ఆరు నెలల వరకు నో జాబ్ నోటిఫికేషన్

తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.;

Update: 2025-01-08 14:25 GMT

తెలంగాణలో వివిధ శాఖల్లో ఉన్న ఉద్యోగ ఖాళీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల వరకు ఎటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ రాదని వెల్లడించింది. ఈ మేరకు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ ఛైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. మే 1 నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈలోపు మార్చి 31లోగా రాష్ట్రంలోని అన్ని శాఖల్లో ఉన్న ఉద్యోగాల ఖాళీల గురించిన అన్ని వివరాలు సేకరిస్తామని, వీటి సేకరణ ప్రక్రియ పూర్తయిన వెంటనే భర్తీ ప్రక్రియను శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినట్లు వెల్లడించారు. మే 1 నుంచి నోటిఫికేసన్లు జారీ చేసి ఆ తర్వాత 6 నుంచి 8 నెలల్లోగా అన్ని ఉద్యోగాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించారు. అదే విధంగా గ్రూప్3, గ్రూప్2 కీ విషయంలో కూడా చాలా స్పష్టంగా ఉన్నట్లు చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే పరీక్ష ఫలితాలు వచ్చేలా పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఎటువంటి అడ్డంకులు ఎదురయినా అనుకున్న సమయానికే ఫలితాలు విడుదల చేస్తామని ఆయన చెప్పారు.

అయితే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలు, శ్రేణులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగాలు భర్తీ చేశామని చంకలు గుద్దుకుంటున్న కాంగ్రెస్ నేతలు, మళ్ళీ నోటిఫికేషన్లు విడుదల చేయడం కోసం ఇంత సమయం ఎందుకు తీసుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేయడానికే కాంగ్రెస్ ఇలా చేస్తోందని, అతి త్వరగా కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లను విడుదల చేయాలని బీఆర్ఎస్ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

Tags:    

Similar News