నాయకత్వంపై మండిపోతున్న రాజాసింగ్
తాను సిఫారసుచేసిన నేతను కాదని పార్టీ తనిష్ట ప్రకారం మరోవ్యక్తిని అధ్యక్షుడిగా నియమించటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు;
బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంఎల్ఏ రాజాసింగ్ అధిష్ఠానంపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే గోల్కొండ గోషామహల్ జిల్లాకు పార్టీ అధ్యక్షునిగా అధిష్ఠానం టి ఉమామహేంద్రను నియమించింది. పార్టీ సౌలభ్యంకోసం అధిష్ఠానం తెలంగాణను ఎక్కువజిల్లాలుగా విభజించి సీనియర్ నేతల్లో చాలామందిని అధ్యక్షులుగా నియమిస్తోంది. ఈ నియామకాల్లో తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Kishanreddy) మాట దాదాపు చెల్లుబాటవుతోంది. కొందరు అధ్యక్షులను ఎంపీలు, ఎంఎల్ఏలు చెప్పినట్లుగా నియమిస్తోంది. ఇప్పటికే కొన్ని జిల్లాలకు అధ్యక్షులను నియమించిన పార్టీ తాజాగా నాలుగుజిల్లాలకు అధ్యక్షులను నియమించింది.
తాజా నియామకం ప్రకారం సంగారెడ్డికి సీ గోదావరి, యాదాద్రి భువనగిరికి ఊటుకూరు అశోక్ గౌడ్, మహబూబ్ నగర్ జిల్లాకు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ గోషామహల్(Goshamahal) జిల్లాకు ఉమామహేంద్ర అధ్యక్షలుగా నియమితులయ్యారు. గోల్కొండ గోషామహల్ జిల్లాకు ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమించటంపై గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్(BJP MLA Raja singh) మండిపోతున్నాడు. తాను సిఫారసుచేసిన నేతను కాదని పార్టీ తనిష్ట ప్రకారం మరోవ్యక్తిని అధ్యక్షుడిగా నియమించటంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. తన సిఫారసును లెక్కచేయని పార్టీకి తానేంటో చూపిస్తానని చాలెంజ్ వార్నింగ్ ఇచ్చారు. తన మాటకు విలువలేనపుడు తాను పార్టీలో ఉండి ఉపయోగం ఏమిటన తన మద్దతుదారులతో ఎంఎల్ఏ మాట్లాడుతున్నారు. నాయకత్వం తనను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. తనతో అవసరంలేదని పార్టీ చెబితే వెంటనే ఎంఎల్ఏగా రాజీనామా చేసేస్తానని వార్నింగ్ కూడా ఇచ్చేశారు. తాను ఎవరిపేరును సిఫారసు చేసింది రాజాసింగ్ చెప్పలేదు. ఎంఐఎం నేతలతో కలిసి తిరిగే ఉమమహేంద్రను అధ్యక్షుడిగా ఎలా నియమిస్తారని నాయకత్వాన్ని ఎంఎల్ఏ నిలదీయటం సంచలనంగా మారింది.
ఉమామహేంద్ర నియామకం విషయంలో రాజాసింగ్ రియాక్షన్ నాయకత్వాన్ని కచ్చితంగా ఇబ్బందుల్లో పడేటం ఖాయం. దీనికి కారణం ఏమిటంటే చాలాకాలంగా రాజాసింగ్ తో పార్టీ నాయకత్వంతో సఖ్యత దెబ్బతినేసింది. 2023 ఎన్నికల్లో పార్టీ టికెట్ కూడా చివరినిముషంలోనే దక్కింది. గోషామహల్ నియోజకవర్గం నుండి పోటీచేయటానికి గట్టినేత ఎవరూ దొరకనికారణంగా మాత్రమే వేరేదారిలేక పార్టీ నాయకత్వం రాజాసింగ్ కు టికెట్ ఇచ్చింది. గోషామహల్ నియోజకవర్గంలో ఎంఎల్ఏగా పోటీచేయటానికి గట్టినేత ఎవరైనా దొరికుంటే నాయకత్వం రాజాసింగ్ కు టికెట్ ఇచ్చుండేదే కాదని అందరికీ తెలుసు. కారణం ఏమిటంటే రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై బహిరంగంగానే తిరుగుబాటు చేశారు.
