొలుత అసెంబ్లీ చర్చించాలని న్యాయస్థానం తెలిపింది. అనంతరం విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. మొన్న శనివారం వేసిన పిటిషన్‌ను న్యాయస్థానం నిరాకరించింది. ఇప్పుడు తాజాగా సీబీఐ దర్యాప్తును ఆపాలని, నివేదిక ఆధారంగా యాక్షన్ తీసుకోకుండా ఆదేశాలివ్వాలని కోరగా.. అది వీలు పడదని న్యాయస్థానం చెప్పింది. మంగళవారం జరిగే విచారణలో వాదనలు వినిపించుకోవాలని సూచించింది.
దీంతో కాళేశ్వరం ఉచ్చు రోజురోజుకు హరీష్, కేసీఆర్ మెడకు బిగుస్తున్నట్లు ఉందని విశ్లేషకులు అంటున్నారు. నిజంగా బీఆర్ఎస్ చెప్తున్నట్లే కాళేశ్వరంలో అవినీతి జరగకపోతే, కాంగ్రెస్ అధికార దుర్వినియోగం చేస్తూ కమిషన్ నివేదికను ఇప్పిస్తే.. అన్నీ సీబీఐ దర్యాప్తులో తేల్తాయి కదా.. వీరెందుకు ఇంత తొందర పడుతున్నారని విశ్లేషకులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఒక వేళ అవినీతి జరిగి ఉండి.. దానిని కప్పి పుచ్చుకోవాలని భావిస్తుంటే మాత్రం రూ.లక్ష కోట్ల వినీతి ఎంత దాచినా దాగదని కూడా హితవు పలుకుతున్నారు విశ్లేషకులు.