MLC కవితకి అనారోగ్యం... ఆసుపత్రికి తరలింపు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకి గురయ్యారు.

Update: 2024-07-16 12:53 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకి గురయ్యారు. దీంతో అధికారులు ఆమెను ఢిల్లీలోని దీనదయాళ్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించారు. అనారోగ్య సమస్యలతో ఉన్న కవిత ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోవడంతో మెరుగైన చికిత్స కోసం అధికారులు ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం తిరిగి కవితను అధికారులు తీహార్ జైలుకు తరలించారు. జ్వరం, గొంతు ఇన్ఫెక్షన్ కారణంగా ఆమె అస్వస్థతకి గురయ్యారని, ఆసుపత్రి వైద్యులు ఇంజక్షన్ ఇచ్చారు. 

కాగా, ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసుకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆప్ నేత మనీష్ సిసోడియాల జ్యుడీషియల్ కస్టడీని కోర్టు పొడిగించింది. జులై 3తో గతంలో మంజూరైన జ్యుడీషియల్ కస్టడీ గడువు ముగియడంతో... దర్యాప్తు అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారిని కోర్టు ముందు హాజరుపరిచారు. విచారణ అనంతరం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఇద్దరి కస్టడీని జూలై 25 వరకు పొడిగించారు. దీంతో తదుపరి విచారణ జులై 25 కి వాయిదా పడింది.

ఇక, లిక్కర్ కేసులో మార్చ్ 15న అరెస్టైన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను జులై 1 న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చూపలేమని తేల్చి చెప్పేసింది. విద్యావంతురాలిగా, పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలంటించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితకి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే అంశం ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని, మరికొందరు నిందితులు కూడా ఆమె తరపునే పని చేసినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెని నిస్సహాయ మహిళగా భావించలేమంటూ... కవిత బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం రిజెక్ట్ చేసింది. దీంతో సుప్రీం కోర్టుకి వెళ్లాలనే ఆలోచనలో కవిత కుటుంబ సభ్యులు ఉన్నారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావులు మూడు నాలుగు రోజులు ఢిల్లీలోనే ఉండి సుప్రీం కోర్టులో పిటిషన్ వేయడంపై న్యాయసలహాలు తీసుకున్నారు. త్వరలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Tags:    

Similar News