చంద్రబాబుపై మల్లు రవి ప్రశంసల వర్షం

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులు నిర్లక్షానికి గురవుతున్నారన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చలకు దారి తీసింది.;

Update: 2025-01-01 06:03 GMT

తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణ భక్తులు నిర్లక్షానికి గురవుతున్నారన్న చర్చ రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చలకు దారి తీసింది. తెలంగాణ ప్రజాప్రతినిధులు ఇచ్చే సిఫార్సు లేఖలను టీటీడీ స్వీకరించడం లేదని, దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టిసారించాలని తెలంగాణ నేతలు కోరారు. తెలంగాణ రాజకీయ నేతలు సిఫార్సు చేసిన వారికి కూడా తిరుమలలో వీఐపీ దర్శనాలు అందించేలా నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ నేతలు కోరారు. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తెలంగాణ నేతల సిఫార్సు లేఖలను స్వీకరించేలా టీటీడీ ఆదేశాలు జారీ చేసింది. కాగా అందుకు టీటీడీ కూడా ఆమోదం తెలిపింది. దీంతో తెలంగాణ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి ఓ లేఖ రాశారు. టీటీడీ సిఫార్సు లేఖల అంశంపై చంద్రబాబు నిర్ణయం ఎంతో సంతోషకరమని తెలిపారు.

 

‘‘పవిత్ర తిరుమల ఆలయంలో వీఐపీ దర్శనానికి తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు పత్రాలను స్వీకరించడానికి ఏపీ సీఎం చంద్రబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తెలంగాణ శాసనసభ సభ్యులు (ఎమ్మెల్యేలు), పార్లమెంటు సభ్యులు (ఎంపీలు), శాసనమండలి సభ్యులు (ఎమ్మెల్సీలు) తరఫున మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ నిర్ణయం మీ ఉదారతను, ఆంధ్రప్రదేశ్-తెలంగాణల మధ్య సంబంధాలను పెంపొందించడానికి మీ కమిట్‌మెంట్‌ను ప్రతిబింబిస్తుంది. ఇది రెండు రాష్ట్రాల ప్రజలు పంచుకునే ఆధ్యాత్మిక, సాంస్కృతిక బంధాలను మరింత బలపరిచేలా ఉంటుంది. ఈ నిర్ణయం తెలంగాణ నుంచి భక్తులు, ప్రముఖులు తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడాన్ని మరింత సులభతరం చేస్తుంది. మీరు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ నిర్ణయం గురించి అధికారికంగా తెలియజేయడం పరస్పర గౌరవం, సహకారాన్ని ప్రదర్శిస్తుంది. ఇటువంటి కార్యక్రమాలు రెండు రాష్ట్రాల మధ్య సహకారానికి మార్గదర్శకంగా నిలుస్తాయి’’ అని మల్లు రవి తన లేఖలో పేర్కొన్నారు.

Tags:    

Similar News