ఓటును నోటుతో కొనగలమనేది కాంగ్రెస్ ధీమానా..?
బీఆర్ఎస్‌ను గెలిపిస్తేనే మాగంటి గోపీనాథ్‌కు సరైన నివాళి అన్న కేటీఆర్.;
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మళ్ళీ మొదలు కావాలని మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో ఉపఎన్నిక ఉంటుందని ఆయన చెప్పారు. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ అనుసరించాల్సిన వ్యూహాలు, అభ్యర్థికి తరుపున చేయాల్సిన ప్రచారం, లేవనెత్తాల్సిన అంశాలపై తెలంగాణ భవన్‌లో కేటీఆర్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఇందులో జూబ్లీహిల్స్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు. మాగంటి సునీతకు అందరి ఆశీస్సులు ఉంటాయని ఆశిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉపఎన్నికలో ఆమెను భారీ మెజారిటీతో గెలిపించుకోవడమే గోపీనాథ్‌కు సరైన నివాళి అని వ్యాఖ్యానించారు.
హైడ్రాతో హైడ్రామాలే
కాంగ్రెస్ ఇప్పటికి కూడా ఓటును నోటుతో కొనగలమన్న ధీమాతో ఉందని ఆరోపించారు. ‘‘ఓటుకు రూ.5వేలు ఇస్తే గెలిచేస్తాం అని హస్తం నేతలు అనుకుంటున్నారు. ఇచ్చిన హామీలు ఇక్కటి కూడా కాంగ్రెస్ అమలు చేయలేదు. సీఎం సోదరుడు.. చెరువులో ఇళ్లు కట్టుకున్నా హైడ్రా అటు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ పేదలు కట్టుకున్న బస్తీలపై మాత్రం బుల్డోజర్లతో వీరవిహారం చేస్తోంది. న్యాయాస్థానాలు ప్రశ్నించినా హైడ్రా వైఖరి మారలేదు. పేదల ఇళ్లే టార్గెట్‌గా హైడ్రా హైడ్రామాలు ఆడుతోంది’’ అంటూ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు.
కొన్ని చోట్ల వెనకబడి ఉన్నాం..
‘‘బైపోల్ కోసం సర్వేలు చేయిస్తున్నాం. నియోజకవర్గంలో బీఆర్ఎస్ పరిస్థితి బాగుంది. కొన్ని బస్తీల్లో మాత్రమే కాస్తంత వెనకంజలో ఉన్నాం. అందరం కలిసికట్టుగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేయాలి. ఓటర్ల జాబితాలో దొంగ ఓట్లు ఉంటే తొలగించాలి. జాబితాలో లేని ఓటర్లను చేర్చాలి. ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలు బంద్ చేస్తామని.. ఇళ్లు కూలుస్తామని అంటారు. పేదలకు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ మూసీ ప్రాజెక్టుకు డబ్బులు ఉన్నాయట. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో సత్తా చూపాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క మైనార్టీ మంత్రి కూడా లేరు. జూబ్లీహిల్స్ నుంచి భారత రాష్ట్ర సమితి జైత్రయాత్ర మళ్లీ ప్రారంభం కావాలి’’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
కాంగ్రెస్‌కు ఓటేస్తే అంతే సంగతులు..
‘‘హైడ్రా పేరుతో బిల్డర్ల దగ్గర భారీగా డబ్బులు దండుకున్నారు. ఆ అవినీతి సొమ్మును పంచి ఉపఎన్నికలో గెలవాలని రేవంత్ కుట్రలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చి 22 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రజలకు ఆయన ఏం చేయాలేదు. కానీ ఈ ఉపఎన్నికలో గెలవడానికి ఆయన అడ్డదార్లు తొక్కుతున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమేనా..? కాంగ్రెస్‌లో చేరలేదన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్త సర్దార్ ఇంటిని కూల్చివేస్తే ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. హైడ్రా తన ఇల్లు కూలగొడుతుందన్న భయంతో కూకట్‌పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ప్రాణాలు తీసుకుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో పొరపాటున కాంగ్రెస్‌కు ఓటేస్తే, తమ ఇండ్లను కూలగొట్టేందుకు ప్రభుత్వానికి లైసెన్స్ ఇచ్చినట్టే’’ అని కేటీఆర్ హెచ్చరించారు.
మైనారిటీ బడ్జెట్ ఏమైంది రేవంత్..!
‘‘మైనారిటీలను కూడా రేవంత్ ప్రభుత్వం మోసం చేసింది. రూ.4వేల కోట్ల బడ్జెట్ ఇస్తానన్నారు. అదేమైంది. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.12వేల కోట్లు ఖర్చు చేసింది. కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్లుగా ముస్లింలను ఓటు బ్యాంకుగానే వాడుకుంది. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక పెన్షన్లు పెంచలేదు. రైతుబంధు ఎగ్గొట్టారు. ఆడబిడ్డలకు నెలనెలా రూ.2,500 ఇవ్వడం లేదు. అత్తా కోడళ్ల మధ్య రేవంత్ చిచ్చుపెట్టారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అడ్డగోలు అబద్దపు హామీల ప్రభావానికి గురై మోసపోయిన ప్రజలు ఇవాళ కాంగ్రెస్‌ను తీవ్రంగా ద్వేషిస్తున్నారు’’ అని కేటీఆర్ చెప్పారు.