నేతలను ఉత్సాహపరిచేందుకు కేటీఆర్ పాట్లు ?
కేటీఆర్ మాత్రం సుప్రింకోర్టు అనర్హత వేటు వేస్తుందని, ఉపఎన్నికలు రావటం ఖాయమని పదేపదే ఊదరగొడుతున్నారు.;
పార్టీలోని సీనియర్ నేతలు, క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు కేటీఆర్ పడరాని పాట్లుపడుతున్నారు. తాజాగా ట్విట్టర్లో కేటీఆర్(KTR) ఒక ట్వీట్ వదిలారు. ఇంతకీ అందులో ఏముందంటే తొందరలోనే అసెంబ్లీ ఉపఎన్నికలు వస్తాయని చెప్పారు. ‘సుప్రింకోర్టు గత తీర్పులు చూస్తుంటే పార్టీమారిన ఫిరాయింపు ఎంఎల్ఏలపై(BRS defections) అనర్హత వేటుపడుతుందని, ఫిరాయింపుదారులను కాపాడటం కాంగ్రెస్ కు అసాధ్య’మని ట్విట్టర్లో చెప్పారు. ఫిరాయింపులపై అనర్హత వేటువేయాలని కేటీఆర్ జనవరి 29వ తేదీన సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలుచేఠశారు. ఆ పిటీషన్ను ఈరోజు విచారించిన సుప్రింకోర్టు ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదావేసింది. ఫిరాయింపు ఎంఎల్ఏల అనర్హతపై సుప్రింకోర్టు(Supremecourt) ఏమి తేలుస్తుందో ఇప్పటికైతే ఎవరికీ తెలీదు. అయితే కేటీఆర్ మాత్రం సుప్రింకోర్టు అనర్హత వేటు వేస్తుందని, ఉపఎన్నికలు రావటం ఖాయమని పదేపదే ఊదరగొడుతున్నారు.
ఫిరాయింపులపై అనర్హత, ఉపఎన్నికలన్నమాటను కేటీఆర్ గతంలో కూడా చాలాసార్లు ప్రస్తావించారు. హైకోర్టులో అనర్హత పిటీషన్లు వేయటం ఆలస్యం వెంటనే అనర్హత, ఉపఎన్నికలు ఖాయమని గోలగోల చేసేశారు. కేటీఆర్ తో పాటు హరీష్ రావు, కల్వకుంట్ల కవిత కూడా ప్రతిరోజు ఉపఎన్నికల గురించే చెప్పేవారు. అయితే చివరికి ఏమైంది ? శాసనవ్యవస్ధ అధికారాల్లోకి హైకోర్టు జొరబడేది లేదని స్పష్టంగా చెప్పేసింది. పలానా తేదీలోగా ఫిరాయింపులపై అనర్హత వేటు వేయాలని తాము స్పీకర్ ను నిర్దేశించలేమని హైకోర్టు స్పష్టంచేసింది. కాకపోతే వీలైనంత తొందరలో నిర్ణయం తీసుకోమని మాత్రమే స్పీకరుకు సూచించింది. దాంతో కేటీఆర్, హరీష్, కవిత గాలి తీసేసినట్లయ్యింది. తమ పిటీషన్ను హైకోర్టు కొట్టేయగానే సుప్రింకోర్టులో మళ్ళీ పిటీషన్ దాఖలుచేశారు. విచారణకు టేకప్ చేయగానే మళ్ళీ అనర్హతఖాయం, ఉపఎన్నికలు ఖాయమంటు కేటీఆర్ రచ్చమొదలుపెట్టారు.
బీఆర్ఎస్ లో నుండి కాంగ్రెస్(Congress) లోకి ఫిరాయించిన పదిమంది ఎంఎల్ఏలపై ఎలాగైనా అనర్హత వేటువేయించాలని, ఉపఎన్నికలు వచ్చేట్లు చేయాలని కేటీఆర్ శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఫిరాయింపులపై కేటీఆర్, హరీష్, కవిత ఏ స్ధాయిలో మాట్లాడుతున్నారంటే ఫిరాయింపులన్నది 2023 ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ హయాంలోనే మొదలైనట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. తమ పదేళ్ళహయాంలో కేసీఆర్(KCR) ఏమిచేశారన్న విషయాన్నిమరచిపోయినట్లు నటిస్తున్నారు. టీడీపీ(TDP), కాంగ్ర్రెస్ కు చెందిన 18 మంది ఎంఎల్ఏలు, 23 మంది ఎంఎల్సీలు, నలుగురు ఎంపీలను కేసీఆర్ బీఆర్ఎస్ లోకి లాక్కున్న విషయం అందరికీ తెలిసిందే. తాము యధేచ్చగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడినా ఎవరూ ఏమీ మాట్లాడకూడదన్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం.
పార్టీలు ఫిరాయించిన ఎంఎల్ఏలపై అనర్హత వేటువేయాలని అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ ఎంఎల్ఏలు, నేతలు బీఆర్ఎస్ స్పీకర్ ను ఎన్నిసార్లు కలిసినా ఉలకలేదు, పలకలేదు. అనర్హత వేటువిషయమై హైకోర్టులో పిటీషన్లు దాఖలుచేసినా ఎలాంటి ఉపయోగాలు లేకపోయింది. పార్టీ ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహించటమే కాకుండా టీడీఎల్పీ, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీలను ఏకంగా బీఆర్ఎస్ లో విలీనంచేసుకున్న చరిత్ర కేసీఆర్ ది. కేసీఆర్ ఫిరాయింపులకు పాల్పడటం అప్పట్లో కేటీఆర్, హరీష్, కవితకు తప్పనిపించలేదు. అప్పట్లో ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఒక్కమాట కూడా మాట్లడని ఈముగ్గురునేతలు ఇప్పుడుమాత్రం పదేపదే గొంతుచించుకుంటున్నారు.
ఎందుకంటే ఫిరాయింపులదెబ్బ ఎలాగుంటుందో ఇపుడు బీఆర్ఎస్ అనుభవంలోకి వస్తోందికాబట్టే. అప్పట్లో కేసీఆర్ ఏదైతే చేశారో ఇఫుడు రేవంత్ రెడ్డి కూడా అదే చేస్తున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తు బీఆర్ఎస్ ను రేవంత్ దెబ్బకొట్టడాన్ని కేటీఆర్, హరీష్, కవిత తట్టుకోలేకపోతున్నారు. అందుకనే హైకోర్టు, సుప్రింకోర్టుల్లో వరుసబెట్టి కేసులు వేస్తున్నారు, వేయిస్తున్నారు. కేటీఆర్ పిటీషన్ పై ఫిబ్రవరి 10వ తేదీన ఏమిజరుగుతుందో చూడాల్సిందే.