అడ్డం తిరిగిన 'ట్రెడిషనల్ నెమలి కూర'

ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానెల్స్ తాము పోస్ట్ చేస్తున్న కంటెంట్ లో స్థానికతకి, సాంప్రదాయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు.

Update: 2024-08-11 13:41 GMT

ఇప్పుడు అనేక యూట్యూబ్ ఛానెల్స్ తాము పోస్ట్ చేస్తున్న కంటెంట్ లో స్థానికతకి, సాంప్రదాయాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. సహజంగా అనిపించే ఈ కంటెంట్ కి నెటిజన్లు కూడా ఆకర్షితులవుతున్నారు. అందుకే ఎక్కువ మంది యూట్యూబర్లు స్థానికంగా లభించే వస్తువులు, పండే పంటలు, వాళ్ళ ఊరి విశేషాలు, అమ్మమ్మలనాటి వంటలు వంటి కంటెంట్ ని ఎక్కువ క్రియేట్ చేస్తున్నారు.

ఈ క్రమంలో తెలంగాణకి చెందిన ఓ యూట్యూబర్ 'ట్రెడిషనల్ నెమలి కూర రెసిపీ' ని తన యూట్యూబ్ ఛానెల్ లో పెట్టి జంతు ప్రేమికుల ఆగ్రహానికి గురయ్యాడు. అందునా నెమలి జాతీయ పక్షి కావడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో ఆ యూట్యూబర్ ఛానెల్ నుంచి వీడియో తొలగించాల్సి వచ్చింది. ఈ విషయంలో అతనిపై కేసు కూడా నమోదైంది.

వివరాల్లోకి వెళితే...

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన కోడం ప్రణయ్ కుమార్ శ్రీ టీవీ అనే యూట్యూబ్ ఛానల్ లో సాంప్రదాయ వంటల వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ ఛానెల్ కి రెండు లక్షల డెబ్భైయేడు వేలమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. అయితే శనివారం ఈ ఛానెల్ లో ట్రెడిషనల్ పీకాక్ కర్రీ రెసిపీ టైటిల్ తో ఓ వీడియో విడుదల చేశాడు. అందులో నెమలి కూరను ఎలా వండాలో చేసి చూపించాడు. ఈ వీడియో వైరల్ అవడంతో నెటిజన్స్ నుంచి ఆగ్రహం వ్యక్తం అయింది. అతనిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్స్ మొదలయ్యాయి.

ఈ వీడియో భారతదేశ జాతీయ పక్షి అయిన నెమలిని వేటాడడాన్ని ప్రోత్సహిస్తున్నదని వాదనలు వచ్చాయి. వన్యప్రాణుల (రక్షణ) చట్టం 1972 ప్రకారం నెమలికి అత్యున్నత రక్షణ కల్పించబడింది. అలాంటిది అతను ఏకంగా నెమలి కూరను వండి వీడియో తీసి యూట్యూబ్ ఛానెల్ లో ఎలా పోస్ట్ చేస్తాడని జంతు ప్రేమికులు ధ్వజమెత్తారు. దీంతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ అల్ఖిల్ మహాజన్ తన X ఖాతాలో స్పందించారు. "సంబంధిత చట్టం ప్రకారం కేసు నమోదు చేయబడింది. అతనిపైనా, అలాంటి కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాము" అని తెలిపారు.

సదరు యూట్యూబ్ ఛానెల్ లో అడవిపంది కూర ఎలా వండాలో తెలిపే ఇంకొక వీడియో కూడా గతంలో పబ్లిష్ అయింది. విమర్శలు రావడం, కేసు నమోదవడంతో ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్ నుంచి రెండు వీడియోలను తొలగించారు. 

Tags:    

Similar News