కాంగ్రెస్ అంటే అభివృద్ధి అని తెలంగాణ ప్రభుత్వం మరోసారి ఢంకా మోగించి చెప్పిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే అందుకు పూర్తి క్రెడిట్ కార్యకర్తలకే దక్కుతుందని కొనియాడారు. కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి తెలంగాణలో కూడా బీజేపీనే వస్తుందని చాలా మంది అన్నారని, కానీ అందుకు అనూహ్యంగా మిగిలిన పార్టీలను వెనక్కు పెట్టి కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేసింది కార్యకర్తలేనని ఆయన అన్నారు. కార్యకర్తల కృషితోనే ఈరోజున తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు సుపరిపాలన అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎల్‌బీ స్టేడియంలో నిర్వహించిన సభలో ఆయన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఇప్పుడు తెలంగాణలో వచ్చినట్లే భవిష్యత్తులో కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు.
దేశానికే ఆదర్శం తెలంగాణ
‘‘కార్యకర్తల కృషితోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. కేసీఆర్ కాకుండా ఇంకో పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాదన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని అన్నారు. కార్యకర్తలు కష్టపడి మిగతా పార్టీలను ఓడించి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకనే అన్ని వర్గాలకు అభివృద్ధి ఫలాలకు అందుతున్నాయి. కార్యకర్తలు కాంగ్రెస్ ఆత్మ. మనం అధికారంలోకి రావడానికి కారణం మీరే. మీ వల్లే రాష్ట్రంలో అధికారం వచ్చింది. తెలంగాణ దేశానికి ఆదర్శం కాబోతుంది. మేం చెప్పినవన్నీ ఇచ్చి చూపించాం. అబద్ధాలు చెప్పి కొందరు ఓట్లు అడుగుతారు. మేం అభివృద్ధి, సంక్షేమం చేసి ఓట్లు అడుగుతాం. తెలంగాణలో విద్యా సంస్థల్లో రోహిత్ వేముల చట్టాన్ని తెస్తున్నాం’’ అని వెల్లడించారు.
‘‘తెలంగాణలో కుల గణన చేసి దేశానికి ఆదర్శంగా నిలిచాం. వెనకబడిన వర్గాలకు రిజర్వేషన్లు ఇచ్చి తీరుతాం. బీఆర్ఎస్ హయాంలో ఎంత అవినీతి ఉండేదో మీకు తెలుసు. కాంగ్రెస్ వచ్చాక అవినీతి పూర్తిగా తగ్గిపోయింది. హైదరాబాద్లో కనీసం 25 ప్రభుత్వ సంస్థలను కాంగ్రెస్ ప్రభుత్వాలు తెచ్చాయి. హైదరాబాద్ కి మోదీ చేసింది ఏంటో బీజేపీ చెప్పాలి. రాహుల్ పాదయాత్ర సమయంలోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని అర్థమైంది. హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ సంస్థలు అనేకం ఉన్నాయి. ఆ సంస్థలన్నీ తెచ్చింది గత కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణలో విద్యా, వ్యవసాయం లాంటి అనేక కీలక రంగాలు అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు, సన్న బియ్యం ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే. గత ప్రభుత్వం అమ్మే బియ్యం ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం తినే బియ్యం ఇస్తోంది’’ అని గుర్తు చేశారు.
ప్రధాని మోదీ కాదు.. మాటల మోదీ
‘‘పాకిస్తాన్ ను ఇది చేస్తాం, అది చేస్తాం అన్నారు. ఎందుకు చేయలేదు. పాకిస్తాన్ పై యుద్ధం చేయకుండా మిమ్మల్ని ఎవరు ఆపారు? క్షమాపణ చెప్పడమే బీజేపీ, ఆరెస్సెస్ లకు తెలిసిన పని. మోదీ లాగా ఇందిరా గాంధీ బయపడలేదు. ఎవరు వచ్చినా బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం కల్పిస్తామని ఇందిరాగాంధీ చెప్పింది. చేసి చూపించింది. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలి. రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తోసేయాలని బీజేపీ చూస్తోంది. సెక్యులర్ అనే పదం రాజ్యాంగంలో లేదని బీజేపీ చెప్తోంది. రాజ్యాంగం నుండి లౌకిక పదాన్ని తీసేయారని చాలెంజ్ చేస్తున్నా. సెక్యులర్ అనే పదం బీజేపీ ప్రణాళికలో రాసుకున్నారు. సెక్యులర్ అనే పదంతో మీకు ఇబ్బంది ఉంటే మీ పార్టీ ప్రణాళిక నుండి తీసేసి చూపెట్టండి. నల్లధనం తెచ్చి ప్రతి వ్యక్తికి రూ.15 లక్షలు ఇస్తానని మోదీ అన్నాడు. ఏమైంది? మోదీ చెప్పేవన్నీ అబద్ధాలే. మోదీ, షా అబద్ధాలు చెప్పి ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు. పెహెల్గాంలో సంఘటన జరిగితే అందరం కేంద్రానికి మద్దతు ఇచ్చాం. పెహెల్గాం సంఘటనపై చర్చించేందుకు ఆల్ పార్టీ మీటింగు పెట్టమని డిమాండ్ చేస్తే మీటింగ్ పెట్టారు కానీ మోదీ పాల్గొనలేదు. మేం దేశ సైనికుల కోసం చర్చించే సమయంలో మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు’’ అని గుర్తు చేశారు.