ఎంఎల్ఏ హోదాలో నోటికి ఏదొస్తే అదిమాట్లాడేసి పార్టీని చాలాసార్లు ఇబ్బందుల్లో పడేశారు. రాజాసింగ్ చేసిన కామెంట్లు, ఆరోపణలు, వ్యాఖ్యలు పార్టీకి పెద్దతలనొప్పిగా తయారయ్యాయి. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపుడు ఎంఐఎం పార్టీమీద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కేసు నమోదై కొంతకాలం జైలులో కూడా ఉన్నారు. రాజాసింగ్ బెయిల్ కోసం ఎంత ప్రయత్నించినా దొరకలేదు. ఎందుకంటే రాజాసింగ్ జైలులో ఉన్నపుడు పార్టీ నేతల్లో చాలామంది పరామర్శించలేదు. పరామర్శించకపోగా రాజాసింగ్ కు దూరంగా ఉండిపోయారు. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని నాయకత్వం సమాధానమిచ్చింది. దాంతో పార్టీలో ఎంఎల్ఏ ఒంటరిగా మిగిలిపోయారు. బెయిల్ మీద బయటకు వచ్చిన తర్వాత కూడా చాలామంది పార్టీ నేతలు పరామర్శించలేదు. దాంతో పార్టీ నాయకత్వం రాజాసింగ్ ను దూరంగా పెట్టేసిందన్న విషయం అందరికీ అర్ధమైపోయింది.
2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా కొంపెల్ల మాధవి పోటీచేశారు. అభ్యర్ధిని నిర్ణయించేటపుడు తనతో నాయకత్వం మాట్లాడలేదని, తనఅభిప్రాయాలు తీసుకోలేదని అలిగారు. అందుకనే అభ్యర్ధి తరపున రాజాసింగ్ ప్రచారంలో ఎక్కడా కనబడలేదు. మాధవీలతకు మద్దతుగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amith Shah) ఓల్డ్ సిటీ(Old City)లో ప్రచారం చేసినపుడు కూడా రాజాసింగ్ కనబడలేదు. అంతకుముందు నుండి ఎంఎల్ఏ కూడా పార్టీ ఆఫీసుకు వెళ్ళటం మానుకున్నారు. మొదటినుండి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, సహచర కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Bandi Sanjay) తో కూడా పడదని పార్టీవర్గాల సమాచారం. అసెంబ్లీలో బీజేఎల్పీ లీడర్ పదవిని రాజాసింగ్ ఆశించినా నాయకత్వం ఇవ్వలేదు. రాజాసింగ్ కు ఇవ్వటం ఇష్టంలేక చివరకు బీజేఎల్పీ లీడర్ పోస్టును ఖాళీగా ఉంచేసింది.
2023 ఎన్నికల్లో బీజేపీ తరపున 8మంది ఎంఎల్ఏలు గెలిచారు. ఈసారైనా బీజేఎల్పీ లీడర్ పోస్టు దక్కించుకునేందుకు రాజాసింగ్ చాలా ప్రయత్నాలు చేశారు. అయితే నాయకత్వం మాత్రం బీజేపీ తరపున మొదటిసారి గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డికి(Aleti Maheswar Reddy) ఇచ్చింది. అప్పటినుండి నాయకత్వంపైన ఎంఎల్ఏ బాగా మంటగా ఉన్నారు. ఇపుడు రాజాసింగ్ బీజేపీలోనే ఉన్నారా లేరా అన్నట్లుగా ఉంది వ్యవహారం. ఈ నేపధ్యంలో గోషామహల్ జిల్లా అధ్యక్షపదవికి రాజాసింగ్ సిఫారసుచేసిన నేతను కాదని నాయకత్వం తనిష్టం వచ్చిన నేతను నియమించింది. దాంతో పార్టీ నాయకత్వానికి రాజాసింగ్ అంటే ఏమిటో చూపిస్తానని తన మద్దతుదారులతో చెబుతున్నారు. మరి ఏమిచేస్తారో చూడాల్సిందే.