రేవంత్ కు ‘ఫార్ములా’ తో కేటీఆర్ దొరికాడా ?
తొందరలోనే కేటీఆర్(KTR) పై కోర్టులో చార్జిషీటు దాఖలు చేయటమో లేకపోతే అరెస్టు చేయటమో ఏదో ఒకటి ఖాయమని తెలుస్తోంది.;
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అడ్డంగా దొరికారా ? ఏసీబీ నివేదిక ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. తాజా డెవలప్మెంట్ల ప్రకారం ఏసీబీ(Telangana ACB) అధికారులు తొందరలోనే కేటీఆర్(KTR) పై కోర్టులో చార్జిషీటు దాఖలు చేయటమో లేకపోతే అరెస్టు చేయటమో ఏదో ఒకటి ఖాయమని తెలుస్తోంది. ఎందుకంటే కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ కార్ రేసు(Formula E Car Case) కేసు చుట్టుకున్నది. కేటీఆర్ తో పాటు అప్పటి ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హుడా మాజీ చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డి, ఏస్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీ సీఈవో కిరణ్ రావు తదితరులతో పాటు బ్రిటన్(Britain) కంపెనీ ఫార్ములా ఈ ఆపరేషన్స్ ముఖ్యులపై చార్జిషీట్ దాఖలుచేయటానికి అనుమతిఇవ్వాలంటు ఏసీబీ అధికారులు ప్రభుత్వానికి ఫైల్ పంపారు.
కేటీఆర్ మీద కేసు నమోదుచేసి విచారించటానికి గతంలోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఏసీబీకి అనుమతి ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. గవర్నర్ అనుమతితోనే కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదుచేసి మూడుసార్లు విచారణ జరిపింది. ఢిల్లీ నుండి రేవంత్ హైదరాబాదుకు చేరుకోగానే చీఫ్ సెక్రటరీ మాట్లాడి సదరు ఫైలును గవర్నర్ కు పంపబోతున్నారు. గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ఒకటి, రెండు రోజుల్లో కేటీఆర్ మీద ఏసీబీ చార్జిషీటును దాఖలు చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. లేకపోతే కేటీఆర్ తో పాటు ఇతరులను అరెస్టుచేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఫార్ములా కార్ రేసు ముసుగులో భారీ ఎత్తున మనీల్యాండరింగ్ జరిగిందని ఏసీబీ గుర్తించింది. పార్ముల రేసు నుండి మధ్యలోనే తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీ నుండి బీఆర్ఎస్ కు రు. 45 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు ఏసీబీ ఆధారాలను సేకరించింది. ఈ కంపెనీ నుండి బీఆర్ఎస్ కు ఎలక్టోరల్ బాండ్లు అందినట్లు గతంలోనే బ్యాంకులు కూడా వెల్లడించాయి. కార్ రేసు ముసుగులో కాంట్రాక్టును కంపెనీకి అప్పగించిన కేటీఆర్ అదే కంపెనీ నుండి తమ పార్టీకి కోట్లరూపాయల విలువైన ఎలక్టోరల్ బాండ్లను అందుకున్నట్లు విచారణలో ఏసీబీ నిగ్గుతేల్చింది. ఫార్ములాకేసులో క్విడ్ ప్రోకో జరిగినట్లు ఏసీబీ విచారణలో తేల్చింది. నిబంధనలకు విరుద్ధంగా రు. 45 కోట్లను బ్రిటన్ కంపెనీకి చెల్లించాలన్న కేటీఆర్ ఆదేశాల వల్లే తాను నిధులబదిలీకి ఆమోదంతెలిపినట్లు ఇప్పటికే ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్ విచారణలో చెప్పినట్లు సమాచారం. బీఎల్ఎన్ రెడ్డి కూడా ఇదేవిషయాన్ని నిర్ధారించారు. అంటే అర్వింద్, రెడ్డి అప్రూవర్లుగా మారిపోయినట్లు అర్ధమవుతోంది. దీంతో కేటీఆర్ మెడకు ఫార్ములాకేసు గట్టిగా బిగుసుకోబోతున్నట్లు అర్ధమవుతోంది.
ఈకేసులో రెండుకోణాలున్నాయి. మొదటిది అవినీతి, రెండోది అధికార దుర్వనియోగం. అవినీతి ఏమో ఫార్ములా రేసును ఏస్ నెక్స్ట్ జనరేషన్ కంపెనీకి కట్టబెట్టి ఆ కంపెనీ నుండి కోట్లాది రూపాయల ఎలక్టోరల్ బాండ్లు అందుకోవటం. దీన్నే ఏసీబీ క్విడ్ ప్రోకో అని అంటున్నది. ఇక అధికార దుర్వినియోగం ఏమిటంటే నిబంధనలను ఏమాత్రం ఖాతరుచేయకుండా అడ్డదిడ్డంగా బ్రిటన్ కంపెనీకి నిదులను బదిలీచేసేయటం.
