రేవంత్ ఛాలెంజ్ స్వీకరించిన కిషన్

14 నెలలుగా రాష్ట్రంలో ఏమీ చేయని ముఖ్యమంత్రి.. చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు.;

Update: 2025-02-22 11:02 GMT

తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. 14 నెలలుగా రాష్ట్రంలో ఏమీ చేయని ముఖ్యమంత్రి.. చర్చకు రావాలంటూ ఛాలెంజ్ చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను బీజేపీనే కౌవసం చేసుకుంటుందని, దానిని ఎవరూ ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలు గెలుస్తాం. సీఎం రేవంత్ సవాల్ ను స్వీకరిస్తున్నా. హామీలు అమలు కు ప్రణాళిక, కార్యాచరణ ప్రకటిస్తే చర్చకు సిద్ధం. ఏ ఒక్క హామీకి కనీసం కార్యచరణ కూడా లేదు. చర్చ కు రమ్మనడం హాస్యాస్పదం. దేనికి చర్చకు రావాలి సీఎం రేవంత్ స్పష్టం చెయ్యాలి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలోచించి ఓటేయాలి బీజేపీ ని ఆదరించాలి. బీఆర్ఎస్ పాలనలో శాసన మండలి ప్రాధాన్యత తగ్గింది. ఎన్నికల్లో పసుపు బోర్డు ప్రభావం ఉంటుంది. కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు. రిజర్వేషన్ లను స్వాగతిస్తాం. ముస్లిం లను బిసి జాబితాలో చేరిస్తే వ్యతిరేకిస్తాం. బీజేపీ తో బీఆర్ఎస్ కు ఎలాంటి సంబంధాలు లేవు. కాంగ్రెస్ తో కలిసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. గతంలో అనేక సార్లు బీఆర్ ఎస్ కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చింది. జిల్లా అధ్యక్షుల నియామకాల ప్రక్రియ తర్వాతే రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక’’ అని స్పష్టం చేశారు.

‘‘సీఎం రేవంత్ రెడ్డికి పాలనపై అవగాహనే లేదు. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉపాధ్యాయులు, మేధావులు, విద్యావంతులు, నిరుద్యోగులు, రైతులు, రైతు కూలీలు, మహిళల సమస్యలను పరిష్కరించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు శాసనమండలిని నిర్వీర్యం చేశారు. మహబూబ్ నగర్, హైదరాబాద్ తప్ప రాష్ర్టంలోని 500 మండలాల్లో శాసనమండలి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ పోటీలో ఉంది, సమస్యలను తీర్చే సత్తా బీజేపీకే ఉంది కాబట్టి నేరుగా ఉపాధ్యాయులు, విద్యావంతులు, మేధావుల వద్దకు వెళ్లగలుగుతున్నాము. బీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఆ సత్తా లేకే ఇవాళ పోటీలో లేవు. ఈ ఎన్నికల్లో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు బీజేపీ వైపే చూస్తున్నారు’’ అని అన్నారు.

‘‘ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన తర్వాత రేవంత్ ఛాలెంజ్ విసిరి ఉంటే బాగుండేది. అన్ని రంగాల్లో రేవంత్ సర్కార్ ఫెయిల్ అయ్యింది. కాంగ్రెస్ పాలనలో ఒక్క వర్గం ప్రజలు కూడా సంతోషంగా లేరు. ఇలాంటి సమయంలో రేవంత్ సవాల్ విసరడం హాస్యాస్పదంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి.. అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు, టీచర్లు అందరూ ఆలోచించి ఓటేయాలి. తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశానిర్దేశం చేయాలి’’ అని తెలిపారు.

Tags:    

Similar News