అసెంబ్లీ సమావేశాల ముంగిట పార్టీ నేతలతో కేసీఆర్ భేటీ..
అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బీఆర్ఎస్ నడుచుకోవాల్సిన తీరుపై వ్యూహాలు రచిస్తున్నారు.;
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలకు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ కూడా హాజరుకానున్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్.. తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలా నడుచుకోవాలి? ఏయే అంశాలపై చర్చించాలి? వంటి అంశాలపై చర్చించనున్నారు.
అంతేకాకుండా అసెంబ్లీలో చర్చించాల్సిన అంశాలు, బీఆర్ఎస్ నడుచుకోవాల్సిన తీరుపై వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపాలని కేసీఆర్ సూచించినట్లు సమాచారం. అదే విధంగా కొందరు నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటూ కొందరు పార్టీ బలోపేతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అలా చేస్తే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారని సంబంధిత వర్గాల నుంచి అందిన సమాచారం. అదే విధంగా పార్టీకోసం పని చేసే వారికి పార్టీ ఎళ్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించినట్లు తెలుస్తోంది.
అదే విధంగా అతి త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా కేసీఆర్ చర్చించి, పలు కీలక సూచనలు చేశారు. ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయడంతో పాటు పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. పార్టీ కోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని, అనుక్షణం ప్రజల సమస్యలు లేవనెత్తడంలో ముందుండాలని తెలిపారు. ప్రజల సమస్యలను, ప్రజల గొంతును చట్టసభల్లో వినిపించడంలో ఏమాత్రం తటపటాయించొద్దని సూచించారు. ప్రభుత్వం పెడుతున్న తప్పుడు కేసులకు భయపడొద్దని, ప్రతి ఒక్కరికీ తాము అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఇదిలా ఉంటే బడ్జెట్ సమావేశాలను బుధవారం నుంచి అంటే మార్చి 12 నుంచి ప్రారంభించాలని కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రివర్గం నిర్ణయించింది. ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అంశాలపై కూడా బిల్లులు ప్రవేశపెట్టాలని కూడా క్యాబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం వీటికి సంబంధించిన బిల్లులను ఎటువంటి న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా సిద్ధం చేయాలని సీఎం రేవంత్ సూచించారు. వాటి ప్రకారమే సిద్ధం చేసిన బిల్లులను ఈ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను శాసనసభ దృష్టికి తీసుకెళ్లాలని కేసీఆర్ సూచించారు. ఈ సమావేశంలో పలు ఇతర అంశాలపై కూడా కేసీఆర్.. పార్టీ నేతలతో చర్చించారు.