Komatireddy | కోమటిరెడ్డి చిన్న లాజిక్ మిస్సయారా ?
చినకోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy) మంత్రిపదవి కోసం అల్లాడుతున్నారు;
కోమటిరెడ్డి బ్రదర్స్ లో చినకోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పదేపదే ఎనుముల రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే ఇద్దరున్నారు. వీరిలో పెదకోమటిరెడ్డి వెంకటరెడ్డి(Komatireddy Venkata Reddy) ఆల్రెడి రేవంత్ క్యాబినెట్లో సభ్యుడు. అంటే మంత్రిపదవిలో ఉన్నారు. చినకోమటిరెడ్డి(Komatireddy Rajagopal Reddy) మంత్రిపదవి కోసం అల్లాడుతున్నారు. 2023 ఎన్నికల్లో తనకు మంత్రి పదవిని కాంగ్రెస్(Congress) అధిష్ఠానం హామీ ఇచ్చింది కాబట్టి మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని పార్టీ వేదికలపై బహిరంగంగానే డిమాండ్ చేస్తున్నారు. మంత్రిపదవిని తనకు ఎప్పుడిస్తారో చెప్పాలంటు అధిష్ఠానాన్ని డిమాండ్ చేస్తున్నారు. మంత్రిపదవిని అడుగుతున్నది తనకోసం కాదట. నియోజకవర్గంలోని ప్రజల కోసమట.
సర్వసంగ పరిత్యాగి లాంటి తనకు మంత్రిపదవి ఇస్తే ఒకదెబ్బకు నియోజకవర్గాన్ని మార్చేస్తానని అంటున్నారు. గతంలో ఎంఎల్ఏ పదవికి రాజీనామా చేసి ప్రభుత్వాన్ని మునుగోడు దగ్గరకు తీసుకొచ్చిన విషయాన్ని ఎంఎల్ఏ గుర్తుచేస్తున్నారు. ఈమధ్యనే జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు ఛాన్స్ దక్కుతుందని చివరివరకు ఆశతో ఎదురుచూశారు. దక్కదని తేలిపోవటంతో కొద్దిరోజులు ఫోన్ స్విచ్చాఫ్ చేసి మాయమైపోయారు. ఆకొద్దిరోజులు ఏమిచేశారో ఆయనకే తెలియాలి. తర్వాత ప్రత్యక్షమైన ఎంఎల్ఏ అప్పటినుండి రేవంత్ ను టార్గెట్ చేస్తున్నారు. ఏదో ఒక విషయంలో రేవంత్ ను టార్గెట్ చేస్తు ట్విట్టర్లో పోస్టు పెట్టకపోతే నిద్రపట్టేట్లులేదు.
మంత్రి పదవి కావాలి, మంత్రిపదవి కావాలని చిన్న పిల్లాడు ఏనుగుబొమ్మకోసం గోలచేసినట్లు గోలచేస్తున్న రాజగోపాలరెడ్డి ఒక చిన్నలాజిక్ మరచిపోయారు. అదేమిటంటే ఇప్పటికే అన్న కోమటిరెడ్డివెంకటరెడ్డి మంత్రిగా ఉన్నపుడు మళ్ళీ తనకు మంత్రిపదవి ఎలాగ ఇస్తారు ? అన్నలాజిక్ మరచిపోయినట్లున్నారు. తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నదే ముఖ్యమంత్రితో కలుపుకుని 18 మంత్రిపదవులు. అందులో వీలైనన్ని సామాజికవర్గాలకు సర్దుబాటు చేయాలి. అగ్రవర్ణాలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు ఇలా చాలా కులాలు, మతాలను మంత్రివర్గంలో సర్దుబాటు చేయాలంటే చాలాకష్టం. ముస్లింలు ఎవరూ గెలవకపోవటంతో వారి కోటాను ఇంకోకళ్ళతో సర్దుబాటు చేస్తున్నారు.
ఇపుడు బీసీల వాదన చాలాబలంగా వినబడుతున్నందున ఎక్కువపదవులు బీసీలకు ఇవ్వక తప్పదు. ముఖ్యమంత్రి ఏ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి అన్నది కూడా ఇక్కడ చాలా కీలకం. ప్రస్తుతం రేవంత్ రెడ్డితో కలిపి నలుగురురెడ్లు మంత్రివర్గంలో ఉన్నారు. పార్టీని అధికారంలోకి తేవటంలో కీలకంగా వ్యవహరించారు కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిని తీసుకోక తప్పలేదు. మిగిలిన పదవులను రేవంత్+అధిష్ఠానం బీసీలు, ఎస్సీ, ఎస్టీలతో భర్తీచేశారు. భవిష్యత్ అవసరాల కోసం ఇంకో రెండుస్ధానాలను ఖాళీగానే ఉంచారు. సీఎంగా రేవంత్+మంత్రివర్గంలో వెంకటరెడ్డి ఉన్న తర్వాత ఇక తనకు మళ్ళీ మంత్రిపదవి ఎలాగ వస్తుంది అన్న విషయాన్ని ? రాజగోపాలరెడ్డి మరచిపోయినట్లున్నారు.
పదవి త్యాగంచేయాల్సిందేనా ?
రాజగోపాలరెడ్డికి మంత్రిపదవి రావాలంటే అందుకు ఒక మార్గముంది. అదేమిటంటే తన పదవిని అన్న వెంకటరెడ్డి త్యాగంచేయటమే. మంత్రిగా తనకుబదులు తన తమ్ముడు రాజగోపాలరెడ్డికి ఇవ్వమని రేవంత్+అధిష్ఠానంతో మాట్లాడి ఒప్పించాలి. అప్పుడు రాజగోపాల్ కు మంత్రిపదవి వచ్చేఅవకాశముంది. లేకపోతే గ్రహగతులను నమ్ముకుని ఓపికపట్టాల్సిందే. అన్న కూడా ఇదే విషయాన్ని తమ్ముడికి సలహా ఇచ్చారు. ‘‘పదవులు రావాలంటే ఓపికగా వెయిట్ చేయాల్సిందే’’ అని తమ్ముడికి అన్న సలహా ఇచ్చారు. మంత్రిపదవికోసం తాను ఓపికగా ఎంతకాలం వెయిట్ చేసింది తమ్ముడికి విడమరచి చెప్పారు. ‘‘తొందరపడవద్దని టైం వచ్చినపుడు అన్నీ వాటంతట అవే దగ్గరకు వస్తాయ’’ని హితబోధ చేశారు. మరి పెద కోమటిరెడ్డి మాటను చినకోమటిరెడ్డి వింటారా ?