ఓట్ల కోసమే బీఆర్ఎస్ డ్రామాలు.. ఘాటు విమర్శలు చేసిన మంత్రులు
కేసీఆర్.. మీ అల్లుడు హరీష్‌ను అదుపులో పెట్టుకోండంటూ సూచించిన మంత్రి అడ్లూరి.
జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో తెలంగాణ రాజకీయం వేడెక్కుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం రోజురోజుకు తీవ్రతరం అవుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పరస్పరం విమర్శలు, ఆరోపణలతో ప్రత్యర్థులను నిందించుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకోవడం కోసం బీఆర్ఎస్ నేతలంతా ఆటోల్లో ప్రయాణించారు. అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు పలు విమర్శలు చేశారు. దీంతో హరీస్ రావు విమర్శలకు తెలంగాణ మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జూబ్లీ ఉపఎన్నిక కోసం బీఆర్ఎస్ డ్రామాలు ఆడుతోందన్నారు. ఇన్నాళ్లూ వాళ్లకి ఆటో కార్మికులు గుర్తుకు రాలేదా? అని విమర్శించారు. తమ ప్రభుత్వం ఏ ఒక్కరినీ మోసం చేయలేదని, బీఆర్ఎస్ చేసిన పాపాలే ఇప్పటి ప్రభుత్వాన్ని వెంటాడుతూ ఏ పని చేయకుండా అడ్డుపడుతున్నాయని ఘాటు వ్యాక్యలు చేశారు.
హరీష్‌వి పచ్చి అబద్ధాలు: అడ్లూరి లక్ష్మణ్
‘‘హరీష్ రావు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు. అంతా పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారు. బలహీన వర్గాల మంత్రులు ఉన్న మంత్రివర్గాన్ని దండుపాళ్యం బ్యాచ్ అని ఆయన ఎలా అంటారు. రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గం దండుపాళ్యం బ్యాచ్ అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని క్యాబినెట్ స్టువర్ట్ పురం దొంగలా? ఎస్సీ, ఎస్టీ, బీసీ నాయకులు మంత్రులుగా ఉన్న క్యాబినెట్‌పై చేసిన వ్యాఖ్యలకు హరీష్ రావు తక్షణమే క్షమాపణలు చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు.
కవిత ఆరోపణలపై మోనమేలా హరీష్: అడ్లూరి
‘‘కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో హరీష్ రావు అవినీతికి పాల్పడ్డారంటూ కవిత ఆరోపణలు చేశారు. వాటిపై చర్చకు రామ్మంటే హరీష్ రావు తోక ముడిచారు. ఇప్పుడు కొప్పుల ఈశ్వర్‌ను చర్చకు పంపుతామంటున్నారు. కేసీఆర్.. మీ అల్లుడిని అదుపులో పెట్టుకోవాలి. కేసీఆర్‌కు తెలియకుండా 28 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ ఇచ్చారు. అందుకే రెండో సారి బీఆర్ఎస్ పవర్‌లోకి వచ్చినా హరీష్‌కు వెంటనే మంత్రి పదవి ఇవ్వలేదు కేసీఆర్’’ అని అడ్లూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
బీఆర్ఎస్‌వి తప్పుడు ప్రచారాలు: పొన్నం
‘‘బీఆర్ఎస్ అనవసర రాద్దాంతాం చేస్తోంది. జూబ్లీహిల్స్‌లో ఓట్ల కోసం డ్రామాలు ఆడుతోంది. ప్రజల దృష్టి మళ్లించడానికి నానా తిప్పలు పడుతోంది. గులాబీ దండు చేస్తున్న తప్పుడు ప్రచారాలను ప్రజలు పట్టించుకోవద్దు. రాహుల్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి హరీష్ రావుకు లేదు. ప్రజలకు ఇచ్చిన ఎన్నో హామీలను బీఆర్ఎస్ ఎగ్గొట్టింది. ఆటో కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది’’ అని చెప్పారు.