తెలంగాణా మంత్రికి చంద్రబాబు ప్రభుత్వం నోటీసులు ?

కాంట్రాక్టు దక్కించుకుని ఏడాది అయినా పనులు ఎందుకు మొదలుకాలేదో చెప్పాలని ఏపీఈపీడీసీఎల్ రాఘవ కంపెనీకి నోటీసులు జారీచేసింది.

Update: 2024-07-31 07:18 GMT
Minister Ponguleti

తెలంగాణా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కంపెనీకి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీచేసింది. వినటానికి విచిత్రంగానే ఉన్నా ఇది వాస్తవం. ఇంతకీ విషయం ఏమిటంటే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి రాఘవ పేరుతో కన్ స్ట్రక్షన్స్ కంపెనీ ఉంది. ఈ కంపెనీ మౌళిక సదుపాయాల కల్పనతో పాటు అనేక కాంట్రాక్టులు చేస్తుంటుంది. జగన్మోహన్ రెడ్డికి పొంగులేటికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. 2014 ఎన్నికల్లో మొదటిసారి ఖమ్మం ఎంపీగా పొంగులేటి పోటీచేసి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే. అప్పుడు పొంగులేటి ఎంపీగా గెలిచింది వైసీపీ పార్టీ తరపునే.

మొదటినుండి కాంట్రాక్టు ఫీల్డులో ఉన్న పొంగులేటి తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఎంపీగా గెలిచన దగ్గర నుండి జగన్ కు బాగా సన్నిహితమైపోయారు. ఆ సన్నిహితంతోనే ఏపీలో కూడా చాలా కాంట్రాక్టులు తీసుకున్నారు. ఇపుడు విషయం ఏమిటంటే జగన్ హయాంలోనే విద్యుత్ రంగానికి సంబంధించి ఏపీఈపీడీసీఎల్ తో కాంట్రాక్టు కుదుర్చుకున్నారు. ఈ కాంట్రాక్టు ఏమిటంటే భూగర్భ విద్యుత్ లైన్ల ఏర్పాటు చేయటం. కాంట్రాక్టు మొత్తం రు. 1194 కోట్లు. టెండర్లు దక్కించుకుని ఏడాది అవుతున్నా కంపెనీ ఇంతవరకు పనులు మొదలుపెట్టలేదు. పూర్తిగా కేంద్రం నిధులతో జరగాల్సిన కాంట్రాక్టు పనులను వెంటనే మొదలుపెట్టి గడువులోగా పూర్తిచేయకపోతే కాంట్రాక్టు రద్దవుతుంది.

కాంట్రాక్టు దక్కించుకుని ఏడాది అయినా పనులు ఎందుకు మొదలుకాలేదో చెప్పాలని ఏపీఈపీడీసీఎల్ రాఘవ కంపెనీకి నోటీసులు జారీచేసింది. నెల రోజుల్లోగా పనులు మొదలుపెట్టకపోతే కేంద్రం గ్రాంట్ నిలిచిపోతుందని విద్యుత్ శాఖ మంత్రి కంపెనీకి జారీచేసిన నోటీసుల్లో స్పష్టంగా హెచ్చరించింది. కాంట్రాక్టు పనుల్లో ఎంతో అనుభవం ఉన్న రాఘవ కన్ స్ట్రక్చర్ కంపెనీ ఎందుకు భూగర్భ విద్యుత్ లైన్లు వేసే పనులు ప్రారంభించలేదో అర్ధంకావటంలేదు. కాంట్రాక్టు దక్కించుకున్న కంపెనీ పనులను వెంటనే ప్రారంభించాలని, లేకపోతే కాంట్రాక్టు రద్దవుతుందని పొంగులేటికి బాగా తెలుసు. అయినా పనులు ప్రారంభించలేదంటే అర్ధమేంటి ? 2024 ఎన్నికల్లో వైసీపీ గెలుపు మీద నమ్మకం లేకనే పొంగులేటి పనులు ప్రారంభించలేదా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

కాంట్రాక్టు దక్కించుకున్న తర్వాత పనులు మొదలుపెట్టకపోయినా, గడువులోపల పనులు పూర్తిచేయకపోయినా ప్రభుత్వం జరిమానా విధిస్తుందన్న విషయం మంత్రికి తెలియనది కాదు. కాంట్రాక్టులు, ఆర్ధిక విషయాలు, జరిమానాలను పక్కన పెట్టేస్తే పనులు మొదలుపెట్టి వెంటనే పూర్తిచేయకపోతే జనాలకు ఎంతటి అసౌకర్యమో కంపెనీలు, ప్రభుత్వం ఆలోచించటంలేదు. మరి తాజా నోటీసులకు మంత్రి కంపెనీ ఏమని సమాధానం ఇస్తుందో చూడాలి. జగన్ కు పొంగులేటి బాగా సన్నిహితుడు కాబట్టే ఆయన కంపెనీకి చంద్రబాబునాయుడు ప్రభుత్వం నోటీసులు జారీచేసిందనే ఆరోపణలు కూడా మొదలయ్యాయి.

Tags:    

Similar News