KTR | కేటీఆర్, హరీష్ ఎందుకు నోరిప్పటంలేదు ?

అవినీతి, అక్రమాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, స్మితా సబర్వాల్ పాత్ర ఏమేరకు అన్న విషయాలను కూడా జస్టిస్ ఘోష్ తన నివేదికలో స్పష్టంచేసినట్లు బాగా ప్రచారం జరుగుతోంది;

Update: 2025-08-02 12:11 GMT
KTR and Harish Rao

ఇపుడీవిషయమే ఆశ్చర్యంగాఉంది. ప్రతిచిన్నదానికి నానా యాగిచేసే కారుపార్టీ నేతలు 48 గంటలుగా నోరెత్తకపోవటమే ఆశ్చర్యంగా ఉంది. ఇపుడీ విషయం ఎందుకంటే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంపై ఆరోపణలు, విమర్శలు చేయకపోతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR), మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) తదితరులకు తోచదు. అలాంటిది కాళేశ్వరం(Kaleswaram Project), మేడిగడ్డ ప్రాజెక్టుతో పాటు సుందిళ్ళ, అన్నారం ప్రాజెక్టుల్లో అవినీతి, అవకతవకలకు బాధ్యులుగా పేర్కొంటు కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ పేర్లున్నట్లు సమాచారం లీకైంది. అవినీతి, అక్రమాల్లో ఈ ముగ్గురి పాత్ర చాలా కీలకమని విచారణ జరిపిన కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh Commission) చెప్పారని మీడియా, సోషల్ మీడియా హోరెత్తిపోతోంది.

రిపోర్టులోని అంశాలు కొన్ని వెలుగుచూసి 48 గంటలుదాటినా ఇప్పటివరకు బీఆర్ఎస్ నుండి ఒక్కనేతకూడ నోరెత్తి ఖండించలేదు. జరిగిన అవినీతి, అక్రమాల్లో కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, స్మితా సబర్వాల్ పాత్ర ఏమేరకు అన్న విషయాలను కూడా జస్టిస్ ఘోష్ తన నివేదికలో స్పష్టంచేసినట్లు బాగా ప్రచారం జరుగుతోంది. నివేదికలోని అంశాల్లో కొన్ని అనధికారికంగా వెలుగుచూశాయి. ఇదేవిషయమై చర్చించేందుకు 4వ తేదీన రేవంత్ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమవుతోంది. అప్పుడు జరిగే డెవలప్మెంట్ ద్వారా రిపోర్టులోని అంశాలన్నీ బయటకు రావటం ఖాయం. ఇపుడు అనధికారికంగా మీడియా, సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న వివరాలే అప్పుడు అధికారికంగా బయటపడతాయి.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి క్యాబినెట్ సమావేశం నిర్ణయానికి అసలు సంబంధమే లేదని రిపోర్టులో ఉంది. క్యాబినెట్ ఆమోదంలేకుండానే బ్యారేజులు నిర్మించారని, తుమ్మడిహెట్టి దగ్గర నీటిలభ్యత లేదన్నది కేవలం ఒకసాకు మాత్రమే అని, బ్యారేజీల నిర్మాణానికి ముందు తప్పనిసరిగా చేయాల్సిన జియో టెక్నికల్, జియో ఫిజికల్ పరీక్షలు చేయలేదని, హరీష్ రావు మౌఖిక ఆదేశాలు ప్రాజెక్టు, బ్యారేజీల నిర్మాణాలపై తీవ్ర ప్రభావం చూపిందనేటువంటి చాలా తప్పులను ఘోష్ తన నివేదికలో ఎత్తిచూపారు.

ఘోష్ కమిటి ప్రస్తావించింది అని ప్రచారంలో ఉన్న చాలా అంశాల్లో ఏ ఒక్కదాన్ని కూడా కేటీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ ఖండించలేదు. ఇవే అంశాలను రేవంత్, మంత్రులు ప్రస్తావించినపుడు వాళ్ళపై కేటీఆర్, హరీష్, ఈటల ఎదురుదాడులు చేసిన విషయం తెలిసిందే. అలాంటిది అవేఆరోపణలు, అంశాలను జస్టిస్ పీసీ ఘోష్ రిపోర్టులో ప్రస్తావించినపుడు ఎందుకని నోరిప్పటంలేదు ? అన్నదే అర్ధంకావటంలేదు. అంటే వీళ్ళ మౌనం అర్ధాంగీకారమా లేకపోతే పూర్తి అంగీకారమని అర్ధంచేసుకోవాలా ? అన్నదే తెలీటంలేదు. లేకపోతే విచారణ జరిపి రిపోర్టు సబ్మిట్ చేసింది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ కాబట్టి ఎలాపడితే అలా మాట్లాడితే లీగల్ గా ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయని భయపడి మాట్లాడటంలేదా అన్నదే అర్ధంకావటంలేదు.

ఏదేమైనా జస్టిస్ ఘోష్ కమిటి రిపోర్టులోని అంశాల ద్వారా అవినీతి, అక్రమాలకు పాల్పడటంలో కేసీఆర్, హరీష్, ఈటల పాత్ర చాలానే ఉందన్న విషయం జనాల్లోకి విస్తృతంగా వెళ్ళిపోయింది. 4వ తేదీ క్యాబినెట్ సమావేశంలో ఇంకెన్ని విషయాలు అధికారికంగా బయటకు వస్తాయో చూడాలి. అప్పుడు బీఆర్ఎస్ కీలకనేతల వాదన ఎలాగుంటుందో గమనించాలి.

Tags:    

Similar News