Harish Rao | బీఆర్ఎస్‌కు కేసీఆరే సుప్రీం..

కాంగ్రెస్‌కు హరీష్ రావు స్ట్రాంగ్ కౌంటర్.;

Update: 2025-09-05 07:41 GMT

మేడిగడ్డ విషయంలో కాంగ్రెస్ కావాలనే కాలయాపన చేస్తోందంటూ మాజీ మంత్రి హరీస్ రావు విమర్శలు గుప్పించారు. మూడు పిల్లర్లు కొంచెం దెబ్బతింటే వాటిని రిపేర్ చేయించాల్సింది పోయి కావాలనే రాద్దాంతం చేస్తోందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లండర్ పర్యటనలో ఉన్న హరీష్ రావు అక్కడ నిర్వహించిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక అంశాలపై స్పందించారు. కవితపై వేటు సహా మేడిగడ్డ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ, కాళేశ్వరం విషయం అంతా కూడా బీఆర్ఎస్, కేసీఆర్‌పై కాంగ్రెస్ కక్కుతున్న విషమే అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి ఏడాదిన్నర అవుతుందని, ఇప్పటి వరకు ఈ ప్రభుత్వం ఏం చేసింది? అని ప్రశ్నించారు. ఎప్పటికప్పుడు తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం తప్ప మరేం చేయలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వ్యాఖ్యానించారు.

హైడ్రాతో కుప్పకూలిన రియల్‌ఎస్టేట్

కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ధిని తిరోగమనం పట్టించిందంటూ ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రానికి జరిగిన మేలు ఒక్కటి కూడా లేదన్నారు. హైడ్రా వల్ల హైదరాబాద్‌లో రియల్‌ఎస్టేట్ రంగం కుప్పకూలిందని హరీష్ రావు చెప్పుకొచ్చారు. మేడిగడ్డ మూడు పిల్లర్లు కుంగితే రేవంత్ సర్కార్ రాద్ధాంతం చేస్తుందే తప్ప వాటిని ఎలా రిపేర్ చేయాలన్న అంశంపై ఫోకస్ పెట్టడం లేదన్నారు. ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన, ఆశయం ఉంటే ముందు ప్రాజెక్ట్‌ను సరిచేయడంపై దృష్టి పెట్టేవారని, అలా కాకుండా కేసీఆర్, బీఆర్ఎస్‌పై బురదజల్లి రాజకీయ మైలేజీ పెంచుకోవాలనుకున్నారు కాబట్టే ఏడాదిన్నరగా విచారణ పేరుతో కాలక్షేపం చేసి గత ప్రభుత్వం బురదజల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కేసీఆర్ డెసిషన్ ఫైనల్..

అనంతరం కొంతకాలంగా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కూడా హరీష్ రావు స్పందించారు. బీఆర్ఎస్ పార్టీకి కేసీఆరే అధినేత, సుప్రీం అని చెప్పారు. ఎవరి విషయంలో అయినా నిర్ణయం పార్టీదేనని, కేసీఆర్ చెప్పిందే ఫైనల్ అని అన్నారు. తనకు ప్రజలకు సేవ చేయడమే కేసీఆర్ నేర్పించారని అన్నారు. అయితే హరీష్ రావు చేసిన ఈ వ్యాఖ్యలు కవిత వివాదాన్ని ఉద్దేశించే అన్న చర్చ మొదలైంది. కవిత సస్పెన్షన్‌ను కొందరు విమర్శిస్తున్న క్రమంలోనే హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కేసీఆర్‌కు ప్రజలు, పార్టీనే ముఖ్యమని ఇప్పటికే పలువురు నేతలు పునరుద్ఘాటించారు. ఎవరైనా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో నేత ఎవరైనా ఒకే విధమైన చర్య ఉంటుందని హరీష్ రావు చెప్పారు.

Tags:    

Similar News