Kavitha | ‘కేసీఆర్ పాలనలో నిధులు వరదలయ్యాయి’.. రేవంత్‌పై కవిత సెటైర్లు..
కేసీఆర్(KCR) ఒక మొక్క అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సెటైర్లు వేశారు.
మాజీ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అలియాస్ కేసీఆర్(KCR) ఒక మొక్క అని రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) సెటైర్లు వేశారు. రేవంత్ మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని, కేసీఆర్ గురించి రేవంత్ మాట్లాడటం మరీ వింతగా ఉందంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ సందర్బంగా తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఆమె తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ కార్యకర్తలను వేధిస్తూ చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.
అధికారం ఉంది కదా ఏమి చేసినా చెల్లుబాటవుతుందనుకుంటే కుదరదని, ఎవరికీ అధికారం, పదవి శాశ్వతం కాదని గుర్తుంచుకోవాలంటూ హితవు పలికారు. అధికారం ఈరోజు మీ దగ్గర ఉండొచ్చని, రేపు మళ్ళీ చెంతకు చేరుతుందని, అప్పుడు మెత్తితో సహా తిరిగిస్తామని హెచ్చరించారు. కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తలతో కవిత ఈరోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిలో ధైర్యం నింపారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడొద్దని, ప్రతి కార్యకర్తకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అనంతరం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు గుప్పించారు.
‘‘కేసీఆర్ ఒక మొక్క అని రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. కేసీఆర్ మొక్క కాదు ఒక వేగుచుక్క. రేవంత్ రెడ్డి గురువులకే చుక్కులు చూపించి తెలంగాణను సాధించిన శక్తి. కేసీఆర్ పాలనలో తెలంగాణలో నిధులకు ఢోకా లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తిట్ల పరిపాలన సాగుతోంది. చేనేత పరిశ్రమపై బ్రిటీష్ పాలనలో కూడా లేని పన్నులను.. ప్రధాని మోదీ ప్రభుత్వం విధిస్తోంది. జీఎస్టీ రూపంలో నేతన్నల రక్తం పీలుస్తోంది బీజేపీ ప్రభుత్వం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జీఎస్‌టీని రీయింబర్స్ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. తీరా అధికారం వచ్చిన తర్వాత ఆ హామీని మర్చిపోయారు. దీనిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తునస్నాం’’ అని పేర్కొన్నారు.