కుల గణన సిఫార్సులు ఎన్నికలకే పరిమితమా?
బీసీ రిజర్వేషన్ అంశమనేది ఎన్నికల్లో వినియోగించుకునే అస్త్రంలా మారిపోయింది.;
బీసీ రిజర్వేషన్ అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ఓ ఊపుఓపేస్తోంది. అధికారప్రతిపక్షాలు రెండూ కూడా ప్రస్తుతం బీసీ అస్త్రంతోనే రాజకీయ సమరానికి సై అంటున్నాయి. మాటల యుద్ధాలు చేస్తున్నాయి. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. దీంతో రాష్ట్రంగా ఎక్కడ చూసినా బీసీ రిజర్వేషన్ అంశమే కీలకంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ రిజర్వేషన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ తన రిపోర్ట్‌ను ప్రభుత్వానికి అందించింది. దీనిపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం స్పందించారు. బీసీ రిజర్వేషన్ అంశమనేది ఎన్నికల్లో వినియోగించుకునే అస్త్రంలా మారిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల గణన విషయంలో తొందరపడటం మానుకోవాలి బీసీల కుల గణన విషయంలో ప్రభుత్వం ఎందుకు ఆదరాబాదరగా వ్యవహరిస్తోంది? ఇలా సిద్ధం చేసిన నివేదికను అమలు చేస్తే అది బీసీలను మోసం చేయడమే అవుతుందని అన్నారు.
‘‘స్థానిక సంస్థల ఎన్నికలలో, బీసీ రిజర్వేషన్లను నిర్ణయించటానికి ఏర్పాటైన భూసాని వెంకటేశ్వరరావు డెడికేటెడ్ కమిషన్ తన నివేదికను అత్యంత గోప్యంగా సోమవారం నాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంత కుమారికి అందజేయడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాం. ఈ విషయాన్ని ప్రధాన కార్యదర్శి కార్యాలయం కూడా అధికారికంగా తెలియజేయకపోవడం విస్మయాన్ని కలిగిస్తున్నది. వెంటనే రిపోర్ట్ లో ఉన్న అంశాలు అన్నీ బహిర్గతం చేయాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం ఆమోదించిన అనంతరం వెలువరించడంలో అభ్యంతరం లేదు. అయితే నివేదిక స్వీకరించిన విషయం కూడా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తున్నది.
రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి నిర్వహించిన సామాజిక, ఆర్థిక కుల సర్వేలో 'బీసీల జనాభా' తగ్గిందని, రాష్ట్రవ్యాప్తంగా బీసీలు నిరసనలు వ్యక్తం చేస్తున్న సందర్భంగా... గత శనివారం నాడు బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్, బీసీ సంఘాల ప్రతినిధులు, మేధావులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వారితో చర్చలు జరిపిన విషయం తెలిసిందే. కాగా ఆ సమావేశంలో ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు, డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి హామీ ఇచ్చి, మూడు రోజులైనా కాకముందే ,ఏ డిమాండ్ ను నెరవేర్చకుండా ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ నుండి నివేదికను రహస్యంగా తెప్పించుకోవడం బీసీలను నిట్ట నిలువునా మోసం చేయడమే. తీరని అన్యాయం, దగా చేయడం. ప్రతిష్టాత్మకంగా భావించే కమిషన్ నివేదికను ముఖ్యమంత్రి స్వయంగా స్వీకరించక పోవడం విచారకరం.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాలు ప్రధానంగా ఓటర్ల జాబితాల ఆధారంగా అధ్యయనం చేసి నిర్వహించాయి. సుప్రీంకోర్టు త్రిబుల్ టెస్టులను పాటించి సమగ్రంగా నివేదికల సమర్పించాయి. ఆయా రాష్ట్రాల నివేదికలను సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. ఆయా రాష్ట్రాలలో 50% సీలింగ్ లక్ష్మణ రేఖ దాటేది లేదు .కాబట్టి సమస్య కూడా లేదు. అయితే మన రాష్ట్రంలో గమనించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలలో 42% బీసీలకు చట్టబద్ధంగా కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సి ఉంది .తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర కుల సర్వే చేపట్టడం జరిగింది. ఆ డేటాను అధికారికంగా డెడికేటెడ్ కమిషన్ కు అందజేయాలి. ఆ వివరాల్ని కమిషన్ క్షుణ్ణంగా అధ్యయనం చేసి, 'రాజకీయ వెనుకబాటుతనమును' నిర్దిష్టంగా గుర్తించాల్సి ఉంటుంది. ఈ కృషిలో భాగంగా. కమిషన్ కూడా స్పష్టమైన మెథడాలజీ రూపొందించుకొని కార్యాచరణ చేపట్టాలి.
