గుల్జర్ హౌస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.;

Update: 2025-05-19 09:47 GMT

పాతబస్తీలోని గుల్జర్ హౌస్‌లో ఆదివారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై సీఎం రవేంత్ రెడ్డి కూడా స్పందించారు. బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. ఆ ప్రమాదంలో మరణించిన ప్రహ్లాద్ మోడీ అనే వ్యక్తి కుటుంబాన్ని మాజీ మంత్రి కేటీఆర్, తలసాని, మహమూద్ అలి.. సోమవారం పరామర్శించారు. అంతేకాకుండా ఘటనా స్థలాన్ని కూడా కేటీఆర్ పరిశీలించారు. పెరుగుతున్న అగ్నిప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరారు. గుల్జర్ హౌస్‌కు తాను రాజకీయంగా రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం అనేది ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఉంటుందని పేర్కొన్నారు. ఇటువంటి ప్రమాదాల నివారణకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రాణాలు పోయిన తర్వాత నష్టపరిహారం అందించడం వల్ల లాభం ఉండదని, ప్రమాదాలను నివారించడం వల్లే ప్రయోజనం చేకూరుతుందని వ్యాఖ్యానించారు.

‘‘రూ.5 లక్షల పరిహారం ఇవ్వడం కాదు. ప్రాణాలపై దృష్టిపెట్టారు. మృతుల కుటుంబాలకు రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలి. ముఖ్యమంత్రే హోంమంత్రి కాబట్టి ఘటనా స్థలానికి వస్తే అధికారులు ఇంకా బాగా పనిచేస్తారు. సమ్మర్ వస్తూనే అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్షలు నిర్వహించాలి. అగ్నిమాపక యంత్రాలు ఎలా పనిచేస్తున్నాయా సమీక్షించాలి. ఆదివారం ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాలు వచ్చాయి కానీ నీళ్లు లేవు. సిబ్బందికి సరైన మాస్కులు లేవు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలెండర్లు లేవు. హైదరాబాద్‌లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదం. బాధితులు, మృతుల కుటుంబాల ఆవేదన వర్ణనాతీతం. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి రోజు వచ్చి ఉండేది కాదు’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News