‘సెక్రటేరియట్‌కు రేవంత్ ఎందుకు రావట్లేదు?’

యూరియా కోసం కూడా సీఎం రేవంత్.. కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చురకలంటించారు.;

Update: 2025-07-10 11:20 GMT

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి సెక్రటేరియట్‌కు రావడానికి జంకుతుండటం హాస్యాస్పదం అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శలు గుప్పించారు. వాస్త భయంతోనే ఆయన సెక్రటేరియట్‌కు వచ్చే ధైర్యం చేయడం లేదని చురకలంటించారు. మీడియా ముందు సవాళ్లు విసిరే దమ్ము ఉన్న రేవంత్‌కు చర్చకు వచ్చే ధైర్యం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీ రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ఎందుకు ఒక నిర్ణయం తీసుకోలేదు? అని ఆమె నిలదీశారు. బీసీల విషయంలో రేవంత్‌కు చిత్తశుద్ధి లేదని, వారిని న్యాయం చేయాలన్న ఆలోచన లేదని చురకలంటించారు. బీసీలకు మద్దతుగా నిలిచే పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ ఒక్కటేనని ఆమె పేర్కొన్నారు. బీసీల విషయంలో రేవంత్ సర్కార్.. అంకెల గారడీ చేస్తోందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో చేయించిన బీసీ సర్వేలో బీసీల సంఖ్య జనాభాలో 52శాతంగా వచ్చిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్ చేయించిన సర్వేలో మాత్రం 46శాతంగానే ఉండటం హాస్యాస్పదమని, అంతేకాకుండా అనేక అనుమానాలకు కూడా తావిస్తోందని ఆమె పేర్కొన్నారు.

రేవంత్‌ది మాటల మద్దతు మాత్రమే..!

బీసీ రిజర్వేషన్ల విషయంలో రేవంత్ రెడ్డి రెండు నాల్కల ధోరణి అవలంభిస్తున్నారని ఆరోపించారు. బీసీలకు రేవంత్ ఇస్తున్న మద్దతు అంతా కూడా మాటలకే పరిమితం అవుతుంది తప్పితే.. చేతలకొచ్చే సరికి ఏమాత్రం ముందుకు వెళ్లడం లేదని అన్నారు కవిత. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి నిజంగా, మనస్ఫూర్తిగా బీసీలకు న్యాయం చేయాలి అనుకుంటే ఇన్నాళ్లు? పట్టేదా? అని నిలదీశారు. గల్లిలో ఒక మాట చెప్తున్న రేవంత్.. ఢిల్లీకి వెళ్లగానే మాట మార్చేస్తున్నారని, ఢిల్లీ పెద్దలను కాకపట్టుకోవడానికే రేవంత్‌కు సమయం సరిపోవట్లేదని చురకలంటించారు. రేవంత్ రెడ్డి బీసీలకు మద్దతుగా మాట్లాడితే ఆచరణలో చూపించాల్సిన అవసరం ఉందన్నారు.

రైతులకూ కష్టాలే..!

రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అన్ని వర్గాల ప్రజలకు కష్ట కాలం మొదలైందని కవిత విమర్శించారు. వారిలో రైతులు అత్యధికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పొలాలకు నీళ్లు అందక మొన్నటి వరకు రైతులు నానా అవస్థలు పడ్డారని, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని అన్నారు. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం రైతులకు పూర్తి న్యాయం చేశామని చెప్పుకుంటూ విజయోత్సవాలు కూడా నిర్వహించుకోవడం హాస్యాస్పదమని అన్నారామే. ఇప్పుడు పొలాలకు కావాల్సి ఎరువులను కూడా అందించే పరిస్థితిలో ప్రభుత్వం లేదని అన్నారు. ఒక్కో రైతుకు ఒక బస్తా యూరియా ఇచ్చే పరిస్థితి కూడా లేదు. యూరియా కోసం కూడా సీఎం రేవంత్.. కేంద్రాన్ని అడుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయని చురకలంటించారు కవిత.

Tags:    

Similar News