నేతలతో కిటకిటలాడుతున్న గాంధీభవన్
గాంధీ భవన్ నాయకులు, కార్యకర్తలతో కిటకిటలాడుతోంది.మంత్రులతో ముఖాముఖీ, జిల్లా పార్టీ సమీక్షలతో గాంధీ భవన్ కాంగ్రెస్ కార్యకర్తల రాక పెరగడంతో కోలాహలంగా మారింది.
By : The Federal
Update: 2024-10-14 08:18 GMT
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో పాటు పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించాక పార్టీ కార్యాలయం అయిన గాంధీ భవన్ నాయకులు కార్యకర్తలతో సందడిగా మారింది. పీసీసీ కొత్త అధ్యక్షుడు మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుండటంతో పార్టీ కార్యాలయానికి వచ్చే కార్యకర్తల సంఖ్య పెరిగింది.
మంత్రుల ముఖాముఖీ కార్యక్రమాలు
ఇప్పటికే పలువురు మంత్రులు గాంధీ భవన్ కు వచ్చి ముఖాముఖీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రుల ముఖాముఖీ కార్యక్రమాల్లో కార్యకర్తలు ఎక్కువ మంది పాల్గొన్నారు. ఈ నెల 15వ తేదీన మంగళవారం మంత్రులతో ముఖాముఖీ కార్యక్రమంలో భాగంగా పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గాంధీ భవన్ లో ముఖముఖీలో పాల్గొంటారని పీసీసీ నాయకులు చెప్పారు. మంత్రి రాక నేపథ్యంలో రేపు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వస్తారని ఆ పార్టీ నాయకులు చెప్పారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు జరగనున్న ముఖాముఖీ కార్యక్రమంలో మంత్రి సీతక్క గారు ప్రజల నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులను స్వీకరిస్తారని పీసీసీ నేతలు సోమవారం చెప్పారు.
రేపటి నుంచి జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు
గాంధీ భవన్ లో మంగళవారం నుంచి కాంగ్రెస్ పార్టీ జిల్లా నేతల సమీక్షా సమవేశాలు జరపాలని నిర్ణయించినట్లు పీసీసీ అధినేత మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. గాంధీ భవన్ లో మంగళవారం 15వ తేదీనఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం జరపాలని నిర్ణయించారు. 15వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల సమావేశం ఉంటుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. 16వ తేదీన ఉదయం గాంధీ భవన్ లో హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశామని పీసీసీ నేతలు చెప్పారు.
కాంగ్రెస్ నేతల సమావేశం
16వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, ఛైర్మన్ ల సమావేశం నిర్వహిస్తామని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. తన అధ్యక్షతన జరిగే ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, ఏఐసీసీ కార్యదర్శులువిష్ణునాథ్ ,విశ్వనాథం, మంత్రులు, ఇన్ చార్జ్ మంత్రులు, డీసీసీ అధ్యక్షులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ ఆఫీస్ బేరర్లు, కార్పొరేషన్ చైర్మన్ లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొంటారని పీసీసీ అధ్యక్షుడు చెప్పారు.