Manmohan Singh |తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేం...
తెలంగాణ ఏర్పాటులో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, తెలంగాణ ఎమ్మెల్సీ ఎం కోదండరాం వ్యాఖ్యానించారు.
By : The Federal
Update: 2024-12-27 07:42 GMT
తెలంగాణ రాష్ట్ర బిల్లును ఉభయ సభల్లో ప్రవేశపెట్టినపుడు నాడు ప్రధానమంత్రిగా ఉన్న ప్రధానమంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ పాత్ర మరవలేమని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్, తెలంగాణ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం కోదండరాం వ్యాఖ్యానించారు.తెలంగాణకు అనుకూలంగా వ్యవహరించి తెలంగాణ ఆవిర్భావానికి సహాయ సహకారాలు అందించిన మన్‌మోహన్ కు ప్రొఫెసర్ కోదండరాం నివాళులు అర్పించారు.తెలంగాణ రాష్ట్రానికి మన్మోహన్ సింగ్ లేని లోటు తీర్చలేనిదని ఆయన వ్యాఖ్యానించారు. ప్రొఫెసర్ ఎం కోదండరాం ‘ఫెడరల్ తెలంగాణ’తో ప్రత్యేకంగా మాట్లాడారు.
మన్‌మోహన్ సింగ్ తెలంగాణకు అనుకూలం
‘‘తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉధ్ధృతంగా ఉద్యమం సాగుతున్న రోజుల్లో నేను తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ గా ప్రతినిధి బృందంతో అప్పటి ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ను కలిసి తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకత గురించి వివరించి చెప్పాను, మమ్మల్ని ప్రధాని ఎంతో అప్యాయంగా పలకరించి, మా విన్నపాలను సావధానంగా విన్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా యువకులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆపాలని అప్పటి ప్రధాని సూచించారు. తెలంగాణకు అనుకూలంగా అప్పటి ప్రధాని వ్యవహరించారు’’అని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు.
తెలంగాణ ప్రజలతో అనుబంధం
తెలంగాణకు చెందిన కాంగ్రెస్ నాయకులే కాకుండా తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ తో మన్మోహన్ సింగ్ కు ఎంతో అనుబంధం ఉంది. యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా పనిచేసిన ప్రొఫెసర్ జయశంకర్ ను పలు సార్లు ప్రధాని పిలిచి మాట్లాడారు. తెలంగాణ వెనుకబాటుతనం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు గురించి పలు సందేహాలను జయశంకర్ సార్ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు తీర్చారని ప్రొఫెసర్ కోదండరాం గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా...
లోక్ సభ, రాజ్యసభల్లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చేయడంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన కృషి మరవలేమని ప్రొఫెసర్ కోదండరాం వ్యాఖ్యానించారు. రాజ్యసభలో తెలంగాణ బిల్లు ఆమోదింపజేయడంలో మన్మోహన్ సింగ్ విజయం సాధించారు. ఏపీకి చెందిన సభ్యుల ప్రశ్నలను అప్పటి ప్రధాని నివృత్తి చేసి బిల్లును పాస్ చేయించారని ఆయన పేర్కొన్నారు.ఏపీకి హామీలిచ్చి రాజ్యసభలో బిల్లు పాస్ చేయించిన ఘనత మన్మోహన్ సింగ్ దేనని ఆయన గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ఏర్పాటులో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా కీలక పాత్ర పోషించారనడంలో ఎలాంటి సందేహం లేదని కోదండరాం వ్యాఖ్యానించారు.
తెలంగాణకు మన్మోహన్ సహకారం
2009 నుంచి 2014వ సంవత్సరం మధ్యకాలంలో తెలంగాణ కోసం ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ అందించిన సహకారం మరవలేనిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీలు రాజీనామాల హెచ్చరికలు చేసినా దాన్ని నేర్పుతో ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం 60 ఏళ్ల పోరాటంలో మన్మోహన్ సింగ్ హయాంలోనే ఆమోదం లభించింది. తెలంగాణ రాస్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష మన్మోహన్ సింగ్ హయాంలోనే నెరవేరింది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ డిసెంబర్ 9 వతేదీన ప్రకటన వెలువడింది. మొత్తం మీద తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిన ఘనత మన్మోహన్ సింగ్ కు దక్కింది.
తెలంగాణ జేఏసీ కన్వీనర్‌గా
2009 డిసెంబర్ 24న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై యూపీఏ ప్రభుత్వం చేసిన ప్రకటన తర్వాత తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ (టీజాక్) ఆవిర్భవించింది. దీనికి కోదండరాం కన్వీనర్‌గా వ్యవహరించారు.టీజాక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం మిలియన్ మార్చ్, సాగరహారం, సడక్ బంద్‌లకు పిలుపునిచ్చారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రధానపాత్ర పోషించిన వ్యక్తుల్లో ప్రొఫెసర్ కోదండరాం ఒకరు. వృత్తిరీత్యా ఉస్మానియా యూనివర్సిటీలో రాజనీతి శాస్త్ర అధ్యాపకులు అయిన కోదండరాం ప్రస్థుతం ఎమ్మెల్సీగా ఉన్నారు.