భారీ ర్యాలీతో మాధవీ లత నామినేషన్.. కానీ ఒకరు మిస్సింగ్

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత నామినేషన్ వేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి అందించారు.

Update: 2024-04-24 13:10 GMT

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కొంపెల్ల మాధవీలత నామినేషన్ వేశారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆమె నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అంతకంటే ముందు మాధవీలత నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, ఇతర బీజేపీ నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ నియోజకవర్గ బీజేపీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున ర్యాలీకి హాజరయ్యారు. హైదరాబాద్ గుల్జార్ హౌస్ నుంచి ప్రారంభం అయిన ర్యాలీ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది.

నామినేషన్ ర్యాలీ ప్రారంభానికి ముందు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాధవి లత ప్రత్యేక పూజలు నిర్వహించారు. నామినేషన్ పత్రాలు అమ్మవారి వద్ద ఉంచి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతోపాటు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.

కాగా, ఆమె నామినేషన్ ర్యాలీలో రాజాసింగ్ పాల్గొనలేదు. ఆమె ర్యాలీలో పాల్గొంటానని చెప్పి ఆఖరి నిమిషంలో హ్యాండిచ్చారు. మాధవీ లతకి టికెట్ ఇవ్వడంపై మొదటి నుండి ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయడానికి బీజేపీలో మగాళ్లే లేరా అంటూ బహిరంగంగానే పార్టీ నిర్ణయంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎంపీగా పోటీ చేయాలనీ రాజాసింగ్ భావించారు. కానీ ఆయనకి టికెట్ దక్కకపోవడంతోనే పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం లేదు. అందులోను హైదరాబాద్ టికెట్ ఆశించి భంగపాటుకు గురవడంతో మాధవి లత కి తన సహకారం అందించడం లేదనే చర్చ జరుగుతోంది.

ఇక ర్యాలీకి ముందు మాధవి లత చార్మినార్ వద్ద విలేకరులతో మాట్లాడుతూ... AIMIM, కాంగ్రెస్, BRS లను ఓడించడానికి తనకి ఓటేసి మద్దతు తెలపాలని హైదరాబాద్ లోక్ సభ ఓటర్లను కోరారు. శ్రీరామనవమి ఊరేగింపు సందర్భంగా ఆమె రామబాణం వేస్తున్నట్టు పోజులివ్వడం వివాదాస్పదంగా మారింది. మసీదు వైపు చూపిస్తూ రెచ్చగొట్టేలా ఆమె వ్యవహరించారని ఎంఐఎం నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందిస్తూ.. ఓడిపోతామనే భయంతో వీడియో ఎడిట్ చేసి మార్ఫింగ్ చేశారని మాధవి లత అన్నారు. ఇవన్నీ ఎంఐఎం పాత ఆటలనీ, వాటికి ఇప్పుడు కాలం చెల్లిందని అన్నారు.

గత శుక్రవారం చార్మినార్ వద్ద మసీదులో ప్రార్ధనలు చేసిన అనంతరం అసదుద్దీన్ ఓవైసీ భారీ ర్యాలీ నిర్వహించి ఎంఐఎం హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈరోజు మాధవీ లత కూడా చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. 

Tags:    

Similar News