KTR | ‘ఏడాది పాలనలో రేవంత్ 12 ఉద్యోగాలైనా ఇవ్వలేదు’

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నీటిపైన రాతల్లాంటివని కేటీఆర్ మండిపడ్డారు. రాహుల్ కూడా ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని పేర్కొన్నారు కేటీఆర్.;

Update: 2025-01-27 13:01 GMT

రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు నీటిపైన రాతల్లాంటివని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రరెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన రేవంత్ 12 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్‌వీ క్యాలెండర్‌ను కేటీఆర్ సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిన దౌర్భాగ్య ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని దుయ్యబట్టారు. ఇచ్చిన ప్రతి హామీని తూతూ మంత్రంగానే అమలు చేశారని, ప్రతి దాంట్లో కోతలు పెట్టడంలో కాంగ్రెస్ నేతలు నిష్ణాతులయ్యారని ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ.. అవోక్ నగర్‌కు వెళ్లి అక్కడ గ్రూప్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులతో కేసీఆర్ ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని దుష్ప్రచారం చేయడమే కాకుండా.. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి రెండు లక్షల చొప్పున ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మాటను ఆయన కూడా మర్చిపోయారా? అని ప్రశ్నించారు.

‘‘ఇవాళ్టికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిని ఏడాది దాటిపోయింది కానీ ఒక్క కొత్త నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. ఒక కేసీఆర్ హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేని అబ్ధాలు చెప్తున్నారు.. కేటీఆర్ పాలన సమయంలో 2.32 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1,60,283 ఉద్యోగాలను భర్తీ చేశాం. కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వలేని ఈ కాంగ్రెస్ సిపాయిలు ప్రచారం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి 16 ఉద్యోగాల చొప్పున భర్తీ చేశాం. కానీ ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యాం. పేపర్లు లీక్ అయ్యాయని తప్పుడు ప్రచారాలు చేసి.. అభ్యర్థులను బీఆర్ఎస్‌కు దూరం చేశారు. బీఆర్ఎస్ ఇచ్చిన నోటిఫికేషన్ల భర్తీ చేపట్టి ఆ ఉద్యోగాలను తామే ఇచ్చినట్లు గప్పాలు కొడుతున్నారు ఈ కాంగ్రెసోళ్లు. అందుకే ఈ విషయాలను సోషల్ మీడియా, కాలేజీ, స్కూల్ సభల్లో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చెప్పాల్సిన బాధ్యత మనదే. రాష్ట్రపతిని ఒప్పించి రిజర్వేషన్లు తెచ్చిన ఘనత కేసీఆర్‌దే’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.

పెట్టుబడులు చూసి మాకు కడుపు మంట వచ్చిందట..

ఈ సందర్భంగానే కొన్ని రోజులుగా జరుగుతున్న ఈనో ప్రచారంపై కూడా కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సిపాయిలు తీసుకొచ్చిన పెట్టుబడులు చూసి తమకు అజీర్తి అయిందని, కడుపుమంట చల్లారడానికి ఈనో తాగాలంటూ ప్రచారం చేశారంటూ మండిపడ్డారు. ‘‘రేవంత్ రెడ్డి నువ్వు పెట్టుబడులు తీసుకొస్తే అందరికన్నా మేము ఎక్కువ సంతోషిస్తాం. రూ.1.78 లక్సల కోట్లు అని బిల్డప్ ఇవ్వడం కాదు. 2024లో కూడా ఇలానే సొంత డబ్బా కొట్టుకున్నారు. రాష్ట్రానికి రూ.42వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని గవర్నర్ ప్రసంగంలో, బడ్జెట్ ప్రసంగంలో చెప్పుకున్నారు. కానీ ఈరోజు ప్రజలు మీపై అనుమానపడుతున్నారు. నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. కాంగ్రెస్ పార్టీ 420 హామీల్లో వాస్తవం అంత ఉంటుంది. రూ.42వేల కోట్లు పెట్టుబడులు అని చెప్పినా ఇప్పటికీ ఒక్కటి కూడా రాష్ట్రానికి చేరలేదు. ప్రభుత్వ, ప్రజల సొమ్ముతో హోర్డింగ్స్ పెడుతున్నావ్. మా బొమ్మలు ఎందుకు.. చేతనైతే నీ బొమ్మ పెట్టుకో. రేవంత్ రెడ్డి నీ దమ్ముంటే పెట్టుబడులు ఎప్పుడు వస్తాయి. పిల్లలకు ఉద్యోగాలు ఎప్పుడు వస్తాయో చెప్పు. మాకన్నా ఎక్కువ చేస్తే మీకు సన్మానం కూడా చేస్తాను’’ అని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో ఉల్టా ఉన్న వ్యక్తి రేవంత్

