బిజెపీ సభలో మోదీ ఫొటోనే కనిపించాలి
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ రెండో సారి రానున్నారు. ఈ సభల్లో మోదీ ఫొటో తప్ప చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలు వద్దని వారించినట్లు సమాచారం.;
Byline : G.P Venkateswarlu
Update: 2024-04-19 12:00 GMT
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం తారా స్థాయికి చేరింది. ఈ ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిగా ఎన్డీఏ కూటమి తరఫున ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీలు భాగస్వామ్యంగా ఉన్నాయి. ఈ పార్టీల తరఫున ఉమ్మడి అభ్యర్థులను గెలిపించే బాధ్యత ప్రధానితో పాటు చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిపై ఉంది. ఇప్పటికే వారు ఒక ప్రణాళిక తయారు చేసుకొని ప్రచారానికి వెళ్తున్నారు.
ఎక్కువ సార్లు వేర్వేరుగానే కూటమి ప్రచారం
రాష్ట్రంలో పేరుకు మాత్రమే కూటమి ఏర్పడింది కానీ ఈ కూటమి నేతల్లో పూర్తి స్థాయిలో సఖ్యత ఉన్నట్లు కనిపించడం లేదు. కారణాలు ఏమైనా కావచ్చు కానీ ఓటర్లుకు వీరిచ్చే సందేశం కాస్త సందేహాలను రేకెత్తిస్తున్నాయి. జగన్ అరాచక పాలన అంతమొందాలి అంటూ ఊగి పోయి, వెనక్కు ముందుకు పడుతూ, జుట్టును ఎగరేస్తూ చేతులతో బల్ల గుద్దినట్లు ఆహార్యాన్ని ప్రదర్శిస్తూ పవన్ కల్యాణ్ ప్రసంగాలను కొనసాగిస్తున్నారు. ఇక చంద్రబాబు నాయుడు సరే సరి. ఆయన ప్రసంగం గురించి పెద్దగా చెప్పేదేమీ ఉండదు. జగన్ దుర్మార్గుడు, అవినీతి పరుడు, దోపిడీలకు తెర దీసాడు, ఎంతో మంది టీడీపీ కార్యకర్తలను పొట్టనపెట్టుకున్నాడు, అలాంటి అరాచక వాదులను సాగనంపండి అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ప్రధానంగా ఈ రెండు పార్టీలు రాష్ట్ర సమస్యలపై ముఖ్యమంగా ప్రాజెక్టులు, రాజధాని అమరావతి, రహదారుల నిర్మాణాలు, రైతులు, వ్యవసాయ కార్మికుల కోసం మౌలిక సదుపాయాల కల్పన గురించి ఎక్కడా మాట్లాడటం లేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే వచ్చే ప్రయోజనమేంటో గత ఎన్నికల్లో చేప్పారే తప్ప ఈ ఎన్నికల్లో మాట మాత్రానికైనా చెప్పడం లేదు.
భారతీయ జనతా పార్టీ కూడా స్వతగానే ప్రచారం చేసుకుంటూ వెళ్తోంది. అభ్యర్థులు ఎక్కడికక్కడ రాష్ట్రా అధ్యక్షురాలికి ఆహ్వానం పంపడం, ఆమెతో పాటు మరి కొంత మంది వెళ్లి సమావేశాలు మాత్రమే పెట్టి మాట్లాడటం జరుగుతోంది. ఇప్పటి వరకు భారీ స్థాయిలో ఒక బహిరంగ సభ కూడా నిర్వహించ లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో జనం రారని వారికి తెలుసు.
