మహాలక్ష్మి Vs మెట్రో.. రగడ మొదలైందా ?

రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మెట్రో ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఎల్ అండ్ టి యాజమాన్యానికి మధ్య వివాదం రాజుకున్నట్లే కనబడుతోంది.

Update: 2024-05-15 07:33 GMT
mahalakshmi scheme and metro trafic

ఉరిమి ఉరిమి మంగళంమీద పడినట్లుగా తయారైంది హైదరాబాద్ మెట్రో వ్యవహారం. తాజా పరిణామాలు చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి, మెట్రో ప్రాజెక్టులో భాగస్వామ్యం ఉన్న ఎల్ అండ్ టి యాజమాన్యానికి మధ్య వివాదం రాజుకున్నట్లే కనబడుతోంది. దీనికి కారణం ఏమిటంటే కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన మహాలక్ష్మి పథకమే. 2023, నవంబర్లో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి రావటానికి కాంగ్రెస్ పార్టీ ఆరుగ్యారెంటీలను హామీగా ఇచ్చింది. అందులో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కూడా ఒకటి. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి కాంగ్రెస్ పార్టీ ‘మహాలక్ష్మి’ అని పేరుపెట్టింది.  రోజుకు మహిళలు బస్సుల్లో ౩౦ లక్షల మంది ప్రయాణిస్తున్నారు. గతంలో కన్నా ఇపుడు బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళల సంఖ్య బాగా పెరిగింది. ఇపుడు  ఈ మహాలక్ష్మి పథకంపైనే ఎల్ అండ్ టి యాజమాన్యం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేస్తోంది. మహాలక్ష్మి పథకం వల్ల మెట్రో రైలులో ప్రయాణీకుల సంఖ్య తగ్గిపోతోందని బాధపడిపోతోంది.

 

ఎల్ అండ్ టీ గ్రూపు అధ్యక్షుడు, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఆర్. శంకర్ రామన్ మాట్లాడుతు మహాలక్ష్మి పథకం అమలుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేశారు. పథకం కారణంగా మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణంచేయటానికి మొగ్గుచూపుతున్నట్లు చెప్పారు. బస్సుల్లో మహిళల ఉచితప్రయాణం మెట్రో ట్రాఫిక్ ను దెబ్బతీస్తోందని రామన్ ఆరోపించారు. ప్రతిరోజు సుమారు 5 లక్షలమంది మెట్రోలో ప్రయాణిస్తుంటారు. ఇందులో ఉచిత ప్రయాణం వల్ల కనీసం 5 శాతం ట్రాఫిక్ మెట్రోకు తగ్గిపోయినట్లు రామన్ చెప్పారు. పరిస్ధితి ఇదే విధంగా ఉంటే మెట్రో రైలు ప్రాజెక్టులో తమ భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకునే విషయాన్ని పరిశీలిస్తామన్నట్లుగా రామన్ చెప్పారు. రామన్ చెప్పిన మాటలు ఎలాగున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నట్లుగానే ఉంది. ఇదే విషయమై రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతు ఎవరెన్ని చెప్పినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం కొనసాగుతుందని స్పష్టంగా ప్రకటించారు.

 

మెట్రో ప్రాజెక్టు నిర్వహణలో ఎల్ అండ్ టీ కాకపోతే మరో భాగస్వామి చేరుతారన్నట్లుగా రేవంత్ మాట్లాడారు. ఒకవేళ ఎల్ అండ్ టీ ప్రాజెక్టు నుండి వెళిపోతే ప్రాజెక్టు నిర్వహణకోసం మరో భాగస్వామిని ఏర్పాటుచేస్తామని రేవంత్ చెప్పారు. రేవంత్ తాజా ప్రకటనతో ఎల్ అండ్ టి అసంతృప్తిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవటంలేదన్న విషయం తేలిపోయింది. ఇదే విషయాన్ని హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి, మెట్రో ప్రాజెక్టు భాగస్వామి ఎల్ అండ్ టీ ఎండీ కేవీబీ రెడ్డితో మాట్లాడేందుకు ‘తెలంగాణా ఫెడరల్’ ప్రయత్నిస్తే సాధ్యపడలేదు. మెట్రో రైలు వర్గాల సమాచారం ఏమిటంటే మెట్రోలో ప్రయాణించే వాళ్ళ ట్రాఫిక్ తగ్గినమాట వాస్తవమే. అయితే ఇందులో మహిళల సంఖ్య ఎంతుందనే లెక్కలు మాత్రం లేవన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి ముందే కొంత ట్రాఫిక్ తగ్గిందని మహాలక్ష్మి పథకం అమలు కారణంగా మరికొంత ట్రాఫిక్ తగ్గిందని చెప్పారు.

