కేసీఆర్‌ కూడా జ్యుడిషల్ కమిషన్ నోటీసు...

జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్ కేసీఆర్ కి నోటీసులు పంపింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ) ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది.

Update: 2024-06-11 10:18 GMT

జస్టిస్ నరసింహా రెడ్డి నేతృత్వంలోని కమిషన్ మంగళవారం తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి నోటీసులు పంపింది. ఆయన పదవీకాలంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలలో (పీపీఏ) ప్రమేయంపై వివరణ కోరుతూ నోటీసు జారీ చేసింది. జూన్ 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ సూచించింది. దీనిపై స్పందించిన కేసీఆర్ జులై 30 వరకు గడువు కావాలని కమిషన్ కి విజ్ఞప్తి చేశారు.

యాదాద్రి, దామరచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలపై బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో పీపీఏలలో జరిగిన అవకతవకలపై జస్టిస్ నరసింహా రెడ్డి కమిషన్ దర్యాప్తు చేస్తోంది. విచారణలో ఛత్తీస్‌గఢ్‌ నుంచి 1,000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదన కూడా ఉంది. దర్యాప్తులో భాగంగా సోమవారం తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో మాజీ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.ప్రభాకరరావు, మాజీ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సురేష్‌ చందా కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. సురేశ్ చందా ఇంధన శాఖలో పనిచేసిన సమయంలో, ఛత్తీస్‌గఢ్ నుండి విద్యుత్‌ను కొనుగోలు చేయాలనే వివాదాస్పద ప్రతిపాదనలో తన ప్రమేయం కూడా ఉందనే అభియోగాలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.

ఇక, మాజీ సీఎం స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను ప్రారంభిస్తామని కమిషన్ హెచ్చరించింది. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వంతో పాటు భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్రాజెక్టులకు సంబంధించి పీపీఏలో జరిగిన అవకతవకలను వెలికితీయాలని జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ దృష్టి సారించింది. కొనసాగుతున్న విచారణలో భాగంగా ఈ నిర్ణయాల్లో భాగస్వామ్యం ఉన్న ఇతర అధికారులకు త్వరలో కమిషన్ నోటీసులు జారీ చేయనుంది.

కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే విద్యుత్ కొనుగోలు అంశంపై దృష్టి పెట్టింది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించింది. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. అదులో భాగంగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ను ఏర్పాటు చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విద్యుత్ ఒప్పందాలలో జరిగిన అక్రమాలను వెలికితీయాలని సూచించింది. ఈ వ్యవహారంలో విచారణ కొనసాగిస్తున్న జవహర్ రెడ్డి కమిషన్... నేడు కేసీఆర్ కి నోటీసులు జారీ చేసింది. 

Tags:    

Similar News