అక్క జ్ఞాపకాలే చెల్లిని గెలిపించాలా ?
గెలిచిన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. నందిత ప్లేసులో ఆమె చెల్లెలు లాస్య నివేదితకు కేసీయార్ టికెట్ ఇచ్చారు.
ఎంఎల్ఏ చనిపోయిన కారణంగా ఉపఎన్నిక వచ్చింది. కాబట్టి ఎంఎల్ఏ మరణం తాలూకు సెంటిమెంటే తమ పార్టీని గెలిపిస్తుందని పార్టీ పెద్దలు అనుకున్నట్లున్నారు. అందుకనే ఉపఎన్నికలో చనిపోయిన ఎంఎల్ఏ చెల్లెలికి టికెట్ ఇచ్చారు. టికెట్ అయితే ఇచ్చారు కాని ప్రచారానికి ఇంతవరకు పార్టీ పెద్దలు ఎవరు మొహంచూపలేదు. దాంతో అభ్యర్ధే ఇపుడు తన అక్క జ్ఞాపకాలను ప్రచారంచేస్తు ఉపఎన్నికలో గెలవాలని నానా అవస్తలు పడుతున్నారు. విషయం ఏమిటంటే ఈమధ్యనే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్ధిగా లాస్యనందిత గెలిచారు. గెలిచిన కొద్దిరోజులకే రోడ్డు ప్రమాదంలో మరణించారు. దాంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. అందుకనే నందిత ప్లేసులో ఆమె చెల్లెలు లాస్య నివేదితకు కేసీయార్ టికెట్ ఇచ్చారు.
నందిత మరణంతాలూకు సెంటమెంటే చెల్లెలును గెలిపిస్తుందని కేసీయార్ అనుకుంటున్నట్లున్నారు. అయితే గ్రౌండ్ లెవల్లో పరిస్ధితి వేరేరకంగా ఉంది. టికెట్ ప్రకటించి చాలారోజులు అయ్యింది. మరో రెండువారాల్లో పోలింగ్ కూడా అయిపోతుంది. ఇప్పటివరకు పార్టీ తరపున ప్రచారం చేసేందుకు కేసీయార్, కేటీయార్, హరీష్ రావు ఎవరూ అడుగుకూడా పెట్టలేదు. పార్టీ అగ్రనేతలే ప్రచారానికి రానపుడు ఇక తమకు మాత్రం అవసరం ఏముందని ద్వితీయశ్రేణి నేతలు కూడా అభ్యర్ధి వైపు చూడటంలేదు. టికెట్ కోసం పోటీపడిన నలుగురు సీనియర్లు కూడా ప్రచారంలో పెద్దగా కనబడటంలేదు. దాంతో నివేదిత ప్రచారంలో ఒంటరైపోయారు. అందుకనే అక్కకు నియోజకవర్గంలో ఉన్న అనుబంధంపైనే చెల్లెలు నివేదిత ప్రచారంలో ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఎంఎల్ఏగా గెలవటానికి ముందు నందిత కంటోన్మెంట్ లో కార్పొరేటర్ గా పనిచేశారు. కాబట్టి నందితకు జనాలతో గట్టి సంబంధాలే ఉన్నాయి.
అలాగే వీళ్ళతండ్రి జీ శాయన్న నాలుగుసార్లు ఎంఎల్ఏగా గెలిచారు కాబట్టి జనాలందరికీ సుపరిచితుడే. అయితే శాయన్న మరణించి చాలాకాలమైపోయింది. అందుకనే నివేదిత ఎక్కువగా అక్క నందిని గురించే ప్రచారంచేస్తున్నారట. కేసీయార్, కేటీయార్, హరీష్ సమస్య ఏమిటంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎన్నిసీట్లు గెలిపించుకుంటేనే పార్టీకి భవిష్యత్తుంటుంది. పార్టీకి ఆశించిన సీట్లు రాకపోతే పార్టీ భవిష్యత్తే ప్రమాదంలో పడిపోతుందనే టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీ ఎంఎల్ఏలు కాంగ్రెస్ లోకి వెళిపోయి, గెలిచిన ఎంపీలు బీజేపీలోకి జంప్ చేస్తే ఇక బీఆర్ఎస్ లో ఉండేదెవరు ? ఉండే నలుగురితో పార్టీని నడపటం కష్టమే. అందుకనే బీఆర్ఎస్ 12 సీట్లలో కచ్చితంగా గెలుస్తుందని కేసీయార్ పదేపదే చెబుతున్నది.
కంటోన్మెంట్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలిచినా ఓడినా కేసీయార్ కు పెద్ద పట్టదు. ఎందుకంటే ఈ ఒక్కసీటులో గెలుపోటములతో పార్టీకి వచ్చేది లేదు పోయేదిలేదు. గెలిస్తే సెంటిమెంటు వర్కవుటైనట్లు. ఒకవేళ ఓడిపోతే కాంగ్రెస్ అధికార దుర్వినియోగంతో గెలిచిందనే స్టేట్మెంట్ పడేస్తే సరిపోతుంది. అదే పార్లమెంటులో ఎక్కువ సీట్లు గెలవకపోతే ఇపుడున్న నేతల్లో పార్టీలో ఎంతమందుంటారో చెప్పటం కష్టం. 25 మంది ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఎంఎల్ఏల గోడదూకుడును అడ్డుకోవాలంటే పార్లమెంటు ఎన్నికల్లో ఎక్కువ సీట్లలో గెలవటం ఒకటే మార్గం. అందుకనే పార్టీలోని ముగ్గురి దృష్టంతా పార్లమెంటు ఎన్నికలపైనే కేంద్రీకృతమయ్యుంది. కాబట్టే కంటోన్మెంట్ ఉపఎన్నికను పెద్దగా పట్టించుకోవటంలేదు. మరి నివేదిత అదృష్టం ఎలాగుందో చూడాలి.