 

మెట్రో ఎండీ ఆఫీసు నుండి వచ్చిన సమాచారం ఏమిటంటే తగ్గిన ట్రాఫిక్ మెట్రో ప్రాజెక్టు నిర్వహణపై పెద్దగా ప్రభావం చూపదు. మెట్రో మొదలైన దగ్గర నుండి ఇప్పటికి 50 కోట్లమంది ప్రయాణించారు. రోజుకు సుమారు 5 లక్షలమంది ప్రయాణిస్తున్నట్లు మెట్రోవర్గాలు చెప్పాయి. పండుగలు, ప్రత్యేకసందర్భాల్లో ప్రయాణీకుల సంఖ్య 6 లక్షలకు చేరిన విషయాన్ని గుర్తుచేశాయి. మెట్రో ట్రాఫిక్ తగ్గుతోందన్న విషయాన్ని ఎల్ అండ్ టి ప్రతి ఏడాది చెబుతునే ఉంటుందన్నారు. నిజానికి ప్రాజెక్టునుండి వైదొలగటం శంకర్ రామన్ చెప్పినంత సులభంకాదు. ఎందుకంటే ప్రైవేటు, పబ్లిక్ పర్టనర్ షిప్ (పీపీపీ) పద్దతిలో భాగస్వమ్యంగా ఏర్పడి ప్రాజెక్టును టేకప్ చేసినపుడే చాలా నిబంధనలు ఉండుంటాయి. ఇపుడా నిబంధనలన్నింటినీ పక్కనపెట్టేసి ప్రాజెక్టునుండి పక్కకు తప్పుకోవటం ప్రభుత్వానికైనా, ఎల్ అండ్ టీ యాజమాన్యానికైనా అంత సులభంకాదు.

 

ఒకసారి మెట్రోను గమనిస్తే 2017లో మొదలైంది. నాగోలు-అమీర్ పేట-మియాపూర్ రూటు, 15 కిలోమీటర్లు 16 స్టేషన్లతో మెట్రో మొదటిదశ మొదలైంది. రెండో దశ జేబీఎస్ టు ఫలక్ నుమా15 కిలోమీటర్లు 23 స్టేషన్లు, మూడో దశలో నాగోలు టు శిల్పారామమ్ 28 కిలోమీటర్లు 23 స్టేషన్ల మధ్య మెట్రో తిరుగుతోంది. నాలుగో దశలో రాయదుర్గం టు శంషాబాద్ ఎయిర్ పోర్టు మధ్య 31 కిలోమీటర్లు, 7 స్టేషన్లతో మెట్రో ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనికి గచ్చిబౌలి దగ్గర 2022, డిసెంబర్ 9వ తేదీన కేసీయార్ శంకుస్ధాపన కూడా చేశారు. పై మూడు రూట్లను మెట్రో యాజమాన్యం రెడ్, బ్లూ, గ్రీన్ రూట్లుగా విడదీసింది. రెడ్ రూటులో రోజుకు సుమారు 2.6 లక్షల మంది ప్రయాణిస్తుంటారు. బ్లూ రూటులో సుమారు 2.25 లక్షలమంది, గ్రీన్లో రోజుకు 25 వేలమంది ప్రయాణిస్తున్నారు.

 

అవకాశమున్న చాలామంది బస్సులోకన్నా మెట్రో రైలులో ప్రయాణించటానికే మొగ్గుచూపుతున్నారు. తొందరగా గమ్యస్ధానాలకు చేరుకోవటం, సమయానికి రావటం, బయలుదేరటం మెట్రోకు పెద్ద ప్లస్ పాయింట్. ఏ రూటులో, ఏ సమయంలో చూసినా మెట్రోలో జనాలు ఫుల్లుగానే కనబడుతుంటారు. అలాంటిది మహాలక్ష్మి పథకం వల్ల మెట్రో ట్రాఫిక్ తగ్గిందని శంకర్ రామన్ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. రామన్ అసంతృప్తి వ్యక్తంచేయటం, దానికి కౌంటర్ గా రేవంత్ ప్రకటన నేపధ్యంలో ప్రాజెక్టు నిర్వహణలో ముందు ముందు ఎలాంటి మార్పులుంటాయో చూడాల్సిందే.

Tags:    

Similar News