నా ఫొటో పార్టీ గుర్తు తప్ప బ్యానర్‌పై మరేమీ కనిపించ కూడదు
ఆంధ్రప్రదేశ్‌లో రెండో దశ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ రానున్నారు. ఇప్పటికే సూచన ప్రాయంగా షెడ్యూల్ కూడా ఖరారైంది. మొదట రాజమండ్రికి రానున్నారు. బిజెపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి రాజమండ్రి బిజెపీ అభ్యర్థి కావడం వల్ల ఆమె గెలుపు కోసం ప్రధానే స్వయంగా వస్తున్నారు. రాజమండ్రిలో సభ పూర్తి చేసుకొని రాజంపేటకు వెళ్లనున్నారు. అక్కడ మాజీ సీఎం నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి బిజెపీ తరఫున ఎంపీగా పోటీ చేస్తున్నారు. బిజెపీ వారికి ఈ పోటీ కూడా ప్రతిష్టాత్మకమే. కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగాను, అసెంబ్లీ స్పీకర్‌గాను సక్సెస్ అయిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని పార్టీలోకి తీసుకున్న తర్వాత గెలిపించుకుంటే పార్టీ నిర్మాణం మరింత బలపడే అవకాశం ఉందని, మోదీ భావిస్తున్నారు. ఆ నేపథ్యమే రాజంపేటలో ప్రచారానికి ప్రధాన కారణం. ఈ సందర్భంగా ఏర్పాటు చేసే సభలో ఎన్డీఏ కూటమిలోని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్‌లు కూడా పాల్గొంటారు. అయితే వారి కేడర్‌ను సభకు పూర్తి స్థాయిలో తరలిస్తారా లేదా అనే సందేహాలు రాజకీయ పరిశీలకుల్లో ఉన్నాయి. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌కు కూడా పెద్దగా ప్రాధాన్యత ఇవ్వ కూడదని ప్రధాని భావిస్తున్నట్లున్నారు. అందుకే సభ ఏర్పాట్లు, కార్యక్రమాల్లో కూడా బిజెపీ వారే పర్యవేక్షించాల్సిందిగా ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. ప్రధాని వస్తున్నారని సమాచారం ఇంకా కూటమి పార్టీలకు అందలేదు.
సభలో కానీ సభ వెలుపల కానీ ఏర్పాటు చేసే బ్యానర్లు, డిజిటల్ బ్యానర్లపై ప్రధాని మోదీ ఫొటో మాత్రమే కనిపించాలని ఆ పక్కన పార్టీ గుర్తు ఉండాలని అనధికారికంగా పార్టీ నాయకత్వానికి సమాచారం అందినట్లు తెలిసింది. అంటే చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లు సభ ఏర్పాటులో పెద్ద జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని బిజెపీ నుంచి సంకేతాలు అందినట్లేనని తెలిసింది. కేవలం జన సమీకరణ వరకు మాత్రమే వారు పరిమితమైతే బాగుంటుందని బిజెపీ వారు భావిస్తున్నారు.
మతలబేంటి
ప్రధాని మోదీ పాల్గొనే సభలో మిత్ర పక్షాలకు కనీస ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా బిజెపీ ఇష్టపడకపోవడం వెనుక మతలబేంటని చర్చ సాగుతోంది. గత ఐదేళ్ల కాలంలో బిజెపీ కూటమిలో ఉన్న మిత్ర పక్షాలు ఘోర పరాజయాన్ని చవి చూసి కేవలం 3 ఎంపీ స్థానాలకే పరిమితమైంది టీడీపీ. వీరిలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి తప్పుకోగా, విజయవాడ ఎంపీ కేశినేని నాని వైఎస్‌ఆర్‌సీపీలోకి వెళ్లారు. అంటే రెండు స్థానాలు టీడీపీకి దూరమయ్యాయి. ఇక మిగిలింది ఒకే ఒక ఎంపీ. శ్రీకాకుళం నుంచి గెలుపొందిన కింజరాపు రామ్మోహన్‌నాయుడు. ఇతనికి పార్టీలోను, అభిమానుల్లోను మంచి గ్రిప్ ఉంది.
కేంద్రంపై విమర్శ చేయని వైసీపీ..
వైఎస్‌ఆర్‌సీపీ గడచిన ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీకి ఇచ్చిన మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వంపై ఒక విమర్శ కూడా చేయలేదు. పైగా కేంద్ర ప్రభుత్వ పథకాలు గొప్పవని, నాయకులు కూడా రాష్ట్రానికి దేశానికి మంచి చేస్తున్నారని పొగుడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్‌ఆర్‌సీపీని పూర్తిగా వ్యతిరేకం చేసుకొని మిత్ర పక్షాలను భుజానికెత్తుకుంటే ఎన్నికల తీర్పు వెలువడిన తర్వాత జరిగే పరిణామాల్లో మరి కొంత మంది ఎంపీల మద్దతు కావలసి వస్తే పరిస్థితి ఏమిటనే ఆలోచన కూడా ప్రధాని మోదీలో ఉన్నట్లు భారతీయ జనతాపార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే రాష్ట్రంలో ఆ ఇద్దరు నేతల ఫొటోలు పెట్టి ప్రచారం చేయడం కంటే కేవలం మోదీ ఫొటోతో మాత్రమే జనం మధ్యకు వెళ్తే బాగుటుందని మోదీ భావిస్తున్నారు. ఇది జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో స్పష్టం అవుతోంది.