ముంచెత్తిన మున్నేరు... రాష్ట్రానికి డిఫెన్స్ హెలికాఫ్టర్, ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్

తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లుతోంది.

Update: 2024-09-01 12:22 GMT

తెలంగాణలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు పొంగి పొర్లుతోంది. దీంతో చుట్టుపక్కల గ్రామాలన్నీ జలమయమయ్యాయి. మున్నేరు వాగు బ్రిడ్జికి కూడా పగుళ్లు వచ్చాయి. మున్నేరు వాగు ప్రకాష్ నగర్ బ్రిడ్జిపైన చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో తెలంగాణాలో ఉన్న హెలికాఫ్టర్లు పనిచేయడంలేదు. దీంతో విశాఖపట్నం నావెల్ బేస్ నుంచి డిఫెన్స్ హెలికాఫ్టర్ రప్పిస్తోంది తెలంగాణ సర్కార్. మున్నేరు వాగు బ్రిడ్జిపై చిక్కుకున్న 9 మందిని రక్షించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

అమిత్ షా కి బండి సంజయ్ రిక్వెస్ట్...

ఖమ్మం జిల్లాలో వరదలు మరింత ఉధృతంగా ఉన్నాయి. దాదాపు 110 గ్రామాలు ముంపునకు గురయ్యాయి.  ఈ క్రమంలో తెలంగాణ, ఖమ్మం జిల్లా వరదల  పరిస్థితులను కేంద్ర హోం మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో ప్రాణనష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీంతో తెలంగాణలో సహాయక చర్యలు తీసుకోవాలని అమిత్ షా ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు.

భారీ వరదల కారణంగా ఖమ్మం జిల్లాలో 110 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. పట్టణంలోని ప్రకాశ్ నగర్ గుట్టపై 9 మంది, పాలేరు నియోజకవర్గంలోని అజ్మీరా తండ గుట్టపైన 68 మంది, బిల్డింగుల పైన 42 మంది చిక్కుకున్న విషయాన్ని బండి సంజయ్ అమిత్ షాకి వివరించారు. ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యల కోసం సహాయక బృందాలను పంపించాలని కోరారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రాణ నష్టం లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఎన్డీఆర్ఎఫ్ ను ఆదేశించారు అమిత్ షా.

చెన్నై, వైజాగ్, అసోం నుండి 3 బృందాల చొప్పున మొత్తం 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను తెలంగాణకు పంపారు. ఎన్డీఆర్ఎఫ్ ఉన్నతాధికారులతో మాట్లాడిన బండి సంజయ్.. రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకుంటూ సహాయక చర్యలు చేపట్టాలని ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు సూచించారు. కేంద్ర ఆదేశాలతో రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ బృందాలు.. ఖమ్మంలో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు.

Tags:    

Similar News