కేసీఆర్‌వి ఉత్తర కుమార ప్రగల్బాలా..!?

ప్రజలు ఫాం హౌస్‌ పాలన... గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.;

Update: 2025-01-31 13:11 GMT

కేసీఆర్.. చాలా కాలం తర్వాత మళ్ళీ న్యూస్ ఎట్రాక్షన్ అయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినప్పటి నుంచి ఫామ్ హౌస్‌కే పరిమితమై.. ఏ అంశంపై స్పందించలేదాయన. అటువంటిది ఒక్కసారిగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఘాటైన వ్యాఖ్యలు చేసి ఒక్కసారిగా వార్తలకు కేంద్రబిందువుగా మారారు. జహీరాబాద్ నియోజకవర్గం నేతలతో ఫామ్ హౌస్ ఎర్రవల్లిలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతు సినిమా స్టైల్లో డైలాగులు కొట్టారు.


మామూలుగా కాదు గట్టిగా కొట్టడమే తనకు అలవాటని రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వాన్ని కేసీఆర్(KCR) హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 14 నెలల పాలనను మౌనంగా, గంభీరంగా చూస్తున్నట్లు చెప్పారు. రాబోయే ఫిబ్రవరి చివరలో భారీబహిరంగసభ నిర్వహించబోతున్నట్లు ప్రకటించారు. తాజాగా కేసీఆర్ వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఘాటుగా స్పందించారు. కేసీఆర్‌ చేస్తున్నవన్నీ ఉత్తర కుమారుడి ప్రగల్బాలేనన్నారు. అంత దమ్ము ఉంటే ప్రజల్లోకి, అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలని, ఫామ్ హౌస్‌లో కుర్చి జబ్బలు చరుచుకోవడం కాదంటూ విమర్శలు గుప్పించారు.

అభ్యర్థులు కూడా దొరకరు: మహేష్

‘‘స్థానిక సంస్థల్లో ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో కేసీఆర్‌ అభ్యర్థుల కోసం ఇటువంటి ఉత్తర కుమార ప్రగల్భాలు పలుకుతున్నారు. ప్రజలు ఫాం హౌస్‌ పాలన... గడీల పాలన కోరుకోవడం లేదు. ప్రజా పాలన.. ఇందిరమ్మ రాజ్యాన్ని కోరుకుంటున్నారు. పదేళ్ల కేసీఆర్‌ పాలనలో సాధించలేని ప్రగతిని కాంగ్రెస్‌ ఏడాది పాలనలో సాధించడంతో ఆయన దిక్కుతోచక మాట్లాడుతున్నారు. ఆయన వాస్తవ పరిస్థితులకు భిన్నంగా మాట్లాడుతున్నారు’’ అని అన్నారు.

కవితను కాపాడుకోవడానికే..

‘‘ఇప్పటికే ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో కూరుకుపోయిన కేసీఆర్‌ కుమార్తె కవితపై ఇప్పుడు మరో లిక్కర్‌ స్కాం ఆరోపణలు రావడంతో ఆయన ఆ అంశాన్ని పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు గద్దెదింపినా, 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఒక్క సీటూ దక్కకపోయినా గుణపాఠం నేర్వని కేసీఆర్‌ ఫాం హౌస్‌లో పగటి కలలు కంటున్నారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్‌, కాంగ్రెస్‌ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదం. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా?’’ అని ప్రశ్నించారు.

నిరుపేదలను పట్టించుకోని కేసీఆర్

‘‘కేసీఆర్‌ ప్రభుత్వం చేసిన అప్పులతో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినా ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, వరికి బోనస్‌, ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌ది. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనతో రేషన్‌ కార్డుల కోసం నిరుపేదలు ఎదురుచూస్తే పట్టించుకోని కేసీఆర్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం 40 లక్షల వరకు రేషన్‌ కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌ చేస్తున్న అభివృద్ధితో బీఆర్‌ఎస్‌ ఉనికికే ప్రమాదం ఏర్పడడంతో, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి అభ్యర్థులే కరువైన నేపథ్యంలో ఆయన కాంగ్రెస్‌పై అవాకులు చెవాకులు పలుకుతున్నారు. ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్‌ వ్యవహార శైలి, మాటతీరులో మార్పు రాకుంటే రాబోయే స్థానిక ఎన్నికల్లో ఆ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనపై, ఏడాది కాంగ్రెస్‌ పాలనపై చర్చకు ఎన్ని సార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్‌ పామ్‌హౌస్‌లో కూర్చొని ఉత్తర కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు’’ అని చురకలంటించారు.

కుంభకర్ణుడు నిద్ర లేచాడు: శ్రీనివాస్

ఇదిలా ఉంటే కేసీఆర్ వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కూడా ఘాటుగా స్పందించారు. కుంభకర్ణుడు నిద్రలేచాడంటూ సెటైర్లు పేల్చారు. ‘‘కేసీఆర్ ఇన్ని రోజులు కుంభకర్ణుని లాగ పామ్ హౌస్ లో పండుకుండు. కేసీఆర్ పంచాయితీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే పామ్ హౌస్ నుండి బయటకు వస్తా అంటుండు. కేసీఆర్‌ను పదే పదే మాట్లాడించాలని కుటుంబంలో ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో అన్ని బయట పెడతాం’’ అని అన్నారు.

ధనిక రాష్ట్రం.. అప్పుల ఊబి అయింది..

‘‘కేసీఆర్ గంభీర స్వరంతో మాట్లాడుతున్న అంటుండు. చేసిన పొరపాటుకు చింతిస్తూ పామ్ హౌస్ ఉండు. మహేష్ బాబు డైలాగ్ లాగ సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు కేసీఆర్ మైండ్ బ్లాక్ అయి పామ్ హౌస్ కు పరిమితం అయ్యాడు. కొంగరమల్లయ్య సామెత లాగ కేసీఆర్ మాట్లాడుతుండు. రాష్ట్రంలో ప్రజలు తిరస్కరించినా.. ప్రతిపక్ష పాత్ర పోషించమని ప్రజలు అవకాశం ఇచ్చారు. కైలాసంలో పెద్ద పాములాగా మింగి ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం గా మిగిల్చి పామ్ హౌస్ లో పండుకుండు. కేసీఆర్ బసవేశ్వర్, సంగమేశ్వర గురించి మాట్లాడుతుండు. కాళేశ్వరం గురించి ఎందుకు మాట్లాడటం లేదు’’ అని నిలదీశారు.

‘‘పడుమూడు నెలల్లో రైతులకోసం 61 వేల కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని గాడిన పెడుతుండు. పది ఏండ్లు ప్రజా వ్యతిరేక పాలన చేస్తే ఇందిరమ్మ రాష్ట్రంలో ఒకోకటి అమలు చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇచ్చిన హామీలను అన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుంది. కాంగ్రెస్ స్కిల్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ని నడిపిస్తుంటే.. బీఆర్ఎస్ దుబాయ్ వేదికగా విద్వేషపు వాట్సప్ యూనివర్సిటీని నడిపిస్తున్నది’’ అని విమర్శించారు.

Tags:    

Similar News