ఈటల సంచలనం : ‘స్ధానిక ఎన్నికలు జరగవు’
ట్విట్టర్ వేదికగా ఈటల(Eetala Rajendar) చేసిన ఈప్రకటన సంచలనంగా మారింది
మల్కాజ్ గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మంగళవారం సంచలన వ్యాఖ్యలుచేశారు. తెలంగాణలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరగవని చెప్పారు. లీగల్ గా చెల్లుబాటుకాని ఎన్నికల విషయంలో అందరు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీసీలకు 42శాతం(BC reservations) రిజర్వేషన్లు చట్టబద్దంగా, న్యాయబద్దంగా చెల్లుబాటు కావని ఈటల అన్నారు. ట్విట్టర్ వేదికగా ఈటల(Eatala Rajendar) చేసిన ఈప్రకటన సంచలనంగా మారింది. ‘‘తొందరపడి సర్పంచ్ అభ్యర్ధులు దావత్ ల పేరుతో డబ్బులు ఖర్చుపెట్టుకోవద్ద’’ని హితవుచెప్పారు. ‘‘సర్పంచులుగా పోటీచేయాలని అనుకుంటున్న వాళ్ళు రెండుమూడుచోట్ల దావతులు మొదలుపెట్టే’’సినట్లు తనకు తెలిసిందన్నారు. ‘‘తొందరపడి ఎవరూ దసరాకు దావత్ లు ఇవ్వద్ద’’ని పిలుపిచ్చారు.
ఎందుకంటే ఇవి జరిగే ఎన్నికలు కావన్నారు. ఎనుముల ‘‘రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించాలని అనుకుంటున్న ఎన్నికలు రాజ్యాంగబద్దంగా లేదని కోర్టు ఎన్నికలనోటిఫికేషన్ను కొట్టేస్తే పరిస్ధితి ఏమిట’’ని అడిగారు. ‘‘మహారాష్ట్ర తరహాలో ఎన్నికలు చెల్లుబాటు కాకపోతే అప్పుడు పరిస్ధితి ఏమిట’’న్నారు. మహారాష్ట్రలో స్ధానికసంస్ధల ఎన్నికలు జరిగిన తర్వాత హైకోర్టు ఎన్నికలను రద్దుచేసిన విషయాన్ని ఈటల గుర్తుచేశారు. ‘‘ఎన్నికల సందర్భంగా అభ్యర్ధులు ఖర్చులుపెట్టి తీవ్రంగా డబ్బులు నష్టపోయార’’ని ఈటల చెప్పారు. ‘‘బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పేరుతో రేవంత్ సర్కార్ డ్రామాలు ఆడుతున్న’’ట్లు ఈటల మండిపడ్డారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీసీలకు 42శాతం రిజర్వేషన్ పై ఈటల చెప్పింది నూరుశాతం వాస్తవమే అనటంలో సందేహంలేదు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తు రేవంత్ ప్రభుత్వం జారీచేసిన జీవో చట్టబద్దంకాదు, న్యాయసమీక్షలో నిలబడదని అందరికీ తెలుసు. జీవో జారీచేసిన రేవంత్ కు కూడా ఈవిషయం బాగా తెలుసు. అయినా సరే బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించి తమ చిత్తశుద్దిని చాటుకున్నామని చెప్పుకుని లబ్దిపొందటానికి మాత్రమే ప్రభుత్వం జీవో జారీచేసింది. ‘‘గవర్నర్ దగ్గర బిల్లు పెండింగులో ఉండగా ప్రభుత్వం జీవో ఎలాగ జారీచేస్తుంద’’ని హైకోర్టు ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది. ‘‘గవర్నర్ ఆమోదంలేకుండా ప్రభుత్వం జారీచేసిన జీవో చెల్లుతుందా’’? అని విచారణ సంరద్భంగా ద్విసభ్య ధర్మాసనం అడ్వకేట్ జనరల్ ను సూటిగా నిలదీసింది.
విచారణ సందర్భంగా ద్విసభ్య దర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలు, సందేహాలు కూడా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల చెల్లుబాటుపై అనేక సందేహాలను పెంచేస్తున్నాయి. ఈనేపధ్యంలో ఈటల చెప్పినమాటలకు, చేసిన ఆరోపణలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయి. అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నారపరాజు రామచంద్రరావు, బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురం అర్వింద్ తదితరులు ఎన్నికలు జరగుతాయని అనుకునే అభ్యర్ధుల ఎంపికలో బిజీగా ఉన్నారు. ఎన్నికలు జరగుతాయో లేదో ఇప్పుడే చెప్పలేం కాబట్టి అభ్యర్ధులను ఎంపికచేసి పోటీకి రెడీగా ఉండాలన్నది వీళ్ళ ఉద్దేశ్యం అయ్యుండచ్చు. ఏదేమైనా ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పుచెప్పేంతవరకు ప్రభుత్వంలో, పార్టీల్లో హడావుడి అయితే తప్పదుకదా.