‘పాలన చేతకాక కాంగ్రెస్ నాటకాలు’
రాష్ట్రంలో కమిషన్‌ల పాలన నడుస్తోంది – ప్రజల పాలన కాదు.;
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతకావడం లేదంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల దృష్టిని మళ్లించడానికి నాటకాలు ఆడుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 17 నెలలుగా రాష్ట్రాన్ని పాలించడం చేతకాకి కాంగ్రెస్ నేతలు తలలుపట్టుకుంటున్నారని అన్నారు. నల్లగొండ జిల్లా పర్యటన సందర్భంగా ప్రభుత్వం కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ‘‘కమిషన్‌లు తప్ప ప్రభుత్వానికి మరో దారి కనిపించట్లేదు. పాలన కనిపించడం లేదు. డైరెక్ట్‌గా కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నా చేయడం వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే "కమిషన్‌లు లేనిదే పనులు జరుగడంలేదు" అని స్వయంగా సాక్ష్యంగా చెబుతున్నారు’’ అని పేర్కొన్నారు.
17 నెలలుగా పాలన చేతకాక, ఇచ్చిన దొంగ హామీలను ఎలా అమలు చేయాలో తెలియక, తమ కమిషన్ల అవినీతి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే కాళేశ్వరం కమిషన్ తో కేసీఆర్ గారికి నోటీసులు ఇప్పించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ చెప్పుకున్న ప్రజాపాలన కాస్త పర్సంటేజీల పాలనగా మారిందని కేటీఆర్ విమర్శించారు. 20 నుంచి 30 శాతం కమీషన్లు, పర్సంటేజీలు ఇవ్వకపోతే ఈ ప్రభుత్వంలో ఏ పని జరగదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులే బహిరంగంగా చెపుతున్నారన్నారు. ఉప ముఖ్యమంత్రి చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేసిన సంఘటన కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతికి పరాకాష్ట అన్నారు. అధికారంలోకి వచ్చిన 17 నెలల కాలంలోనే పాలన చేతగాక ప్రజలకు ఇచ్చిన అడ్డగోలు హామీలను నెరవేర్చే దమ్ము లేక కాంగ్రెస్ ప్రభుత్వం చతికిలపడిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఒక విఫల ప్రయోగంగా చూపించే బీజేపీ, కాంగ్రెస్ కుట్రలో భాగంగానే కేసీఆర్ కు నోటీసులు వచ్చాయని మండిపడ్డారు. ఎన్ని నోటీసులు ఇచ్చినా అవన్నీ దూది పింజలు లాగా తేలిపోతాయన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థ మీద తమకు అపార గౌరవం ఉందన్న కేటీఆర్, ముమ్మాటికి ధర్మం గెలుస్తుందన్నారు. తెలంగాణకు మేలు చేసిన వారిని దేవుడు కాపాడుతాడన్న నమ్మకం ఉందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కమీషన్ల కోసం కక్కుర్తి పడడంతో వేల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఇప్పటివరకు ఆ నిర్మాణ సంస్థ మీద చర్యలు తీసుకోలేదు. కనీసం విచారణ కూడా జరపలేదన్నారు. వట్టెం పంప్ హౌస్ మునగడం, పెద్దవాగు ప్రాజెక్టు రెండుసార్లు కొట్టుకుపోవడం మీద కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరపలేదన్న కేటీఆర్, బాధ్యులపై చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న మతలబు ఏందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్ఎల్బీసి టన్నెల్ కూలి 3 నెలలు గడుస్తుంటే అందులో నుంచి శవాలను తీసే సోయి ఈ ప్రభుత్వానికి లేదన్నారు. అసలు ఆ టన్నెల్ ఎందుకు కూలిందో చెప్పే తెలివి ముఖ్యమంత్రికి, మంత్రులకు లేదన్నారు. సమర్థవంతమైన ప్రభుత్వం ఉంటే ఈ మూడు నెలల కాలంలో మంగళ గ్రహం నుంచి కూడా మనుషులను తిరిగి తెచ్చేదని చెప్పారు. కానీ ఈ చేత కానీ ప్రభుత్వానికి టన్నెల్ నుంచి చనిపోయిన వారి శవాలు తెచ్చే శక్తి లేదు.
కమిటీల పేరుతో, విచారణల పేరుతో కాలయాపన చేస్తూ ఆరు గ్యారంటీల అమలను పక్కనపెడదామనుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలను చూస్తూ ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు. నెలకు 2,500 రూపాయలు ఎప్పుడు ఇస్తావని అడుగుతున్న కోటి 68లక్షల మంది ఆడబిడ్డల తరపున, తులం బంగారం ఏది అని అడుగుతున్న ఆడపిల్లల తల్లిదండ్రుల తరపున, నెలకు 4000 రూపాయల పెన్షన్ ఎప్పుడిస్తావని అడుగుతున్న పెద్దమనుషుల తరపున ప్రభుత్వంతో బీఆర్ఎస్ కొట్లాడుతుందన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రతీ హామీని అమలుచేసేదాకా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. హామీలు అమలుచేయకుండా డిసెప్షన్, డిస్ట్రక్షన్, డిస్ట్రాక్షన్ అనే చిల్లరమల్లర ప్రయత్నాలు చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడే రోజు వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.