‘‘రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఉల్టా ఉన్నావు. విద్యార్థులపైకి తుపాకీ గురిపెట్టావు. ఉద్యమంలో కాంగ్రెస్, టీఆర్ఎస్‌కు తేడా ఏందంటే.. 9 నెలల పాటు ఒక తల్లి బిడ్డను ఎలా మోస్తదో.. పురిటి నొప్పులు పడుతూ ఎలా జన్మనిస్తుందో.. అలానే టీఆర్ఎస్ కూడా కేసులు, దెబ్బలు, ఎదురుదెబ్బలు, అవమానాలు తిని 14 సంవత్సరాల పాటు ప్రజలను ఏకం చేసి.. చావు నోట్లో తలపెట్టి.. ఒక తల్లి పాత్ర పోషించి, పురిటినొప్పులు పడి మరీ తెలంగాణ అనే బిడ్డకు జన్మనిచ్చిన పాత్ర టీఆర్ఎస్‌ది. తెలంగాణ ఉద్యమంలో నీ కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏంటి? ఉంటే గింటే ఆ మంత్రసాని పాత్ర పోషించింది’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

రేవంత్‌కి బుద్ధి రావాలి

‘‘రేవంత్ రెడ్డికి బుద్ధి ప్రసాదించాలని జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి వినతులు అందిద్దాం. ఆ రోజున బాపూను తలచుకుంటూ కాంగ్రెస్ మోసాన్ని ఎండగడుతూ ఒరిజినల్ గాంధీ.. ఈ డూప్లికేట్ గాంధీలకు బుద్ది తెచ్చేలా ఒక కార్యక్రమం చేద్దాం. జనవరి 30కి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 420 రోజులు అవుతుంది. ఈ సందర్బంగా వారిచ్చిన 420 హామీలపై ప్రశ్నిద్దాం. గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి వినతి పత్రం ఇద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి’’ అని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు కేటీఆర్.

రేవంత్‌‌ను చూస్తే రాము, రెమో గుర్తొస్తున్నారు

‘‘మాటలు మార్చడంలో రేవంత్ రెడ్డి కన్నా అపరచితుడు నయం. కొండగల్‌లో మాట్లాడుతూ నిమిషాల వ్యవధిలోనే రేవంత్ రెండు మాటలు మాట్లాడారు. రేవంత్‌ను, ఆయన మాటలను చూస్తేనే డౌట్ కొడుతోంది. అపరిచితుడు సినిమాలో రాము, రెమో పాత్రలే గుర్తొస్తున్నాయి. అవి రీల్.. రేవంత్ రియల్ అంతే. తొలుగ రాత్రి 12 గంటలు దాటిన వెంటనే ప్రతి లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు పడతాయని అన్నారు. కానీ పదే పది నిమిషాల్లో మాట మార్చేసి మార్చి 31 నాటికి ప్రతి ఒక్కరికీ డబ్బులు అందుతాయని అన్నారు. కానీ ఏ ఏడాది జనవరి అనేది మాత్రం చెప్పలేదు. కాబట్టి వీరి మాటలకు గ్యారెంటీ లేదు. మార్చి 31నే డెడ్‌లైన్‌గా ఎందుకు పెట్టాడో తెలుసా.. ఓట్ల కోసం. రాష్ట్రంలో 12,786 గ్రామపంచాయతీలు ఉంటే.. 612 గ్రామాల్లోనే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలు చేస్తారంట’’ అని కేటీఆర్ విమర్శలు గుప్పించారు.

Tags:    

Similar News