‘బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్.. జాగృతి విజయమా..!’
ఆర్డినెన్స్ తెచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే.. ఈ 18 నెలలు ఎందుకు ఆగారు?;
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలంగాణ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్, జూపల్లి కృష్ణారావు కలిసి వెల్లడించారు. కాగా తెలంగాణ మంత్రివర్గం తీసుకున్న ఈ నిర్ణయం తెలంగాణ బీసీ బిడ్డలు, తెలంగాణ జాగృతి సాధించిన విజయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించడం ప్రస్తుతం తీవ్ర చర్చలకు దారితీస్తోంది. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తీసుకురావడంతోనే ప్రభుత్వం వేరే దారిలేక ఈ నిర్ణయం తీసుకుందని కవిత అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఆమె.. జాగృతి శ్రేణులతో కలిసి ట్యాంక్‌బండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఈ 18 నెలలు ఎందుకు ఆగారు: కవిత
‘‘స్థానిక సంస్థల ఎన్నికల కన్నా ముందే బీసీలకు 42శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు. క్యాబినెట్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ప్రభుత్వం చేసిన ఈ కీలక ప్రకటన నేపథ్యంలో ఈ నెల 17న చేపట్టనున్న రైల్ రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నాం. కానీ ప్రభుత్వం నిర్ణయంపై మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఆర్డినెన్స్ తెచ్చిన వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే.. ఈ 18 నెలలు ఎందుకు ఆగారు? రాజకీయంగా లబ్ది పొందడం కోసమే ఇలా చేశారని మాకు అనిపిస్తోంది. రిజర్వేషన్లు అమలు చేసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే.. రిజర్వేషన్ల ప్రభావంతో గెలవాలనే కాంగ్రెస్ ప్లాన్ చేస్తోందని అనిపిస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రిజర్వేషన్ల చుట్టూ రాజకీయాలు చేస్తున్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోవడంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఇబ్బంది పడుతున్నారు. రాజ్యాంగ సవరణ జరిగితే బీసీలకు రాజకీయంగా హక్కులు లభిస్తాయి’’ అని కవిత పేర్కొన్నారు.
కేంద్రానికి నిమిషం పట్టదు..
‘‘కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తలుచుకుంటే రాజ్యాంగ సవరణ పెద్ద విషయమే కాదు. నిమిషంలో సవరణ చేసి రిజర్వేషన్లను అధికారికం చేయగలదు. కానీ అలా చేయడం లేదు. తప్పంతా కూడా కాంగ్రెస్ నెత్తిన రుద్దు తప్పించుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుందేమో.. కానీ ప్రజలు అంతా గమనిస్తున్నారు. ఇది బీజేపీ గుర్తుంచుకోవాలి. బీసీ బిల్లును షెడ్యూల్-9లో చేర్చాలి. ఇందుకు బీసీ బిడ్డ, కేంద్రమంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలి. అదే విధంగా ఆర్డినెన్స్ తెస్తామని ప్రభుత్వం చెప్పినందుకు.. వారం రోజుల పాటు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తాం. ఈ విషయంలో పురోగతి కనిపించకపోతే రైల్ రోకోను యథావిధిగా చేపడతాం’’ అని కవిత స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లకు కవితకు ఏంటి సంబంధం?
బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకురావాలన్న తెలంగాణ మంత్రివర్గ నిర్ణయాన్ని తమ విజయంగా కవిత చెప్పుకోవడాన్ని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తప్పుబట్టారు. అసలు బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ క్యాబినెట్ గురువారం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం వెనక రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఆశయం ఉందని స్పష్టం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం ఎనలేని కృషి చేస్తోంది కాంగ్రెస్ మాత్రమేనన్నారు. ‘‘బీసీ రిజర్వేషన్లకు భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధం? మేం చేసిన దానికి ఆమె క్రెడిట్ తీసుకోవడమేంటి? కవితను చూసి జనాలు నవ్వుకుంటున్నారు. కేసీఆర్ పదేళ్లు ఏం వెలగబెట్టారని ఆమె బీసీ పాట పాడుతున్నారు. బీసీ రిజర్వేషన్లు రాహుల్ అజెండా, రేవంత్ నిబద్ధత’’ అని మహేష్ కుమార్ అన్నారు.