బక్కపలచటి కాంగ్రెస్ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఎందుకో తెలుసా ?
. వారంరోజుల పాటు సాగబోయే ఈపాదయాత్రలో ఎంపికచేసిన కొన్నినియోజకవర్గాల్లో రోజుకు సుమారు 10 కిలోమీటర్లు యాత్ర ఉండబోతోంది;
ఈనెల 31వ తేదీనుండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మీనాక్షి నటరాజన్ పాతయాత్ర చేయబోతున్నారు. స్ధానికసంస్ధల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం మీనాక్షి పాదయాత్ర(Padayatra) చేస్తున్నారని పార్టీవర్గాల సమాచారం. పాదయాత్ర ద్వారా పార్టీ నేతలు, క్యాడర్ ను ఏకతాటిపైకి తీసుకురావటమే మీనాక్షి లక్ష్యంగా కనబడుతోంది. వారంరోజుల పాటు సాగబోయే ఈపాదయాత్రలో ఎంపికచేసిన కొన్నినియోజకవర్గాల్లో రోజుకు సుమారు 10 కిలోమీటర్లు యాత్ర ఉండబోతోంది. మీనాక్షి(Meenakshi Natarajan)తో పాదయాత్రలో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud)కూడా పాల్గొంటారు. పాదయాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను రెడీచేయటానికి ఆరుగు సీనియర్ నేతలతో కమిటి కూడా ఏర్పాటైంది. అలాగే కోఆర్డినేషన్ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది.
మామూలుగా అధికారపార్టీ తరపున ఎవరూ పాదయాత్ర చేయరు. పైగా మీనాక్షి తెలంగాణ నేత కూడా కాదు. అధికారంలోకి రావటంకోసమే ఏపార్టీ నేతలైనా పాదయాత్ర చేస్తారు. 2018-23 మధ్యలో కాంగ్రెస్ ఇన్చార్జిలుగా మాణిక్కంఠాకూర్, మాణిక్ రావ్ థాక్రే, దీపాదాస్ మున్షీ పనిచేశారు. అధికారంలోకి రాగానే దీప స్ధానంలో కాంగ్రెస్ అధిష్ఠానం మీనాక్షిని ఇంచార్జిగా నియమించింది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నరోజుల్లో రేవంత్ రెడ్డి(Revanth), భట్టి విక్రమార్క(Bhatti) పాదయాత్రలు, ఉత్తమ్ కుమార్ రెడ్డి బస్సుయాత్ర చేసినవిషయం అందరికీ తెలిసిందే. అప్పట్లో ఇంచార్జీలు ఎవరూ పాదయాత్రలో పాల్గొనలేదు. అలాంటిది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇపుడు మీనాక్షి పాదయాత్రకు రెడీ అవుతుండటమే ఆశ్చర్యంగా ఉంది.
పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే పార్టీ నేతలమధ్య ఐక్యత తగ్గిపోయింది. పార్టీ అధికారంలో ఉండి తొందరలో జరగబోయే స్ధానికసంస్ధల ఎన్నికలను స్వీప్ చేయకపోతే పార్టీ, ప్రభుత్వంతో పాటు ఇంచార్జిగా మీనాక్షికి కూడా అవమానమే. అందుకనే నేతలను ఏకతాటిపైకి తీసుకురావటంతో పాటు ఎన్నికల్లో పార్టీకి ఘనవిజయం చేకూర్చటమే ఏకైక టార్గెట్ గా మీనాక్షి పాదయాత్ర చేయబోతున్నారు. ఈనెల 31వ తేదీనుండి మొదలయ్యే పాదయాత్ర ఆరు ఉమ్మడిజిల్లాల్లో రోజుకు 10కిలోమీటర్ల చొప్పునఉంటుంది. 31న పరిగి నియోజకవర్గంలో పాదయాత్ర మొదలవుతోంది. తర్వాత ఆంథోల్, ఆర్మూర్, ఖానపూర్, చొప్పదండి మీదుగా ఆగష్టు 5వ తేదీ వర్ధన్నపేట వరకు జరుగుతుంది.
యాత్రలో భాగంగా స్ధానిక గ్రామాలు, మండలాలతో పాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో పార్టీ నేతలు, క్యాడర్ తో పాటు మామూలు జనాలను కూడా నటరాజన్ కలుస్తారు. ఏఐసీసీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జైబాపూ, జైభీం, జై సంవిధాన్ కార్యక్రమాల్లో నేతలు, క్యాడర్ను మమేకం చేయటం కూడా కీలక అంశం. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రమదానం, మధ్యాహ్నం భోజన విరామం తర్వాత మొదలయ్యే పాదయాత్రలో పార్టీ నేతలు, క్యాడర్ తో కలుస్తారు. పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్ గ్రామంలో 31వ తేదీన సాయంత్ర 5గంటలకు మీనాక్షి పాదయాత్ర మొదలవ్వబోతోంది. పాదయాత్ర రూట్ మ్యాప్ తో పాటు ఇతర కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు ఎంఎల్ఏలు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, టీ. రామ్మోహన్ రెడ్డి, ఎంఎల్సీలు శంకర్ నాయక్, పీసీసీ సీనియర్ నేతలు కేతూరి వెంకటేష్, జూలూరు ధనలక్ష్మి, పులి అనీల్ కుమార్ తో సమన్వయ కమిటి ఏర్పాటైంది.
పాదయాత్ర రూటులో టచ్ అయ్యే నియోకవర్గాల ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలతో పాటు పీసీసీ సీనియర్ నేతలతో మంగళవారం మీనాక్షి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ సమావేశంలో జిల్లాల కాంగ్రెస్ అధ్యక్షులు, కార్పొరేషన్ ఛైర్మన్లు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షులు తదితరులు పాల్గొంటారు.