బీర్ల టిన్నులపై మహాత్మా గాంధీ ఫొటోనా ?
జీవితమంతా మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మాగాంధీ(Mahatma Gandhi) ఫోటోను రష్యాలోని బీర్ల తయారీ కంపెనీ రివోర్ట్(Rewort Beer) తన టిన్నులపై ముద్రించింది.;
జాతిపిత మహాత్మాగాంధీకి తీరని అవమానం జరిగింది. జీవితమంతా మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మాగాంధీ(Mahatma Gandhi) ఫోటోను రష్యాలోని బీర్ల తయారీ కంపెనీ రివోర్ట్(Rewort Beer) తన టిన్నులపై ముద్రించింది. ఫొటోను ముద్రించటమే కాకుండా ఏకంగా మహాత్మాగాంధి సంతకాన్ని కూడా ప్రింట్ చేసింది. అంటే రివోర్ట్ బీర్ తయారీ కంపెనీ ఉద్దేశ్యంలో మహాత్మాగాంధీ బీర్ల అమ్మకాలు, తాగటాన్ని ఆమోదించినట్లు చెప్పటమే అని అర్ధమవుతోంది. రివోర్ట్ కంపెనీ బీర్ల టిన్నులపై మహాత్మాగాంధీ ఫొటో, సంతకం ఫొటోలు ఇఫుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
బీర్ల టిన్నులపై మహాత్మాగాంధి ఫొటో, సంతకం చూడగానే దేశంలో చాలాచోట్ల నిరసనలు మొదలయ్యాయి. మహాత్మాగాంధి ఫొటోను బీర్ల టిన్నులపై ఎలాగ ముద్రిస్తారని రివోర్ట్ కంపెనీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహాత్మాగాంధీని రష్యాకంపెనీ(Russia) ఘోరంగా అవమానించిందని మండిపడుతున్నారు. ఇదేవిషయమై ఒడిస్సా మాజీ ముఖ్యమంత్రి నందినీ సత్పతి మనవుడు సవర్ణోసత్పతి మాట్లాడుతు భారతదేశం నిరసనను నరేంద్రమోడి(Narendra Modi) తనమిత్రుడు రష్యా అధినేత పుతిన్(Putin) కు తెలియచేయాలని డిమాండ్ చేశారు. జీవితాంతం మద్యానికి వ్యతిరేకంగా పోరాడిన మహాత్మాగాంధీ ఫొటో, సంతకం ప్రింట్ చేసిన రివోర్ట్ కంపెనీ యాజమాన్యంపై దేశంలోని చాలా ప్రాంతాల్లో పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు దాఖలయ్యాయి.
లిక్కర్ బాటిళ్ళు, టిన్నులపై మహాత్మాగాంధి ఫొటో ముద్రించటం ఇదే మొదటిసారికాదు. 2019లో ఇజ్రాయేల్ మద్యం తయారీ కంపెనీ ఒకటి సీసాలపై గాంధి ఫొటోను ముద్రించింది. అప్పట్లో ఆవిషయమై దేశంలో నిరసనలు మొదలైన తర్వాత కేంద్రప్రభుత్వం ఇజ్రాయేల్(Israel) కు ఘాటుగా నిరసన లేఖ పంపింది. దాంతో ఇజ్రాయేల్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పి మద్యం సీసాలపై గాంధి ఫొటోను తొలగించింది. ఇదే కాకుండా దేవతామూర్తుల ఫొటోలను కూడా కొన్ని దేశాలు అండర్ వేర్లు, బ్రాలపై ముద్రించి వివాదాలు రేకెత్తించిన విషయం గుర్తుంచేఉంటుంది. తాజా విషయానికి వస్తే రష్యన్ బీర్ల తయారీ కంపెనీ రివోర్ట్ మనదేశంలో కూడా తన బ్రాండును అమ్ముకునేందుకు ఉచిత పబ్లిసిటీ కోసమే ఇలాంటి వివాదాన్ని రేకెత్తించిందా అనే అనుమానాలు కూడా పెరుగుతున్నాయి. మరి కంపెనీ చివరకు ఏమిచేస్తుందో చూడాల్సిందే.