జైనూర్ ఉద్రిక్తతలు ప్రభుత్వ వైఫల్యమే -కేటీఆర్

జైనూర్ ఘటనలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా.. వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని కేటీఆర్ ఆరోపించారు.

Update: 2024-09-05 08:32 GMT

జైనూర్ ఘటనలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లుతున్నాయని ముందస్తు సమాచారం ఉన్నా.. వాటిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందింది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. "కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూర్‌ మండలంలో ఒక ఆదివాసీ మహిళపై జరిగిన అత్యాచారయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అక్కడ జరిగిన హింసాత్మక చర్యల్లో అనేక ఆస్తుల విధ్వంసం జరగడం దురదృష్టకరం. బాధిత మహిళకు కేవలం లక్ష రూపాయల 'పరిహారం' ఇచ్చి చేతులు దులుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించడం దుర్మార్గం. జైనూర్‌లో తక్షణమే శాంతి నెలకొనేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. బాధిత మహిళకు మెరుగైన వైద్యం అందించి, నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూడాలి. అల్లర్లలో ఇళ్లు, షాపులు కోల్పోయినవారికి సాయంగా నిలవాలి. పూర్తి స్థాయి హోం మంత్రి లేకుండానే తొమ్మిది నెలలుగా రాష్ట్రాన్ని నడపడం వల్లనే తరచూ ఇటువంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి" అంటూ పోస్ట్ చేశారు.

అసలేం జరిగిందంటే... 

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా జైనూరు మండలానికి చెందిన ఆదివాసి మహిళపై ఆగస్టు 31న అత్యాచారయత్నం జరిగింది. ప్రతిఘటించడంతో నిందితుడు ఆమెపై తీవ్రంగా దాడి చేశాడు. ఈ ఘటన జైనూర్ లో ఉద్రిక్తతలకు దారితీసింది. బాధితురాలు ఆగస్టు 31న సిర్పూర్ (యు) మండలంలోని తన పుట్టింటికి వెళ్లేందుకు నడుచుకుంటూ వెళుతోంది. అదే సమయంలో సోనుపటేల్ గూడకి చెందిన నిందితుడు ఆమెను తన ఆటోలో ఎక్కించుకున్నాడు. రాఘాపూర్ దాటిన తర్వాత ఆమెపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో తీవ్రంగా దాడి చేశాడు. దీంతో ఆ మహిళ స్పృహ కోల్పోయింది. బాధితురాలు చనిపోయిందేమో అని భావించిన నిందితుడు... యాక్సిడెంట్ గా చిత్రీకరించేందుకు ఆ మహిళను రోడ్డుపై పడేసి అక్కడి నుంచి పారిపోయాడు.

అటుగా వెళుతున్న స్థానికులు ఆమెను గుర్తించి ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను హైదారాబాద్ లోని గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన మహిళ తనపై అత్యాచారయత్నం, దాడి జరిగిందన్న విషయాన్ని కుటుంబసభ్యులకు తెలిపింది. బాధిత మహిళ కుటుంబ సభ్యులు సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లో ఈనెల 1న కేసు నమోదు చేశారు.

ఉద్రిక్తంగా మారిన జైనూర్...

ఘటనపై ఆదివాసి సంఘాలు మంగళవారం జైనూరులో ఆందోళనకు దిగారు. బుధవారం ఏజెన్సీ బంద్ కు పిలుపునిచ్చారు. కాగా, వీరి ఆందోళనలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. నిందితుడిని ఉరితీయాలంటూ వేలాది మంది ఆదివాసీలు జైనూర్ మండల కేంద్రానికి తరలివచ్చి నిరసన ప్రదర్శనలు చేశారు. నిందితుడి ఇంటిని ధ్వంసం చేసి నిప్పు పెట్టారు. ఆ తర్వాత అతనికి వెంటనే ఉరిశిక్ష వేయాలంటూ ఆందోళనలు చేశారు. మండల కేంద్రంలోని ఓ వర్గానికి చెందిన దుకాణ సముదాయంలోని పాన్ షాప్ లోని సామాగ్రిని బయటకు తీసుకొచ్చి నిప్పంటించారు. దీంతో ఆ వర్గం వారు కూడా వీరి వర్గానికి చెందిన వారి షాపులను ధ్వంసం చేశారు. దీంతో ఇరువర్గాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా పోలీసులు మోహరించారు. 

Tags:    

Similar News