జూబ్లీహిల్స్ అభ్యర్థిగా సునీతను ప్రకటించిన కేసీఆర్
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నేతలకు సూచన.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీతను పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. ఈ విషయాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది. జూబ్లీహిల్స్ బరిలో గర్జించడానికి సునీత సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. శుక్రవారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పలువురు కీలక నేతలతో మాజీ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటల పాటు వారితో చర్చించారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలు, అవలంభించనున్న వ్యూహాలు వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగానే మాగంటి సునీతను పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. కాగా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక విషయంలో ఓటమికి తావు ఇవ్వకూడదని కేసీఆర్ సూచించారు. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని, ప్రతి అవకాశాన్ని ఒడిసి పట్టి సద్వినియోగం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. కట్టుదిట్టమైన వ్యూహాలు, ప్రణాళికలు సిద్ధం చేసి, వాటిని ఆచరించి విజయం సాధించాలని అన్నారు. ఈ సందర్భంగానే ఉపఎన్నిక బరిలో అనురించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలు, పాటించాల్సిన అజెండా వంటి విషయాల్లో నేతలకు దిశానిర్దేశం చేశారు.
‘‘అన్ని నివేదికలు కూడా ప్రతి అంశం పార్టీకి అనుకూలంగా ఉన్నాయనే చెప్తున్నాయి. క్షేత్రస్థాయిలో కార్యకర్తలను అప్రమత్తం చేయాలి. వారి ద్వారా ఓటర్లలో అవగాహన తీసుకురావాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజల్లో కాంగ్రెస్ విశ్వాసం కోల్పోయింది. కాంగ్రెస్‌కు వద్దని రాష్ట్ర ప్రజలు వేచిచూస్తున్నారు. తమను మోసం చేసిన కాంగ్రెస్‌కు తగిన బుద్ది చెప్పాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ప్రజలను రెడీగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ వైఫల్యాలను, చేతకాని తనాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలి. అదే విధంగా బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలి’’ అని కేసీఆర్ తెలిపారు.
‘‘అతి త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా వస్తున్నాయి. కాబట్టి క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలను హైఅలెర్ట్‌లో ఉంచండి. పార్టీ శ్రేణులన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ క్షణాన జరిగినా ఎదుర్కోవడానికి రెడీగా ఉండాలి. స్థానిక ఎన్నికల్లో కూడా గులాబీ జెండానే ఎగరాలి. కాంగ్రెస్‌ను చిత్తుచిత్తు చేయాలి’’ అని కేసీఆర్ చెప్పుకొచ్చారు. కేసులు, అరెస్ట్‌లకు భయపడొద్దని ఈ నేపథ్యంలో కేసీఆర్ భరోసా ఇచ్చారు. కార్యకర్తలకు పార్టీ ఎప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు.