ఏడాది తర్వాత నేడు ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి అసెంబ్లీకి కేసీఆర్

తెలంగాణ ప్రతిపక్ష నేత కేసీఆర్ ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి ఏడాది కాలం తర్వాత మొదటిసారి నేడు అసెంబ్లీకి రానున్నారు. దీంతో అందరి దృష్టి కేసీఆర్ పై నిలిచింది.;

Update: 2025-03-12 00:32 GMT

గులాబీ బాస్, ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ బుధవారం నుంచి ఎర్రవెల్లి ఫాం హౌస్ నుంచి కదనరంగంలో దిగబోతున్నారు. బుధవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకానున్నారు. బడ్జెట్ పై ప్రతిపక్ష నేతగా మాట్లాడనుండటంతో అందరి దృష్టి కేసీఆర్ పై పడింది.బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా వరంగల్ నగరంలో ఏప్రిల్ 27వతేదీన భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని గులాబీ దళపతి నిర్ణయించారు. అసెంబ్లీకి రాకుండా ఫాంహౌస్ కే పరిమితమైన ప్రతిపక్ష నేత ఇక జనం మధ్యకు వస్తారని ఆయన తనయుడు కేటీఆర్ ప్రకటించారు.


బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్
తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు కేసీఆర్ హాజరు కానున్నారు. 2023వ సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం కేసీఆర్ గత ఏడాది ఒక్క రోజు సమావేశానికి అలా వచ్చి, ఇలా వెళ్లారు. ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకొని కోలుకున్నాక కేసీఆర్ ఎర్రవెల్లి ఫాంహౌస్ కే పరిమితమయ్యారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వచ్చి ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరినా, ఆయన రాలేదు. గతంలో తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి కూడా కేసీఆర్ దూరంగా ఉన్నారు.

కేసీఆర్ స్థాయి ఎవరికీ లేదు : కేటీఆర్
తెలంగాణ ఉభయ సభల్లో తన తండ్రి కేసీఆర్ స్థాయి ఎవరికీ లేదని కేటీఆర్ వ్యాఖ్యానించారు.కేసీఆర్ రోజువారీ సమావేశాలకు దూరంగా ఉండటమే తమ అభిమతమని కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రజావాణిని ఉభయసభల్లో వినిపించేందుకు వీలుగా కేసీఆర్ బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను నియమిస్తారని కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ భవన్‌లో సందడి
ఏడాది కాలంగా ఎర్రవెల్లి ఫాంహౌస్ కే పరిమితమైన కేసీఆర్ అక్కడ నుంచే అడపాదడపా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. ఏడాది కాలం తర్వాత ఫాంహౌస్ నుంచి తెలంగాణ భవన్ కు కేసీఆర్ రావడంతో సందడి నెలకొంది. పలువురు బీఆర్ఎస్ నేతలు, ప్రజలు కేసీఆర్ ను కలిసి మాట్లాడారు. నల్లగొండ రైతు బోర్ల రాంరెడ్డి కేసీఆర్ ను కలిసి రైతులు పడుతున్న కష్టాలను వివరించారు. తెలంగాణ రైతులకు మళ్లీ పాత గతే వచ్చిందని, నీళ్లు లేవు, కరెంటు లేదు, పెట్టుబడి సాయం లేదని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆరోపించారు.కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు.‘‘ నిండుగా నీళ్లతో ఉన్న ప్రాజెక్టులు, అలుగుల వారిన ప్రాజెక్ట్ లు, నేడు అడుగంటుకుపోయి ఎండుకపోయినయి..నాకు రుణమాఫీ కాలేదు, బోనస్ రాలేదు, రైతు భరోసా రాలేదు కావాలంటే నా బ్యాంక్ అకౌంట్, పాస్ బుక్ చూస్కోవచ్చు’’అని రైతు బోర్ల రాంరెడ్డి ఆవేదనగా కేసీఆర్ కు చెప్పారు.

కేసీఆర్ ను కలిసిన దాసోజు శ్రవణ్
ఎమ్మెల్సీగా నామినేషన్ వేసిన దాసోజు శ్రవణ్ కేసీఆర్ ను తన కుటుంబసమేతంగా వచ్చి కలిశారు. ఎమ్మెల్సీగా తనకు అవకాశం ఇచ్చిన సందర్భంగా నామినేషన్ అనంతరం స్క్రూటినీ పూర్తిచేసుకున్న డాక్టర్ దాసోజు శ్రవణ్ కేసీఆర్ ను కలిసి గ్రూప్ ఫొటో దిగారు.మంగళవారం కేసీఆర్ ను కుటుంబ సమేతంగా కలిసిన దాసోజు శ్రవణ్ కృతజ్ఞతలు తెలియజేసి, ఆశీర్వాదం తీసుకున్నారు.

పెండింగ్ బిల్లులపై పోరాటం
రైతుభరోసా కోసం కేటాయించిన నిధులను బడా కాంట్రాక్టర్ల పెండింగ్‌ బిల్లుల కోసం మళ్లించి, ప్రతి బిల్లులో 20శాతం కమీషన్ వసూలు చేస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపించింది. కమీషన్ల కోసం రైతుల పొట్టకొట్టారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించండి : కేసీఆర్
తాను అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించిన కేసీఆర్ తన తోటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశా నిర్దేశం చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ శాసనసభ, మండలి సభ్యులందరూ నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. తెలంగాణ ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఆయన కోరారు.రాష్ట్ర ప్రభుత్వ అవినీతిపై, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై చీల్చి చెండాడాలని పిలుపునిచ్చారు.రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలు,ఎండిన పంటలు, అందని కరెంట్, అందని సాగునీరు, కాలిపోతున్న మోటార్లు తదితర రైతాంగ సమస్యలపై, మంచినీటి కొరతపై అసెంబ్లీలో, మండలిలో పోరాడాలని కేసీఆర్ కోరారు. కాంగ్రెస్ తన ఆరు హామీలు సహా తన వాగ్దానాలను అమలు చేయడంలో విఫలమైనందుకు, రుణమాఫీ, రైతు భరోసా, అనేక ఇతర సంక్షేమ కార్యక్రమాలపై రైతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ తన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూచించారు.


అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీకి కేసీఆర్ : మంత్రి కోమటిరెడ్డి

అనర్హత వేటు పడుతుందనే భయంతోనే ప్రతిపక్ష నేత కేసీఆర్ బుధవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు అవుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. గతంలో కొండగట్టు బస్సు ప్రమాదం, మాసాయిపేట రైలు ప్రమాదంలో ప్రజలు మరణించినా కేసీఆర్ రాలేదని, ఆయనకు ప్రజాసమస్యలు పట్టవని మంత్రి విమర్శించారు. ఏడాది కాలంగా ఫాం హౌస్ లోనే మకాం వేసిన కేసీఆర్ అనర్హత వేటు పడుతుందనే అసెంబ్లీ సమావేశాలకు రావాలని నిర్ణయించుకున్నారని మంత్రి చెప్పారు.




Tags:    

Similar News