మీ జైళ్లకు తోకమట్టకు బెదిరేదిలేదు -కేసీఆర్

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. ప్రజలను బాధ పెడుతున్నారు.. అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2024-04-24 16:25 GMT

సక్కగున్న తెలంగాణలో ఉడుముల్లా సొచ్చి అవస్థలు తెస్తున్నరు.. నీళ్లు ఇవ్వకుండా ప్రజలను బాధ పెడుతున్నారు.. అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం ఆయన చేపట్టిన బస్సు యాత్రలో భాగంగా బుధవారం రాత్రి మిర్యాలగూడలో రోడ్ షో నిర్వహించారు. కార్యక్రమానికి తరలివచ్చిన ప్రజలని ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

రోడ్ షో లో కేసీఆర్ స్పీచ్...

ఈ రోజు పార్లమెంట్‌ ఎన్నికల సందర్భంగా మళ్లీ మీ ముందుకు రావడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో. నాలుగైదు నెలల కిందట ధీమాగా ఉన్న రైతు ఈ రోజు దిగాలుపడి చాలా బాధలో ఉన్నాడు. ఆ నాడు నేను నీళ్ల కోసం, నిధుల కోసం, కరెంటు కోసం, మన ప్రజల కోసం ఉద్యమిస్తే.. 15 సంవత్సరాల పోరాటం తర్వాత బ్రహ్మాండంగా మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం’ 

‘ప్రజలను ఎందుకు బాధలు పెడుతున్నరు? మిగులు కరెంటు ఉండే పద్ధతిలో మేం చేశాం. ఆ మాత్రం మీకు చేయ చేతనైతలేదా? సరఫరా జరిగిన కరెంటును అలాగే ఇవ్వచ్చు కదా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు?

మిషన్‌ భగీరథతో మంచినీళ్లు తెచ్చి అర్బన్‌ ఏరియాలో.. మున్సిపల్‌ ఏరియాలో అన్నివర్గాల పేదలకు దొరకాలని ఒక్కరూపాయికే నల్లా కనెక్షన్‌ ఇచ్చాం. ప్రతి ఇంట్లో నల్లా బిగించి ప్రతి ఇంటికీ నళ్లా నీరందించాం. ఇవాళ మిషన్‌ భగీరథ ఎందుకు నడుపలేకపోతున్నరు. కాంగ్రెస్ తెలివితక్కువ తనం ఏందీ? దయచేసి ప్రజలు ఆలోచించాలి.

ఆ నాడు నీళ్లకోసమే గోస. నాలుగైదు నెలలకే.. కేసీఆర్‌ పక్కకు జరుగంగనే నీళ్లు ఎందుకు మాయమై పోయినయ్‌? ప్రజలను ఎందుకు బాధపెడుతున్నరు? సమాధానం చెప్పాలి.

కేసీఆర్ ఆనవాళ్లు లేకుంటా చేస్తారా? మీరు జైల్లో పెడుతారా.. మీ జైళ్లకు తోకమట్టకు బెదిరేదిలేదు. పదిహేను ఏండ్లు పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించి.. పదేండ్లు అభివృద్ధి చేసిన నన్ను పట్టుకుని పేగులు తీస్తాం.. మెడలేసుకుంటాం అంటారా? ముఖ్యమంత్రిగా ఉండి మాట్లాడే భాష ఇదేనా? అంటూ సీఎం రేవంత్ పై కేసీఆర్ నిప్పులు చెరిగారు.

Tags:    

Similar News