హెచ్ఎండీఏపై మున్సిపల్ శాఖ ఏసీబీకి ఫిర్యాదు

ఇపుడు సడెన్ గా 55 కోట్ల అవినీతిపై విచారణ జరపాలని ఎంఏయూడీ ఉన్నతాధికారులు ఏసీబీ(ACB)కి లేఖ రాయటం సంచలనంగా మారింది.

Update: 2024-10-29 11:59 GMT
Formula E Racing

ఒక విభాగంలో జరిగిన అవినీతిపై విచారణ చేయాలని మరో శాఖ ఏసీబీకి ఫిర్యాదు చేయటం ఇపుడు సంచలనంగా మారింది. రు. 55 కోట్ల నిధుల దుర్వినియోగంపై ప్రభుత్వం కూడా సీరియస్ గా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఫార్ములా ఈ రేసింగ్(Formula E Racing) కు సంబందించి 55 కోట్ల రూపాయలు అవినీతి జరిగిందన్న విషయం వెలుగుచూసింది. 2023 ఫిబ్రవరిలో నగరంలోని హుస్సేన్ సాగర్(Hussain Sagar) చుట్టూ 2.8 కిలోమీటర్ల పరిధిలో ప్రత్యేకంగా కార్ రేసింగ్(Car Racing) కోసం ట్రాకింగ్ ఏర్పాటుచేశారు. రేసింగ్ నిర్వహణ కోసం ఫార్ములా ఈ ఆపరేషన్స(FEO), గ్రీన్ కో కంపెనీతో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (MAUD) ఒప్పందం చేసుకుంది. ఈవెంట్ నిర్వహణకు రాష్ట్రప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్ మాత్రమే. అయ్యే ఖర్చంతా పై రెండు కంపెనీలే భరించాలి. అయితే పోయిన ఏడాది ఎన్నికలకు ముందు మొదలవ్వాల్సిన ఫార్ములా రేసింగ్ ఈవెంట్ కు సంబందించి గ్రీన్ కో కంపెనీ(Green Co)ని తొలగించి ఆ ప్లేసులో రాష్ట్రప్రభుత్వం ఉండేట్లుగా సీనియర్ ఐఏఎస్ అధికారి నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్ అధికారి తీసుకున్న నిర్ణయం ప్రకారం హెచ్ఎండీఏ+ఎఫ్ఈవో సంస్ధలే రేసింగ్ నిర్వహించేట్లుగా డిసైడ్ అయిపోయింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం, ప్రభుత్వంలోని పెద్దలంతా ఎన్నికల హడావుడిలో ఉండటంతో సీనియర్ ఐఏఎస్ అధికారి గ్రీన్ కో కంపెనీని తప్పిస్తు సొంత నిర్ణయం తీసుకున్నారు. గ్రీన్ కో కంపెనీ పెట్టాల్సిన ఖర్చులో 55 కోట్ల రూపాయలను హెచ్ఎండీఏనే పెట్టేట్లుగా చక్రం తిప్పారు. ఇందులో భాగంగానే రేసింగ్ నిర్వహణ ఏర్పాట్లకు రు. 55 కోట్లు విడుదల కూడా చేసేశారు. నిధుల విడుదల చేసేటపుడు కనీసం ఆర్ధికశాఖ అనుమతులు కూడా తీసుకోలేదు. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఎన్నికల నిర్వహణలో బిజీగా ఉండటంతో రేసింగ్ పనులు అనుకున్నంత స్పీడుగా జరగలేదు. దాంతో రేసింగ్ నిర్వహణ వాయిదాపడింది. ఇదే సమయంలో ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వెంటనే గ్రీన్ కో కంపెనీ జరిగిన విషయంపై ప్రభుత్వానికి ఫిర్యాదుచేసింది. దాంతో ఈ విషయమై దృష్టిపెట్టిన ప్రభుత్వం వెంటనే విచారణ జరపాలని చీఫ్ సెక్రటరీ(Chief Secretary) శాంతికుమారిని ఆదేశించింది.

రేసింగ్ నిర్వహణ అంశంపై శాంతికుమారి హెచ్ఎండీఏ అప్పటి డైరెక్టర్ అర్వింద్ కుమార్ తదితరులను విచారించారు. చాలా రోజులు విచారణ జరిగింది. ఆ విచారణలో ఏమి జరిగిందో తెలీదు కాని ఇపుడు సడెన్ గా 55 కోట్ల అవినీతిపై విచారణ జరపాలని ఎంఏయూడీ ఉన్నతాధికారులు ఏసీబీ(ACB)కి లేఖ రాయటం సంచలనంగా మారింది. అంటే రేసింగ్ నిర్వహణలో హెచ్ఎండీఏలో జరిగిన రు. 55 కోట్ల అవినీతిపై విచారించాలని ఎంఏయూడీ ఏసీబీకి పిర్యాదుచేసింది. ఫిర్యాదు అందగానే అనుమతి కోరుతు ఏసీబీ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. మరి ప్రభుత్వం ఏమి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News