రూమర్లకు చెక్ పెట్టిన కేటీఆర్
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి చర్చలు జరుగుతున్నాయని వస్తున్న వార్తలపై బుధవారం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీతో చర్చలు జరుపుతోందని తప్పుడు ప్రచారం చేయవద్దని మీడియా సంస్థలను హెచ్చరించారు. బీఆర్‌ఎస్ కు వ్యతిరేకంగా దురుద్దేశపూర్వకమైన అబద్ధాలను ప్రచారం చేసినందుకు రిజాయిండర్ ను ప్రచురించాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు సిద్ధంగా తీసుకుంటామని హెచ్చరించారు.
“హిడెన్ ఎజెండాలతో నిరాధారమైన వదంతులు వ్యాపింపజేసే వారికి, ఇదే చివరి హెచ్చరిక. నిరాధారమైన పుకార్లు ప్రచారం చేయడం ఆపండి. BRSకి వ్యతిరేకంగా మీ హానికరమైన అబద్ధాలకు రిజాయిండర్‌ను ప్రచురించండి లేదా చట్టపరమైన చర్యలు ఎదుర్కోండి” అని ఎక్స్ వేదికగా కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కేటీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
అంతేకాదు, రెండు దశాబ్దాలుగా తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ చేస్తున్న సేవ కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు. గడచిన 24 ఏళ్లుగా వందలాది మంది విధ్వంసకారులను, వేలాది మంది దురుద్దేశపూరిత ప్రచారకులను, వారి పథకాలను... స్థైర్యం, భక్తితో తట్టుకుని పార్టీ నిలబడిందని గుర్తు చేశారు. పార్టీ అలుపెరగని పోరాటం చేసి, తెలంగాణను సాధించి, తెలంగాణను నిర్మించిందని.. ప్రగతికి గర్వకారణంగా, ఇతరులు ఆదర్శంగా తీసుకునే రాష్ట్రంగా తెలంగాణని మలిచామని కేటీఆర్ వెల్లడించారు.
"ఒక గుర్తింపు, భావోద్వేగం కోసం లక్షలాది హృదయాలు కలిసి కొట్టుకున్నాయి.. అదే తెలంగాణ! పడతాం, లేస్తాం, తెలంగాణ కోసమే పోరాడతాం! కాని తల వంచం. ఎప్పటికైనా, ఎన్నటికైనా! జై తెలంగాణా!" అని ఎక్స్ లో రాసుకొచ్చారు కేటీఆర్. ఆయన తన ట్వీట్ తో బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే వార్తలకు కూడా చెక్ పెట్టేశారు.