బ్రిటన్ కంపెనీకి నిధులు బదిలీచేసేందుకు కేటీఆర్ అప్పటి క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ అనుమతి తీసుకోలేదు. విదేశీకంపెనీలకు విదేశీ కరెన్సీలో నిధులు బదిలీచేయాలంటే రిజర్వ్ బ్యాంక్ అనుమతి తప్పనిసరి. ఆర్బీఐ నుండి అనుమతి తీసుకోకుండానే హెచ్ఎండీఏ నిధులను కేటీఆర్ బ్రిటన్ కంపెనీకి నిధులను బదిలీచేయించేశారు. అలాగే అప్పట్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లో ఉన్నపుడు కేంద్ర ఎన్నికల కమీషన్ అనుమతి తీసుకోవాలి. అయితే కేటీఆర్ ఎన్నికల కమీషన్ అనుమతి కూడా తీసుకోలేదు.
తన అనుమతి లేకుండా హెచ్ఎండీఏ నుండి నిధులు బ్రిటన్ కంపెనీకి బదిలీ అయిన విషయం తెలుసుకుని రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ ప్రభుత్వానికి రు. 8 కోట్ల జరిమానా విదించింది. రిజర్వ్ బ్యాంక్ విధించిన జరిమానాను తెలంగాణ ప్రభుత్వం చెల్లించింది. రిజర్వ్ బ్యాంక్ విధించిన జరిమానాను చెల్లించింది అంటేనే తప్పు జరిగిందని తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లే. తప్పు జరగకపోతే తెలంగాణ ప్రభుత్వం జరిమానా చెల్లించాల్సిన అవసరమే లేదు. ఆతప్పు ఎలా జరిగింది ? ఎవరి కారణంగా జరిగింది ? అంటే అన్నింటికీ కేటీఆరే కారణమని తెలుస్తోంది.
2023 ఎన్నికల్లో మూడోసారి బీఆర్ఎస్సే అధికారంలోకి రాబోతోందనే ప్రచారాన్ని కారుపార్టీ నేతలే విస్తృతంగా చేశారు. దాంతో అధికారయంత్రాంగం కూడా బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తోందని అనుకున్నది. ముఖ్యమంత్రి కొడుకుగా, కాబోయే సీఎంగా ప్రచారంలో ఉన్నారు కాబట్టి కేటీఆర్ ఏమి చెబితే దానికి ఎదురుచెప్పలేక ఉన్నతాధికారులు చేసుకుంటుపోయారు.. ఇదేకారణంతో ఫైనాన్స్ శాఖ ఉన్నతాధికారులు కూడా నోరెత్తలేకపోయారు. నిబంధనలకు విరుద్ధమని తెలిసినా కేటీఆర్ ఆదేశాలను పాటించినందుకు ఉన్నతాధికారులు కూడా ఇపుడు తగులుకున్నారు. అందుకనే జరిగినదాంట్లో తమతప్పిదం ఏమీలేదని విచారణలో చెప్పి అప్రూవర్లుగా మారిపోయినట్లు సమాచారం. రేవంత్ ఢిల్లీ నుండి తిరిగిరాగానే పరిణామాలు చాలావేగంగా మారబోతున్నట్లు తెలుస్తోంది. ఏమి జరగబోతుందన్నది ఆసక్తిగా మారింది.
లొట్టపీసు కేసు
ఫార్ములా ఈ కార్ కేసు లొట్టపీసు కేసుగా కేటీఆర్ చెబుతున్నారు. ఈ కేసులో ఏమీలేదని తాను మొదటినుండి చెబుతున్న విషయాన్ని కేటీఆర్ గుర్తుచేశారు. రేవంత్ కు ధైర్యం ఉంటే మీడియా సమక్షంలో లైడిటెక్టర్ టెస్టుకు తనతో పాటు హాజరవ్వాలని చాలెంజ్ చేశారు. తనపై బురదచల్లేందుకు ఈ కేసును ప్రచారంగా వాడుకుంటున్నట్లు కేటీఆర్ మండిపోయారు. తాను ఏ తప్పుచేయలేదు కాబట్టి ఈ కేసుకు తాను భయపడేది లేదని వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పారు.