అయితే డెడికేటెడ్ కమిషన్ తన నిర్మాణాత్మక కృషిని ఏమాత్రం కొనసాగించకుండానే,ప్రభుత్వ వత్తిడితో నివేదికను సమర్పించడం వలన వివాదాస్పదం అవుతున్నది.ఎందుచేతనంటే కమిషన్ చేపట్టిన కార్యనిర్వహణ అంతా మొక్కుబడిగా కొనసాగింది.ప్రామాణిక పద్ధతులను కమిషన్ పాటించినట్లు ఎక్కడా కనిపించలేదు.బహిరంగ విచారణా ప్రకటనలను వెలువరించకుండానే కొనసాగించిన జిల్లా పర్యటనలు నామమాత్రంగానే సాగాయి. అధ్యయనంలో భాగంగా సామాజికవేత్తలతో, విషయ పరిజ్ఞానులతో, నిపునత కలిగిన సంస్థల ప్రతినిధులతో ప్రత్యేక వర్క్ షాపులు, సమావేశాలు నిర్వహించినట్లు సమాచారం లేదు. కమిషన్ ప్రణాళికలు, పని తీరు ఏ విధంగా కొనసాగుతున్నది అనే అంశంలో మొదటినుండి స్తబ్దత నెలకొని ఉండటం గమనించదగింది. తీరా నివేదిక కూడా గుట్టు చప్పుడు కాకుండా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కి అందజేయడం వలన తమకు ఎంత అన్యాయం జరగబోతున్నాడో అని బీసీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా బీసీలకు ఇచ్చిన హామీ అంశంలో న్యాయపరంగా, శాసనపరంగా ఎలాంటి చర్యలు అవలంబించనున్నదో, చేపట్టనున్నదో స్పష్టం చెయ్యడం లేదు. ఇది ప్రభుత్వ బీసీ వ్యతిరేక వైఖరికి నిదర్శనంగానే కనిపిస్తున్నది. బీసీలకు ఇచ్చిన హామీని ప్రభుత్వంకు నిలబెట్టుకునే ఉద్దేశం లేనప్పుడు ఇంటింటి కుల సర్వే, హంగామా. సామాజిక న్యాయం ,రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతులో పట్టుకొని తిరగడం ఎందుకు? కులగణన చేసి, తెలంగాణ రాష్ట్రం దేశానికి రోల్ మోడల్ అని ఘనంగా ప్రకటించడం ఎందుకు ? ఇంతకన్నా యావత్ దేశాన్ని వచ్చి దగా, మోసం, తప్పు దోవ పట్టించటం మరొకటి ఉండదు.
ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బీసీల పట్ల తన నిబద్ధతను, నిజాయితీని నిరూపించుకోవడానికి రాష్ట్రంలో రీ సర్వే చేయించాలి .లెక్కలు సమగ్రంగా శాస్త్రీయంగా సేకరించాలి.కులాల వారిగా జనాభాను ప్రకటించాలి అలాంటి సంపూర్ణమైన గణాంకాలు సమాచారంతో, డెడికేటెడ్ కమిషన్ తిరిగి తన అధ్యయనంను నిబద్ధతగా కొనసాగించాలి. అలా బీసీలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.