డీజీపీని కలిసిన కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ డీజీపీ జితేందర్ ని కలిశారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు.

Update: 2024-08-23 10:57 GMT

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం తెలంగాణ డీజీపీ జితేందర్ ని కలిశారు. ఆయనతోపాటు పార్టీ సీనియర్ నాయకులు కూడా డీజీపీ కార్యాలయానికి వెళ్లారు. సూర్యాపేట జిల్లాలో  తిరుమలగిరిలో కాంగ్రెస్ శ్రేణులు బీఆర్ఎస్ పార్టీ ధర్నా శిబిరంపై దాడి చేశారని ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారని డీజీపీకి తెలిపారు. పోలీసులు స్వయంగా ధర్నా శిబిరంపై దాడి చేయడం, టెంట్ పీకేయడం వంటి కార్యక్రమాలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని డీజీపీ వద్ద ఆరోపించారు.

రాష్ట్రంలో రుణమాఫీ జరిగిన తీరుపై, ముఖ్యమంత్రి సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై, ఇతర జర్నలిస్టులపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారని డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రమేయం వల్ల ప్రతిపక్ష నాయకులపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొనడం గురించి డీజీపీకి నేతలు గుర్తు చేశారు. డీజీపీతో భేటీ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.

మీడియాతో కేటీఆర్...

"రైతు రుణమాఫీ పేరిట మోసం చేసిన ఈ ప్రభుత్వం పై నిన్న రాష్ట్ర వ్యాప్తంగా బిఆర్ఎస్ పార్టీ రైతులతో కలిసి ధర్నాలకు పిలుపునిచ్చాం. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో మా పార్టీ నేతలు శాంతియుతంగా రైతులతో కలిసి ధర్నా చేస్తుంటే.... 50 మంది కాంగ్రెస్ గుండాలు శిబిరంపై గుడ్లు, చెప్పులు, బాంబులు విసిరారు. మేము తిరగబడితే కాంగ్రెస్ గుండాలు ఒక్కడు కూడా ఉండరు. గల్లీలో తిరగాల్సిన ముఖ్యమంత్రి ఢిల్లీలో తిరుగుతున్నాడు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత ఊర్లో రైతు రుణమాఫీ అయిందా లేదా అని అడుగుతుంటే... మహిళా జర్నలిస్టులపైన దాడులు చేశారు. నీ సొంత ఊర్లో ఇద్దరు మహిళా జర్నలిస్ట్ లను అవమానించారు. సోషల్ మీడియాలో వికృతమైన భాష మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గుండాలు. నీకు దమ్ముంటే ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఉర్లలోకీ రా రేవంత్ రెడ్డి... రైతు రుణమాఫీ ఎక్కడ జరిగిందో అడగుదాం. అధికారం ఎవరి అబ్బా సొత్తు కాదు. రాష్ట్రంలో పోలీసులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. తిరుమలగిరిలో జరిగిన ఘటన పై కాంగ్రెస్ గుండాల పైన పోలీసులు చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయి. ఈ నగరానికి ఏమైందని పత్రికల్లో వార్తలు వస్తున్నాయి" వీటన్నింటిపై డీజీపీకి ఫిర్యాదు చేశామని కేటీఆర్ మీడియాకి తెలిపారు.

Tags:    

Similar News