సునీతను పరిచయం చేసిన కేటీఆర్
మాగంటి సునీతను కేటీఆర్ పరిచయం చేయటంతోనే అందరికీ విషయం అర్ధమైపోయింది.;
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం మాగంటి సునీతను సీనియర్ నేతలు, క్యాడర్ కు పరిచయంచేశారు. పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సునీత(Maganti Sunitha) పరిచయ కార్యక్రమం జరిగింది. మాగంటి సునీత అంటే చాలామందికి అర్ధమైపోయుంటుంది. ఇంతకీ సునీత ఎవరంటే దివంగత బీఆర్ఎస్(BRS) ఎంఎల్ఏ మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) సతీమణి. ఈరోజు ప్రత్యేకంగా పార్టీ ఆఫీసులో కేటీఆర్(KTR) ఆధ్వర్యంలో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోని సీనియర్ నేతలు, కార్యకర్తలతో సమావేశం జరిగింది. మాగంటి సునీతను కేటీఆర్ పరిచయం చేయటంతోనే అందరికీ విషయం అర్ధమైపోయింది. తొందరలో జరగబోయే జూబ్లిహిల్స్ నియోజకవర్గం(Jubilee Hills By Poll) ఉపఎన్నికలో అభ్యర్ధిగా సునీత పేరును ప్రకటించకుండానే కేటీఆర్ ప్రకటించినట్లు అయ్యింది.
మూడునెలల క్రితం గోపీనాధ్ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. సీమాంద్రులకు గట్టి పట్టున్న జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో గోపి మూడుసార్లు గెలిచారు. వివాదాలకు దూరంగా ఉండే గోపి ఒకసారి తెలుగుదేశంపార్టీ తరపున రెండుసార్లు బీఆర్ఎస్ తరపున వరుసగా గెలిచారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున గెలిచిన గోపి రాజకీయ పరిణామాల కారణంగా బీఆర్ఎస్ లోకి ఫిరాయించారు. తర్వాత 2018, 2023లో జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ధిగా గెలిచారు. 2023ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి మహమ్మద్ అజహరుద్దీన్ పై 16,337 ఓట్ల మెజారిటితో గెలిచారు.
గోపి హఠాన్మరణంతో జూబ్లిహిల్స్ నియోజకవర్గానికి ఉపఎన్నికలు అనివార్యమవుతోంది. అందుకనే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు గట్టి అభ్యర్ధుల కోసం వడపోత మొదలుపెట్టాయి. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ అభ్యర్ధిగా మాగంటి సునీత పేరు దాదాపు ఖరారైనట్లే అనుకోవాలి. అభ్యర్ధిగా పోటీలోకి దింపే ఉద్దేశ్యంలేకపోతే కేటీఆర్ ఈరోజు ప్రత్యేకంగా సునీతను సమావేశంలో పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సునీతను కాదని పోటీచేసేందుకు పార్టీలో ఎవరూ టికెట్ కోసం పోటీపడే అవకాశంకూడా లేదు. ఎందుకంటే ఉపఎన్నిక కాబట్టి పార్టీలు గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డుతాయనటంలో సందేహంలేదు. గెలుపుకు ప్రయత్నాలు చేయటంలో కాంగ్రెస్ కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కారణం ఏమిటంటే కాంగ్రెస్ అదికారంలో ఉండటమే.
పోయిన ఎన్నికల్లో పోటీచేసిన అజహరుద్దీన్ ఈమధ్యనే ఎంఎల్సీ అయ్యారు. కాబట్టి రాబోయే ఉపఎన్నికలో పార్టీ టికెట్ కోసం నవీన్ యాదవ్, బొంతు రామ్మోహన్ తదితరులు రేసులో ఉన్నారు. గట్టి అభ్యర్ధి ఎవరు ? గెలుపు అవకాశాలు ఎవరికి ఉన్నాయనే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఐవీఆర్ఎస్ పద్దతి మొదలుపెట్టింది. బీజేపీలో పోటీచేసే అభ్యర్ధుల విషయం ఇంకా తేలలేదు. కాకపోతే సీనియర్ నేత లంకల దీపక్ రెడ్డి పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రచార హోరు
జూబ్లిహిల్స్ నియోజకవర్గం ఉపఎన్నికలో గెలిపించాలని కోరుతు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటికే ప్రచారాన్ని మొదలుపెట్టేశాయి. కాంగ్రెస్ తరపున మంత్రులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అభ్యర్ధిగురించి ప్రస్తావించకుండా పార్టీని గెలిపించాలని మంత్రులు కోరుతున్నారు. పనిలోపనిగా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను పరుగులు పెట్టిస్తున్నారు. బీఆర్ఎస్ తరపున సోషల్ మీడియాలో కారుగుర్తును గెలిపించాలని బాగా ప్రచారం జరుగుతోంది. ఈరోజు పార్టీమీటింగులో సునీత పరిచయకార్యక్రమం జరిగింది కాబట్టి తొందరలోనే అభ్యర్ధిని ఓటర్లకు పరిచయం చేసే అవకాశముంది.
కాంగ్రెస్ ప్రధానంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, రేవంత్ ఇమేజి మీద ఆధారపడింది. అలాగే బీఆర్ఎస్ ప్రధానంగా గోపి మరణం తాలూకు సానుభూతి, రేవంత్ ప్రభుత్వ వ్యతిరేకత మీద ఆశలు పెట్టుకుంది. సుమారుగా 2.7 లక్షల ఓట్లున్న ఈ నియోజకవర్గంలో ముస్లింల ఓట్లు దాదాపు లక్షదాకా ఉన్నాయి. కాబట్టి ముస్లిం మైనారిటి ఓట్లు చాలా కీలకమని అర్ధమవుతోంది. ముస్లింల తర్వాత ఎస్సీ, అగ్రవర్ణాలు, బీసీల ఓట్లుకూడా బాగానే ఉన్నాయి. ఉపఎన్నికల నోటిఫికేషన్ వెలువడితే ఒక్కసారిగా వేడి రాజుకోవటం ఖాయం.