మోష్ పబ్ లో డేటింగ్ స్కామ్‌.. ఎలా దోచేస్తారంటే..?

హైదరాబాద్ లోని మోష్ పబ్ లో డేటింగ్ స్కామ్ ని పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్ డేటింగ్ మోసానికి పాల్పడిన ఏడుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2024-06-12 12:18 GMT

హైదరాబాద్ లోని మోష్ పబ్ లో డేటింగ్ స్కామ్ ని పోలీసులు ఛేదించారు. ఆన్‌లైన్ డేటింగ్ మోసానికి పాల్పడిన ఏడుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. డేటింగ్ యాప్స్ లో అందమైన అమ్మాయిల ప్రొఫైల్స్ తో మగవారికి వల వేసి భారీగా డబ్బు దోచేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు మాదాపూర్ పోలీసులు. ఆన్లైన్ డేటింగ్ మోసానికి పాల్పడిన ఏడుగురు ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఆకాశ్ కుమార్, సూరజ్ కుమార్, అక్షత్ నరుల, తరుణ్, శివరాజ్ నాయక్, రోహిత్ కుమార్, చెర్కుపల్లి సాయి కుమార్‌లను మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో అరెస్టు చేశారు.

డేటింగ్ యాప్స్ తో హనీ ట్రాప్...

మోష్ పబ్ లో కస్టమర్లను మోసం చేస్తున్న 8 మందిని మాదాపూర్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి నుంచి 8 స్మార్ట్ ఫోన్లు, రెండు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ నుంచి అందంగా అమ్మాయిలను తీసుకొచ్చి టిండర్, హింజ్, బంబుల్ లాంటి డేటింగ్ యాప్స్ ద్వారా వ్యాపారులను, ఉద్యోగస్తులను, విద్యార్ధులను హనీ ట్రాప్ చేస్తున్నట్టు పోలీసులు విచారణలో తేల్చారు. కొంతకాలంగా వివిధ పబ్స్ అడ్డాగా ఈ అక్రమ దందా కొనసాగిస్తోంది ఓ ముఠా. డేటింగ్ యాప్స్ లో అందమైన అమ్మాయిల పేర్లు మార్చి ఫేక్ ప్రొఫైల్స్ తో చాట్ చేసి మగాళ్లని ట్రాప్ చేస్తారు. వారిని పబ్ కి వచ్చేలా చేసి ఫుల్లుగా మందు తాగించి లక్షల రూపాయలని దండుకుంటున్నారు. ఈ వ్యవహారం పోలీసుల దృష్టికి రావడంతో మోష్ పబ్ ప్రతినిధులతోపాటు మరో ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.

మాదాపూర్ డీసీపీ వినీత్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఢిల్లీ నుంచి వచ్చిన ఆరుగురు వ్యక్తుల ముఠా గ్రూపుగా ఏర్పడి ఈ మోసాలకు పాల్పడుతున్నారు. నిరుద్యోగ యువతులను ట్రాప్ చేసి వారి పేరు మార్చి డేటింగ్ సైట్స్ లో ఫొటోస్ పెట్టి చాట్ చేయిస్తారు. అబ్బాయిలను ట్రాప్ చేసి దగ్గర్లోని పబ్స్ కు తీసుకు వెళ్తారని, ఆ తర్వాత వీరికి ఆయా పబ్స్ లో సపరేట్ క్యూఆర్ కోడ్ మెషిన్, సపరేట్ గా సర్వ్ చేసే వాళ్ళు ఉంటారు. వారికి సంబంధించిన అమ్మాయితో వచ్చిన కస్టమర్ కి డెవిల్స్ నైట్ పేరుతో సపరేట్ మెనూ ఇస్తారు.

అమ్మాయిలకు, 10 ml మేల్ కస్టమర్ కు 30 ml ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. బిల్లింగ్ చేసే టైం కి అమ్మాయి హ్యాండిచ్చేసి గాయబ్ అవుతుంది. ఎక్కువ బిల్లు వేసి.. వచ్చిన మొత్తాన్ని ఈ గ్రూపు, అమ్మాయి, పబ్ నిర్వాహకులు షేర్ చేసుకుంటున్నారు. సుమారుగా నలభై రోజుల నుండి సాగుతున్న ఈ దందా లో ముఠా సభ్యులు 50 నుంచి 60 మంది కస్టమర్లను మోసం చేసి, రూ. 40 లక్షల వరకు మోసం చేశారని డీసీపీ వినీత్ తెలిపారు. ఈ గ్యాంగ్ నెల రోజుల తరువాత మరో ప్రాంతానికి షిఫ్ట్ అవుతుందని, హైదరాబాద్ నుంచి నాగ్ పూర్ లో సైతం ఇలా చేయబోతుంటే పట్టుకున్నామని ఆయన వెల్లడించారు.

ఢిల్లీలోని 'డెవిల్స్ నైట్ క్లబ్' పేరుతో ఒక క్లబ్ ముసుగులో పనిచేస్తున్న ఈ ముఠా ఇప్పటికే ఢిల్లీ, బెంగుళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలలో అక్రమ బిజినెస్ ని విస్తరించింది. నెక్స్ట్ నాగ్ పూర్ లో దోచుకోవడానికి ప్రణాళికలు వేస్తోన్న టైమ్ లో హైదరాబాద్ పోలీసులు ఝలకిచ్చారు. ముఠా సభ్యులను అరెస్ట్ చేసి సిఆర్‌ నెం: 633/2024, U/Sec: 406, 419, 420 IPC, సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News