‘కవితను రాజకీయంగా పాతాళానికి తొక్కేయడం ఖాయం’

కేసీఆర్, కేటీఆర్‌పై ఫ్రస్ట్రేషన్‌ను మాపై చూపుతామంటే కుదరదు. ఇలాంటి దాడులకు మేం భయపడం.;

Update: 2025-07-13 10:04 GMT

కాంగ్రెస్ సస్పెండెడ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేసిన ఘటన రాష్ట్రమంతా సంచలనం సృష్టించింది. కవితను ఉద్దేశించి మల్లన్న అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహించిన జాగృతి కార్యకర్తలు, శ్రేణులు ఆయన కార్యాలయంపై ఆదివారం ఉదయం దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో మల్లన్ గన్‌మెన్.. గాల్లోకి ఐదు రౌండ్లు కాల్పులు జరిపారు. తాజాగా తన ఆఫీసుపై జరిగిన దాడి గురించి మల్లన్న స్పందించారు. దీనిని తనపై జరిగిన హత్యాయత్నంగా మల్లన్న అభివర్ణించారు. ఇలాంటి దాడులకు బెదిరి బీసీ ఉద్యమం ఆగిపోతుందని ఎవరైనా అనుకుంటే అది వారి భ్రమే అవుతుందన్నారు. ఇలాంటి వాటికి తాము భయపడమని, మరింత రెట్టించిన ఉత్సాహంతో ముందుకు కదం తొక్కుతామని ఆయన అన్నారు. ఈ సందర్భంగానే మల్లన్న మరికొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. కవిత రాజకీయంగా అధఃపాతాళానికి తొక్కేస్తానని అన్నారు.

‘‘కవిత అనుచరులు చేసిన దాడిలో నా చేతికి గాయమైంది. నా గన్‌మెన్‌ల నుంచి గన్ను లాక్కునే ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటి దాడుల జరిగినంత మాత్రాన బీసీలు, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకురావడానికి, వారికి వారి హక్కులను అందించడానికి మేము చేస్తున్న ప్రయత్నాలు ఏమాత్రం తగ్గవు. ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటే మా పోరాటం ఫలిస్తుందన్నమాటే. మరింత రెట్టించిన ఉత్సాహంతో మేము ముందడుగు వేస్తాం. ఇలాంటి వాటికి నేను అస్సలు భయపడను. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కేయడం ఖాయం, మా బాధ్యత మాది’’ అంటూ మల్లన్న కీలక వ్యాఖ్యలు చేశారు.

‘‘బీసీల సమస్యల కోసం ప్రభుత్వం మేము రాత్రింబవళ్లు పోరాడుతున్నాం. మా సలహాలను ప్రకభుత్వం ఆలకిస్తుంది. స్వీకరిస్తుంది. పొరపాట్లు జరిగితే సరిచేసుకుంటోంది. ఇందులో కవితకు ఏం సబంధం. మా పోరాట ఫలాలను ఆమె కొట్టేసే ప్రయత్నం చేస్తోంది. అసలు ఆమెకు ఎందుకు బాధ? రాజకీయ ఉనికే కావాలనుకుంటే కేసీఆర్‌ను అడగాలి. అయ్యా అన్నలపై ఉన్న ఫ్రస్ట్రేషన్‌ను మాపై చూపుతానంటే కుదరదు. ఇలాంటి దాడులు చేయడం వల్ల ప్రజల్లో మరింత చులకనవడం తప్ప మరేమీ ఉండదు. అదే విధంగా సహచర ఎమ్మెల్సీపై దాడికి ప్రేరేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని రద్దు చేయాలి’’ అని మల్లన్న డిమాండ్ చేశాడు.

Tags:    

Similar News