తెలంగాణ కోసం మళ్ళీ పోరాడాలి.. పార్టీ శ్రేణులకు కేసీఆర్ పిలుపు

కాంగ్రెస్‌కు ఓట్లేసినందుకు ప్రజలు కుమిలిపోతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు కేసీఆర్.;

Update: 2025-02-19 11:23 GMT

తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ దాదాపు ఏడు నెలల తర్వాత తెలంగాణ భవన్‌లో అడుగుపెట్టారు. ఆయన అధ్యక్షతన తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం తథ్యమని, పార్టీ శ్రేణులంతా ఆ లక్ష్య సాధనకోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌కు ఓట్లేసినందుకు ప్రజలు కుమిలిపోతున్నారని, బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ప్రజల్లో ఎవరికీ మంచి జరిగింది లేదని, సంక్షేమం అందింది లేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరిని అవలంబిస్తోందని విమర్శించారు.

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలైంది. ఒక్కటంటే ఒక్క విషయంలో కూడా సక్సెస్ కాలేదు. పథకాల అమలులో, సంక్షేమం అందించడంలో, శాంతిభద్రతలను కాపాడటంలో, విద్యార్థులకు అన్నం పెట్టడంలో సైతం కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పి అధికారం చేజిక్కించుకుంది, కానీ ఇప్పుడు దేని గురించి అడిగా బీఆర్ఎస్ అప్పులు చేసిందంటూ గులాబీ దళంపై బురదజల్లే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఆడుతున్న ఈ డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు, వాస్తవాలను వారు చూస్తూనే ఉన్నారు అని అన్నారు కేసీఆర్. ఈ రోజు జరిగిన సమావేశంలో పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ సాధించిన విజయాలు సహా బీఆర్ఎస్ ప్రస్థానం గురించి కేసీఆర్ మాట్లాడారు.

‘‘తెలంగాణ కోసం బీఆర్ఎస్ మాత్రమే పోరాడగలదు. ప్రజల కష్టాలను బీఆర్ఎస్ ఒక్కటే అర్థం చేసుకోగలదు. వారి కష్టాలను తీర్చగలదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూసే సత్తా ఉన్న పార్టీ బీఆర్ఎస్ ఒక్కటే. రాష్ట్రంలో వందకు వందశాతం బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. పోరాడి సాధించుకున్న తెలంగాణ మళ్ళీ వెనక్కిపోతోంది. పాతికేళ్ల స్ఫూర్తితో మళ్ళీ తెలంగాణను నిలబెట్టుకోవడానికి పోరాడాలి’’ అని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News