ఈ పద్దతిలో రాజాసింగ్ సేఫ్
ఎంఎల్ఏ పదవికి అనర్హుడిగా చేయలని బీజేపీ జాతీయ నాయకత్వం అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది.;
గోషామహల్ ఎంఎల్ఏ రాజాసింగ్ సభ్యత్వంపై ఊహాగానాలు చాలా జోరుగా సాగుతున్నాయి. బీజేపీకి రాజాసింగ్ చేసిన రాజీనామాను జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) ఆమోదించిన విషయం తెలిసిందే. రాజీనామా ఆమోదంపొందిన దగ్గర నుండి రాజాసింగ్ ఎంఎల్ఏ పదవి కూడా పోతుందనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. పార్టీకి దూరమైపోయిన రాజాసింగ్(MLA Rajasingh) ను ఎంఎల్ఏ పదవికి అనర్హుడిగా చేయలని బీజేపీ జాతీయ నాయకత్వం అసెంబ్లీ స్పీకర్ కు లేఖ రాయబోతోందనే ప్రచారం సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతోంది. నిజంగానే రాజాసింగ్ పై అనర్హత వేటుపడుతుందా అనే సందేహం పెరిగిపోతోంది.
అసెంబ్లీ వర్గాల సమాచారం ప్రకారం రాజాసింగ్ ఫుల్లు సేఫ్ గానే ఉన్నారు. పార్టీకి రాజీనామా చేసినంతమాత్రాన రాజాసింగ్ ఎంఎల్ఏ పదవికి వచ్చిన ఢోకా ఏమీలేదు. రాజాసింగ్ పై కోపంతో పార్టీ జాతీయ నాయకత్వం ఎంఎల్ఏ పదవికి అనర్హుడిగా చేయమని లేఖ రాసినంత మాత్రాన రాజాసింగ్ కు ఎలాంటి నష్టం జరగదు. ఎందుకంటే జాతీయ నాయకత్వం రాసిన లేఖ ఆధారంగా ఎంఎల్ఏపై అసెంబ్లీ స్పీకర్ అనర్హుడిగా ప్రకటించే అవకాశంలేదు. రాజాసింగ్ పై ఎప్పుడు అనర్హత వేటుపడుతుంది ? ఎప్పుడంటే, రాజాసింగ్ ఏదైనా పార్టీలో చేరినపుడు, బీజేపీ విప్ ను అతిక్రమించి సొంతంగా వ్యవహరించినపుడు మాత్రమే అనర్హత వేటుపడుతుంది.
2023 అసెంబ్లీఎన్నికల్లో రాజాసింగ్ గెలిచింది బీజేపీ(Telangana BJP) పార్టీ గుర్తుపైన. కాబట్టి ఇపుడు పార్టీకి చేసిన రాజీనామా ఆమోదంపొందిన కారణంగా పార్టీపరంగా మాత్రమే రాజాసింగ్ బీజేపీకి దూరమయ్యాడు. అయితే అసెంబ్లీ రికార్డుల్లో సాంకేతికంగా బీజేపీ శాసనసభ్యుడిగానే కంటిన్యు అవుతాడు. అంటే మరో మూడున్నరేళ్ళు రాజాసింగ్ సాంకేతికంగా బీజేపీ ఎంఎల్ఏనే. బీజేపీ ఎంఎల్ఏగా గెలిచిన రాజాసింగ్ వేరే ఏదైనా పార్టీలో చేరితే అప్పుడు అనర్హత వేటుపడే అవకాశాలున్నాయి. తమపార్టీ గుర్తుమీద గెలిచిన రాజాసింగ్ ఇంకో పార్టీలో చేరటం తప్పు కాబట్టి అనర్హత వేటువేయాలని బీజేపీ జాతీయ నాయకత్వం లేఖ రాస్తే అప్పుడు అనర్హత వేటుకు అవకాశముంది.
అలాగే అసెంబ్లీలో ఏదైనా సందర్భంలో ఓటింగ్ జరుగుతుంది అనుకుందాం. అప్పుడు ఆ ఓటింగుకు సంబంధించి పార్టీ ఒక నిర్ణయం తీసుకుని సభ్యులు ఎలా నడుచుకోవాలనే విషయమై ఆదేశాలు(విప్) జారీచేస్తుంది. పార్టీ జారీచేసిన విప్ కు విరుద్ధంగా రాజాసింగ్ నడుచుకున్నపుడు కూడా అనర్హత వేటుపడే అవకాశముంది. పార్టీతో సంబంధంలేకపోయినా అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి సాంకేతికంగా బీజేపీ ఎంఎల్ఏనే కాబట్టి పార్టీ విప్ కు రాజాసింగ్ కట్టుబడుడాల్సిందే. పార్టీనే వద్దనుకున్నపుడు ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవి మాత్రం ఎందుకని రాజాసింగ్ ఎంఎల్ఏ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తే అప్పుడు అసలు ఏ గొడవా ఉండదు. వెంటనే స్పీకర్ ఆమోదిస్తే జూబ్లీహిల్స్(Jubilee Hills) అసెంబ్లీ ఉపఎన్నికతో పాటు గోషామహల్(Gosha Mahal) నియోజకవర్గానికి కూడా ఉపఎన్నిక జరిగే అవకాశముంది. సో, దీన్నిబట్టి అర్ధమవుతున్నది ఏమిటంటే ఇప్పటికైతే రాజాసింగ్ సేఫ్ అని.